నిరుద్యోగులకు టోకరా.. ఫేక్ IFS అధికారి అరెస్ట్

by Aamani |
నిరుద్యోగులకు టోకరా.. ఫేక్ IFS అధికారి అరెస్ట్
X

దిశ, గుడిహత్నూర్ : అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన నకిలీ ఐఎఫ్‌ఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో IFS అధికారిగా చెప్పుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ ఇప్పిస్తానని నకిలీ పత్రాలు సృష్టించి నిరుద్యోగులను మోసం చేసిన పర్చే మోహన్ అనే ఫేక్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్బంగా గుడిహత్నుర్‌లో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. గత ఏడాది ఫిబ్రవరి నెలలో మోహన్ అనే వ్యక్తి బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదు రావడంతో అతనిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో మోహన్ ఎవరికి దొరకకుండా ఏడాది నుంచి జాగ్రత్త పడుతూ ఉంటున్నాడనీ అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం.. పోలీసులు చాక చక్యంగా అతడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుడు ఐఎఫ్ఎస్ అధికారినని చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తన మిత్రుడు సెర్ల నర్సయ్య(జిరాక్స్ సెంటర్ ఓనర్) అనే వ్యక్తి సాయంతో నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి నిరుద్యోగుల వద్ద నుండి మోసపూరితంగా డబ్బులు తీసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి 8 లక్షల 60 వేల రూపాయలు, రూ.50 వేల విలువ గల ప్రింటర్ సామాగ్రీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో పురోగతి సాధించి నకిలీ IFS అధికారిని పట్టుకున్న సీఐ, సీసీఎస్ పోలీస్, గుడిహత్నూర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ సందర్బంగా ఎస్పీ.. నిరుద్యోగులు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని కోరారు. నిరుద్యోగులు నైపుణ్యంతో జాబ్స్ సంపాదించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ రమేష్, స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఏఎస్ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed