ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ.. లాస్ట్ ఇయర్ బిల్లు కడితేనే..

by Shyam |   ( Updated:2021-06-12 10:41:25.0  )
online class
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా కారణంగా గతేడాది మూత పడిన పాఠశాలలు నేటికీ తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్ చదువులకే పరిమితం అయ్యారు. అయితే ఆన్‌లైన్ క్లాసులకు, ఫీజులకు లింకులు పెడుతూ చెల్లించని వారిని ఆన్‌లైన్ తరగతులకు దూరం పెడుతున్నారు. దీంతో కొందరు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఉపాధిలేక, వ్యాపారాలు నడవక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపట్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయి. పరిస్థితులు కుదుట పడిన తర్వాత ఫీజులు కడతామని చెప్పినా వినిపించుకోకుండా విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు హాజరు కానివ్వడం లేదు. దీంతో వారు తర్వాత ఫీజులు చెల్లించినా అప్పటికే పూర్తయిన పాఠాలు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

ఫీజులు చెల్లిస్తేనే..

నగరంలో చాలా వరకు కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలు కాకుండా తాము సొంతంగా రూపొందించిన పుస్తకాల ఆధారంగా బోధన చేస్తున్నారు. ఇవి కేవలం పాఠశాలలోనే అందుబాటులో ఉండడంతో ఫీజు బకాయిలకు పుస్తకాలకు లింకు పెడుతూ ఫీజు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తున్నారు. మరి కొన్ని పాఠశాలల్లో నోటు పుస్తకాలు కూడా తమ వద్దనే కొనాలని నిర్దేశిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండగా పుస్తకాలు లేకుండా చదువు ముందుకు సాగే పరిస్థితి లేకపోవడం, ఫీజుకు, పుస్తకాలకు చివరకు యూనీఫాంకు సైతం లింకు పెట్టి ఫీజు చెల్లించడం తప్పనిసరని చెబుతూ ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో..

ప్రైవేట్ పాఠశాలల్లో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల్లో అధిక శాతం వేతనాలు అందకున్నా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ టీచర్లకు వేతనాలు వస్తున్నా పాఠాలు చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నా వీటిల్లో చదివే విద్యార్థులు చాలా వరకు పేద వారే కావడం, వారి వద్ద వీడియో పాఠాలు వినేందుకు అండ్రాయిడ్ సౌకర్యం ఉన్న ఫోన్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో తరగతులకు హాజరు కావడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తమ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed