- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం కిసాన్ యోజనలో నకిలీ లబ్ధిదారులు
దిశ, తెలంగాణ బ్యూరో : పేద రైతుల్ని ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెడితే ఆ స్కీమ్‌లోకి నకిలీ (అర్హత లేని) లబ్ధిదారులు చొరబడ్డారు. కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా గుర్తించింది. ఈ పథకానికి నిర్దేశించిన అర్హతలకు భిన్నంగా ఆదాయపు పన్ను చెల్లించే సంపన్నులు కూడా లబ్ధిదారులుగా ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. దేశం మొత్తం మీద సుమారు 42.16 లక్షల మంది నకిలీ లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి సుమారు రూ. 2,992.75 కోట్ల మేర లబ్ధి పొందినట్లు తేలింది. తెలంగాణలో సైతం 98,926 మంది అర్హత లేని లబ్ధిదారులు రూ. 65.94 కోట్ల మేర కేంద్రం నుంచి పొందినట్లు తేలింది. ఇప్పుడు వారందరి నుంచి కేంద్ర ప్రభుత్వం రికవరీ చేయాలనుకుంటున్నది.
ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేయడానికి రాష్ట్రాల్లో నోడల్ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా పర్యవేక్షణలో తలెత్తిన లోపం కారణంగా సంపన్నులు కూడా ఈ సాయం పొందుతున్నట్లు నిర్ధారణ అయింది. లబ్ధిదారుల ఆధార్ కార్డులను పరిశీలించిన తర్వాత కొద్దిమంది పాన్ కార్డుల వివరాల్లో ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునేవారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదన్నది ఒక నిబంధన. అయినా రాష్ట్రాలు పంపిన డాటాను పరిగణనలోకి తీసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలవుతున్నది. ప్రతీ సంవత్సరం ఒక్కో రైతుకు ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో కేంద్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నది. ఇప్పుడు అర్హత లేని లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళిన డబ్బును తిరిగి వసూలు చేయనున్నది.
దేశంలో అత్యధికంగా అసోం రాష్ట్రంలో 8.35 లక్షల మంది లబ్ధిదారులకు అర్హత లేకపోయినా ఈ పథకం కింద సాయం పొందారని, ఆ రూపంలో కేంద్రం ఇప్పుడు తిరిగి రూ. 554. కోట్లను వసూలు చేయాలనుకుంటున్నది. తమిళనాడులో 7.22 లక్షల మంది, పంజాబ్‌లో 5.62 లక్షల మంది, మహారాష్ట్రలో 4.45 లక్షల మంది, ఉత్తరప్రదేశ్‌లో 2.65 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 2.51 లక్షల మంది చొప్పున అర్హత లేని లబ్ధిదారులున్నట్లు తేలింది.
ఈ పథకంలోకి నిత్యం కొత్త లబ్ధిదారులు చేరుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తూ ఉంటుంది. లబ్ధిదారుల ఆర్థిక స్థోమత, ఆధార్ కార్డు సీడింగ్ లాంటి అంశాలపై సమీక్షిస్తూ ఉంటుంది. అయినా పొరపాట్లు దొర్లినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ గుర్తించింది.
అర్హత లేని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయిన నగదును తిరిగి రాబట్టుకోడానికి కొన్ని విధానాలను అవలంబించాలనుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ‘స్టాండర్డ్ ఆపరేషనల్ గైడ్‌లైన్స్‘ను జారీ చేసి రికవరీకి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. లబ్ధిదారుల్లో ఆదాయపు పన్ను చెల్లించేవారి వివరాలను సైతం ఆ శాఖ డాటా బేస్ నుంచి సేకరించి అన్ని రాష్ట్రాలకూ పంపారు.
ఇకపైన ఈ పథకం కిందికి లబ్ధిదారులను చేర్చాలనుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలోనే వారి అర్హతలను, వెరిఫికేషన్‌ను పూర్తిచేయాలన్నారు. లబ్ధిదారుల వివరాల ఆధారంగా రాష్ట్రాల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలన్నారు.