‘నకిలీ’ అధికారుల హల్చల్.. సర్పంచులు, కార్యదర్శులను ఉక్కిరిబిక్కిరి చేసి..!

by Sumithra |
‘నకిలీ’ అధికారుల హల్చల్.. సర్పంచులు, కార్యదర్శులను ఉక్కిరిబిక్కిరి చేసి..!
X

దిశ, పరకాల : సర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలు ‘బీ కేర్ ఫుల్’ ఉన్నతాధికారుల పేరుతో కొంత మంది నకిలీ అధికారులు మీ గ్రామ పంచాయతీని విజిట్ చేయవచ్చు. ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలతో మిమ్మల్ని హడలెత్తించొచ్చు. నసుగుతూ సమాధానం చెప్పారో నగదు రూపంలో మూల్యం చెల్లించాల్సిందే అంటున్నారు పలువురు పంచాయతీ కార్యదర్శులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు హనుమకొండ జిల్లా శాయంపేట మండల ఎంపీడీవో కార్యాలయ పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల విచారణ పేరుతో ప్రభుత్వ అధికారి అని చెప్పి కొందరు నకిలీలు గురువారం హల్‌చల్ సృష్టించారు.

పల్లె ప్రగతి, ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్‌ల నిర్వహణ, గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చామంటూ పెద్దకొడపాక, మైలారం, జోగంపల్లి తదితర గ్రామాల్లో పర్యటిస్తూ అందుబాటులో ఉన్న పంచాయతీ కార్యదర్శులు సర్పంచులను ప్రశ్నించారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు ఉన్నాయంటూ పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించినట్టు సమాచారం. సర్పంచులు, కార్యదర్శుల నుంచి కొంత నగదు సైతం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారిపై అనుమానం వచ్చిన పలువురు సర్పంచులు ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి వాకబు చేయగా నకిలీగా గుర్తించినట్లు తెలుస్తోంది.

మండలంలోని ఓ గ్రామ పంచాయతీ సెక్రెటరీకి ముందస్తుగానే వారి రాకను తెలియపరుస్తూ మొబైల్ నంబర్ 93928 82142 ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శాయంపేట ఎంపీడీవో సైతం వాట్సాప్‌లో నకిలీ అధికారులపై పంచాయతీ కార్యదర్శులను, గ్రామస్తులను అలర్ట్ చేశారు. అధికారులమని పేరు చెప్పుకొని గ్రామాల్లోకి ఎవరు వచ్చినా 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియజేయడం గమనార్హం.

Advertisement

Next Story