వైరాలో హద్దు మీరిన మద్యం మాఫియా వార్.. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ..!

by Sridhar Babu |
wine
X

దిశ, వైరా: వైరాలో మద్యం మాఫియా ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. మద్యం వ్యాపారులు రెండు వర్గాలుగా ఏర్పడి హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. ఈ వర్గాల మద్యం మాఫియా వార్ తారాస్థాయికి చేరింది. రెండు వర్గాలకు చెందిన వ్యాపారులు సొంతంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లోని బెల్టు షాపులపై విచ్చలవిడిగా దాడులు చేయిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నేరుగా బెల్టుషాపు దుకాణ యజమానుల ఇళ్లల్లోకి వెళ్లి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. రెండు వర్గాల వారు పోటాపోటీగా బెల్టుషాపులపై దాడులు చేస్తుండటంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. బహిరంగంగా ప్రయివేటు సైన్యం దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తోన్న తమ దృష్టికి తెలియదన్నట్లు ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు ఈ వ్యవహారంపై కనీసం స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గం వారు వెళ్లిన తర్వాత మరో వర్గం వారు బెల్టు షాపులపై దాడులు చేస్తూ నిర్వాహకులను తమవద్దే మద్యం కొనుగోలు చేయాలని వారు తీవ్ర ఒత్తిడి కి గురి చేస్తున్నారు. తమ వద్ద మద్యం కొనుగోలు చేయకుంటే నీ అంతు చూస్తామని రెండువర్గాలు బహిరంగంగా బెదిరిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇది వైరా మండలంలో మద్యం మాఫియా ఆగడాలు తీరు. గతంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో మూడు వైన్ షాపు‌లు ఉండేవి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ వైరా మండలాని‌కి మరో రెండు నూతన మద్యం షాపులను మంజూరు చేశారు. వైరాలోని మూడు షాపులతో పాటు మండలంలోని రెబ్బవరం, పాలడుగు గ్రామాలకు మద్యం షాపులను కేటాయించారు. అయితే ప్రస్తుతం మండలంలో ఉన్న ఐదు షాపుల్లో మూడు షాపుల యజమానులు ఒక వర్గంగా ఒక షాపు యజమాని మరో వర్గంగా ఉన్నారు. వైరాకు చెందిన మరో షాపు యజమాని తటస్థంగా ఉన్నారు. ఇటీవల వైరాలోని షాపుల నిర్వాహకులు చేసిన సిండికేట్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రెబ్బవరంలో షాపు దక్కించుకున్న వ్యాపారి ఈ సిండికేట్ వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి మొదలైన రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఈ రెండు వర్గాల వారు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి బెల్టు షాపులపై దాడులకు దిగారు. వైరాలోని బెల్టుషాపుల నిర్వహకులకు తమ వద్ద మద్యం తీసుకువెళ్లాలని హుకూం జారీ చేస్తున్నారు. రెబ్బ వరంలో ఉన్న వ్యాపారి.. గ్రామీణ ప్రాంత బెల్ట్ షాపు నిర్వాహకులను రెబ్బవరంలో కానీ పాలడుగు లో కానీ మద్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఇరువర్గాల వారు బెల్టుషాపుల వద్దకు వెళ్లి వారి ప్రత్యర్థులు వద్ద తెచ్చిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. బెల్టు షాపులపైకి వచ్చిన ప్రైవేటు సైన్యాన్ని ఆ షాపు నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే భౌతిక దాడులు చేసేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. గత నెల రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగా జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకు తెలియదంటూ మాటలను దాటవేస్తున్నారు. మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ దాడుల పై కొత్త అర్థం చెబుతున్నారు. ఈ విషయమై వైరా ఎక్సైజ్ సీఐ రమ్యను దిశ వివరణ కోరగా బెల్టు షాపులు నిర్వహించటమే చట్ట విరుద్ధమన్నారు. బెల్టు షాపులపై మద్యం మాఫియా చేస్తున్న దాడులు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. తమకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed