కవిత ఎంట్రీ .. పై‌చేయి కోసం తహ తహ

by Shyam |   ( Updated:2020-06-29 23:37:13.0  )
కవిత ఎంట్రీ .. పై‌చేయి కోసం తహ తహ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయ రసకందాయంలో పడింది. రాష్ర్ట ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు ఇచ్చిన గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై పై‌చేయికోసం తహ తహ లాడుతున్నాయి. ఏ చిన్న విషయం దొరికినా దానిని రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఎన్నికల సంఘానికి షురూ అయిన పరస్పర ఫిర్యాదులు ప్రస్తుతం పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డిపై సొంతపార్టీ మహిళ నేత ఫిర్యాదుతో ఎల్లారెడ్డి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ప్రతిపక్ష పార్టీ నేతలు దగ్గరుండి కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలను ఆసరాగా చేసుకుని కేసు నమోదు చేయించారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు, ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు, పరస్పర ఆరోపణలకు తావిచ్చిన ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జూలై మాసంలో జరిగే వరకు రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.

క్యాంపు రాజకీయాలు..

నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఉన్న డాక్టర్ భూపతి రెడ్డిపై ఆనర్హత వేటు పడటంతో ఉమ్మడి జిల్లాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 12న ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా వేడేక్కాయి. టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికి క్రాస్ ఓటింగ్ భయంతో ఇతర పార్టీ నేతలను చేర్చుకున్నాయి. దీంతో అధికార పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. కరోనా కాలంలో హైదరాబాద్ రిసార్టులో గులాబీ నేతలు క్యాంపు రాజకీయాలను షురూ చేసిన నాడు ఫిర్యాదుల పరంపర మొదలైంది. మధ్యలో కొవిడ్ మహమ్మారి దెబ్బకు ఏప్రిల్ 7న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వాయిదా పడింది. మే 23న రాష్ర్ట ఎన్నికల సంఘం మరోసారి ఉప ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయింపులు..

కరోనా కాలంలో అధికార పార్టీ వలసలకు తెరలేపింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ లను గులాబీ గూటికి చేర్చుకున్నది. దీంతో ఎన్నికల కోడ్ అమలు‌లో ఉన్న కాలంలో ఎలా పార్టీ ఫిరాయింపులను మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఎలా ప్రోత్సహిస్తారని ప్రతి‌పక్ష పార్టీలు కేంద్ర, రాష్ర్ట ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు చేశాయి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పటిదాకా పార్టీలపరంగా జరిగిన ఫిర్యాదులు కాస్తా వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే వైపుగా మళ్లాయి. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లక్ష్యంగా అఫిడవిట్‌లో చూపిన విద్యార్హతలు, పసుపు బోర్డుపై ఆరోపణలు చేశారు. ఆ విషయం సద్దుమణగకముందే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వడ్డెపల్లి సుభాష్ రెడ్డిపై సొంత పార్టీ మహిళా నేత ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సుభాష్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేత రెండ్రోజులకే అధికార పార్టీ నాయకురాలితో ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. దాంతో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు, విమర్శలను అధికార పార్టీపైకి మళ్లించారు. ఇలా విమర్శలు ఒక పార్టీ నుంచి మరొకపార్టీపై మళ్లుతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక జరిగే వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీలోకి మారుతారో, ఎవరిపై ఫిర్యాదులు వస్తాయో, ఎవరిపై కేసులు నమోదు అవుతాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed