దేవుడు ఆజ్ఞాపించాడు.. పాస్టర్ తాళికట్టాడు

by Anukaran |   ( Updated:2021-06-21 01:05:09.0  )
fake pastor news
X

దిశ, వెబ్‌డెస్క్: దేవుడు శాసించాడు.. ఈ అరుణాచలం పాటించాడు.. ‘అరుణాచలం’ సినిమాలో రజినీకాంత్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ప్రస్తుతం ఈ డైలాగ్ ని ఓ పాస్టర్ తనకు అనువుగా మార్చుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు.. ఈ పాస్టర్ తాళికట్టాడు అని చెప్పుకొంటున్నాడు. ఇక చివరికి పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు ఆఙ్ఞాపించాడని మైనర్ బాలికకు తాళికట్టిన దొంగ పాస్టర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో గతవారం పోలీసుల దృష్టికి రావడంతో బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి అవుతున్నా కొంతమంది మూఢనమ్మకాల వలన దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. కర్ణాటకలోని పలు ప్రాంతాలలో పాస్టర్ జనప్ప అనే వ్యక్తి తాను దేవుడు పంపిన దూతను అని చెప్పుకొంటూ, ప్రజలను నమ్మిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దొంగ పాస్టర్ ని నమ్మిన కొంతమంది ప్రజలు అతను ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మే 14 న చర్చికి ఓ తల్లి, తన కూతురిని తీసుకొని వచ్చింది. పాస్టర్ తనకు దేవుడు ఆఙ్ఞాపించాడని చెప్పి బాలిక మెడలో తాళికట్టాడు. దీంతో షాక్ అయిన బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకోగా తల్లి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు జూన్ 16 న పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జనప్ప పరారయ్యాడు. ఈ ఘటన పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జనప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story