ఖజానాకు లాక్..పెండింగ్ బిల్లులకు బ్రేక్

by Shyam |   ( Updated:2021-05-15 10:49:13.0  )
ఖజానాకు లాక్..పెండింగ్ బిల్లులకు బ్రేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఖజానాకు మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం జీతాలకు మాత్రమే సడలింపు ఇస్తున్నారు. కేవలం వేతనాల బిల్లులు మినహా.. మరే బిల్లులు చేయరాదంటూ స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్పుతున్నారు. కొన్ని అత్యవసర బిల్లులను కూడా ఆపేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు వైద్యారోగ్య శాఖకు సంబంధించిన కొన్ని అత్యవసరమైన బిల్లులు తప్ప మరేం చేయరాదంటూ ఫైనాన్స్​అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు.

కరోనా కాలం..

రాష్ట్రంలో లాక్‌డౌన్​అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్​అనివార్యమైంది. అయితే ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే మద్యం దుకాణాలను నాలుగు గంటల పాటు తెరుస్తున్నా విక్రయాలు చాలా మందగించాయి. మరోవైపు భూముల రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ పన్నులు మొత్తం ఆగిపోయాయి. ఈ లాక్​డౌన్​ ఇంక ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా స్పష్టత రావడం లేదు. ఇలాంటి సమయంలో ఉన్న నిధులను ఆచితూచీ ఖర్చు పెట్టుకోవాలంటూ ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నదాంట్లోనే కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నెల వేతనాలకే..!

ప్రస్తుతం ఈ నెల వేతనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్లు మాత్రమే విడుదల చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొంతమందికి ఇప్పటికే రిటైర్మెంట్​ గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంది. కానీ వాటిని ఈసారి ఇవ్వడం లేదని సమాచారమిచ్చారు. అయితే కొత్తగా పెంచిన పీఆర్సీ అమలుపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుత పరిణామాల్లో ఆర్థిక శాఖకు సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్పుతున్నారు. కేవలం వేతనాల బిల్లులు మాత్రమే పూర్తి చేయాలని, ఆయా శాఖల నుంచి వచ్చే ఇతర బిల్లులన్నీ పెండింగ్​లో పెట్టాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన జీపీఎఫ్‍, మెడికల్‍ రీయింబర్స్మెంట్‍, లీవ్‍ ఎన్‍ క్యాష్‍మెంటు బిల్లుల చెల్లింపులకు కూడా కష్టమేనని అధికారులు చెప్పుతున్నారు. వాటి కోసం అడిగుతున్న వారి కూడా ఇంకో నెల ఆగాల్సిందే అంటూ సూచిస్తున్నారు.

పాత చెక్కులపై ఫ్రీజింగ్..

​రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖతో పాటు రోడ్లు, జీహెచ్​ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్​ విభాగాల్లో పనుల బిల్లులన్నీ బకాయి ఉన్నాయి. ప్రస్తుత నేపథ్యంలోనే గత నెల నుంచే ఈ పనులకు బిల్లులు చెల్లించడం లేదు. అయితే కొన్ని బిల్లులకు టోకెన్లు జారీ చేసినా నగదు మాత్రం రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా విభాగాల్లో రూ. 19 వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు అధికారవర్గాలు చెప్పుతున్నాయి. నీటిపారుదల శాఖలో రూ. 14 వేల కోట్లు, ఆర్​అండ్​బీలో రూ. 1200 కోట్లు, జీహెచ్​ఎంసీ, మున్సిపాలిటీల్లో రూ. 1000 కోట్లు, పంచాయతీరాజ్​లో రూ. 900 కోట్లు, మిషన్​ భగీరథ పనులకు సంబంధించిన రూ. 800 కోట్లు ఇలా మొత్తం రూ. 19 వేల కోట్ల బిల్లులు బాకీ ఉంది. అయితే ఈసారి కూడా ఈ బిల్లులు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పంచాయతీలకు కూడా అంతే..

రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించి మార్చి రెండో వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 1300 కోట్లు పెండింగ్​లో ఉండగా… ఈ చెక్కులను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అయితే పల్లె ప్రగతి నిధులు మాత్రం కొంత మేరకు విడుదల చేశారు. అయితే నిదులున్నా… కొన్ని చెక్కులు ట్రెజరీల నుంచి మాత్రం బయటకు రావడం లేదు. ఖాతాల్లో పల్లె ప్రగతి నిధులు కనిపిస్తున్నా చెక్కులు క్యాష్​ కావడం లేదు. వీటితో పాటుగా ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, హరితహారం వంటి పనుల బిల్లులు కూడా ఆపేశారు.

ట్రాక్టర్లకు ఎలా..?

ప్రస్తుతం ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లింపులు వచ్చే నెలలో చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు మినహా… ఒక్క రూపాయి విడుదల చేయరాదంటూ స్పష్టంగా సూచిస్తోంది. ఇప్పుడు పంచాయతీల్లో తీసుకున్న ట్రాక్టర్లకు ఈఎంఐ చెల్లింపులు కష్టంగా మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ చెక్కులు రిటర్న్​ కావడంతో సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శుల ఖాతాలపై ప్రభావం పడుతోంది. ఈసారి కూడా చెక్కులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం బిల్లులు విడుదల చేసే ఛాన్స్​ లేదని అధికారులు చెప్పుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed