మేయర్ ఎన్నికపై వాళ్లే ‘కీ’లకం.!

by Anukaran |
మేయర్ ఎన్నికపై వాళ్లే ‘కీ’లకం.!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎక్స్​ అఫిషియో సభ్యులే కీలకం కానున్నారు. నిజానికి గెలుపొందిన కార్పొరేటర్లే మేయర్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సవరించిన పురపాలక చట్టాల కారణంగా నగర పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా మేయర్ ఎన్నికలో అనివార్య భాగస్వాములవుతున్నారు. మహా నగర బల్దియాలో 150 మంది కార్పొరేటర్లతోపాటు మరో 52 మందికి పైగా ఎక్స్​ అఫిషియో సభ్యులు మేయర్ ఎన్నికలో ఓటేసే హక్కు కలిగి ఉన్నారు. శివారు ప్రాంతాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నకలలో కొందరు ఇప్పటికే ఓటేసినందున ఈ సంఖ్య మారే అవకాశం ఉంది.

కల్వకుంట్ల కవిత, బుగ్గారపు దయానంద్​, బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న కొత్తగా ఎమ్మెల్సీలు అయ్యారు. వారు ఎక్కడైనా నమోదు చేసుకునే వీలుంది. ఇప్పటికే ముగ్గురు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు చేసుకున్నట్లు సమాచారం. బీజేపీ మేయర్ పదవి పొందాలంటే వంద స్థానాలు గెలుపొందాలి. టీఆర్ఎస్​ పార్టీ కూడా 70కి పైగా స్థానాలు దక్కితేనే ఒంటరిగా మేయర్ పీఠం దక్కించుకోగలుగుతుంది. ఎంఐఎం పోటీ చేసిన స్థానాలన్నింట్లో గెలిచినా బల్దియా కింగ్​ కాలేదు. టీఆర్ఎస్ కు అవసరమైన స్థానాలు రాకపోతే ఎవరి మద్దతు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ సీఎం కేసీఆర్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. మరి మేయర్ పీఠం కోసం మళ్లీ మిత్రబంధం బలపడుతుందా? మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకుంటారా? వేచి చూడాలి. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్​, ఎంఐఎంలకు బీజేపీ మద్దతు ఇవ్వదన్న చర్చ కూడా ఉంది.

బలం.. బలగలం

టీఆర్ఎస్ కు 31 మంది ఎక్స్​ అఫిషియో సభ్యులు ఉన్నారు. వీరిలో ఏడుగురు హైదరాబాద్​ నగర శివారు మున్సిపాలిటీలలో చైర్మన్ పీఠాల కోసం ఓటేశారు. ఇందులో రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, డి.శ్రీనివాస్, బండ ప్రకాశ్​ ఉన్నారు. కేశవరావు తుక్కుగూడలో పేరు నమోదు చేయించుకున్నారు. తీరా చైర్మన్ ఎన్నికపుడు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో మళ్లీ గ్రేటర్​ హైదరాబాద్​ లో నమోదు చేసుకోవచ్చునో లేదోనన్న అనుమానాలు ఉన్నాయి. బండ ప్రకాశ్​ మాత్రం ఆదిభట్లలో ఓటేశారు. రాజేంద్రనగర్​, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు ప్రకాశ్​ గౌడ్, సబితారెడ్డి, వివేకానంద, చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్​ రెడ్డి, నవీన్​ రావు, ఎం.శ్రీనివాస్​ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కు 24 మంది మిగిలారు. కాంగ్రెస్​ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. గెలిచిన ఎల్బీనగర్​, మహేశ్వరం ఎమ్మెల్యేలు డి.సుధీర్​ రెడ్డి, సబితారెడ్డి అధికార పార్టీలో చేరి కీలక పదవులను అలంకరించారు. ఇక కాంగ్రెస్​ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ఇప్పటికే బోడుప్పల్​ లో ఎక్స్​అఫిషియో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోసారి అవకాశం లేదు. బీజేపీకి మూడు (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ) ఓట్లు ఉన్నాయి. ఎంఐఎంకు కూడా పది మంది సభ్యులు ఉన్నారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్/మేయర్ ఎన్నికకు ముందు ఎక్స్​ అఫిషియో సభ్యత్వ నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అప్పుడు రాత్రికి రాత్రే ఎలా నమోదు చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్​ అధికార పార్టీపై దుమ్మెత్తి పోశాయి. ఏ సమయంలో దరఖాస్తు చేసుకున్నారో చెప్పాలంటూ అధికారులను నిలదీశాయి. ఇప్పుడూ గ్రేటర్ పీఠం ఎన్నికకు మరోసారి ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లెక్క పక్కా కావాలంటే ముందు రోజు వరకు వేచి చూడాల్సిందే.

కింగ్​ మేకర్లుగా మారి

తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్స్​ అఫిషియోలుగా నమోదు చేయించుకున్నారు. దాంతో మున్సిపాలిటీ పీఠం అధికార పార్టీకే దక్కింది. ఆదిభట్లలోనూ టీఆర్ఎస్​ తరపున ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్​ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ఓట్లేశారు. దాంతో ఫలితాలు తారుమారయ్యాయి. పెద్ద​అంబర్ పేట మున్సిపాలిటీలో ఎమ్మెల్సీలు నవీన్​ రావు, మహేందర్​ రెడ్డి ఓటు వేశారు. కాంగ్రెస్​ పార్టీకి దక్కాల్సిన కుర్చీ టీఆర్ఎస్​ పార్టీ ఖాతాలో చేరింది. నార్సింగి మున్సిపాలిటీలోనూ రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​, ఎంపీ రంజిత్​ రెడ్డి ఓట్లేశారు. అక్కడా కాంగ్రెస్​ పార్టీ దెబ్బ తింది. బోడుప్పల్​ లోనూ మంత్రి మల్లారెడ్డి చామకూర, ఎంపీ రేవంత్​ రెడ్డి ఎక్స్​ అఫిషియో సభ్యులుగా చేరారు. కొంపెల్లి మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే వివేకాంద ఓటు హక్కును వినియోగించుకుంటేనే టీఆర్ఎస్​ కు చైర్మన్​ కుర్చీ వచ్చింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్​అఫిషియో సభ్యులు ప్రజా నిర్ణయాన్ని తారుమారు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed