క్రికెటర్లకు రొటేషన్ పద్దతి

by Anukaran |   ( Updated:2021-01-30 07:21:23.0  )
క్రికెటర్లకు రొటేషన్ పద్దతి
X

దిశ, స్పోర్ట్స్ : స్వదేశంలో క్రికెట్ ఆడితే మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. విదేశాలకు వెళితే కుటుంబాలను వెంట తీసుకెళ్లే వెసులు బాటు ఉండేది. కరోనా మహమ్మారి తర్వాత క్రికెటర్లు జైలు లాంటి బయోబబుల్‌లో రోజుల తరబడి గడపాల్సి వస్తున్నది. ఒకవైపు వరుస మ్యాచ్‌లతో శారీరికంగా అలిసిపోయి.. మరోవైపు ఒంటరిగా హోటల్ గదుల్లో గడుపుతూ మానసికంగా కుంగిపోతున్నారు. భారత క్రికెటర్లు చాలా మంది గత ఏడాది అగస్టు చివరి వారంలో యూఏఈ వెళ్లి బయోబబుల్‌లో ఉన్నారు.

అప్పటి నుంచి ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగిసే వరకు దాదాపు 6 నెలల పాటు బయోబబుల్‌లో గడిపి పూర్తిగా అలసి పోయారు. బ్రిస్బేన్‌లో కఠినమైన క్వారంటైన్‌లో కూడా గడిపారు. దీంతో ఇండియా వచ్చిన వెంటనే క్రికెట్‌ను పక్కన పెట్టి పూర్తిగా రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్లారు. కానీ పది రోజులు తిరిగే సరికి మళ్లీ ఇంగ్లాండ్ పర్యటన కోసం బయోబబుల్‌లో ప్రవేశించారు. ఏదో ఒక ఫార్మాట్ ఆడే వాళ్లకు మధ్యలో కాస్త విరామం అయినా దొరుకుతున్నది. కానీ మూడు ఫార్మాట్లలో ఆడే వారికి మాత్రం వరుస మ్యాచ్‌లతో శారీరిక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రోటేషనే మంత్రం..

క్రికెటర్లపై భారం తగ్గించేందుకు రొటేషన్ పద్దతి అమలు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లు రెండు అంతకంటే ఎక్కువ ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టీ20, వన్డే, టెస్టులు వరుసగా ఆడుతూ అలసి పోవడమే కాకుండా.. కొన్ని సార్లు గాయాల బారిన కూడా పడుతున్నారు. వీరిని ఏదైనా ఫార్మాట్ నుంచి తప్పించడమో లేదా కొన్ని మ్యాచ్‌ల తర్వాత సెలవు ఇవ్వడం ద్వారా వారికి విశ్రాంతి లభిస్తుందని బీసీసీఐ భావిస్తున్నది. టీమ్ ఇండియా బెంచ్ యువ క్రికెటర్లతో బలంగా ఉన్నది. సీనియర్లు లేకపోయినా.. వారి స్థాయిలో జట్టు అవసరాలు తీర్చ గలిగే సత్తా కలిగి ఉన్నారు. దీంతో రొటేషన్ పద్దతిలో ఇద్దరు లేదా ముగ్గురు క్రికెటర్ల చొప్పున విశ్రాంతి కల్పించాలని భావిస్తున్నారు.

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ ఆటగాళ్లకు ఇప్పటికే ఈ పద్దతిని ఆచరణలో పెట్టింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్‌కు విశ్రాంతి ఇచ్చింది. ఆ టెస్టుల్లో ఆడిన జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో లకు ఇండియాతో జరుగనున్న తొలి టెస్టు అనంతరం విశ్రాంతినిచ్చింది. వారిద్దరూ తొలి టెస్టు ఆడి ఇంగ్లాండ్ వెళ్లిపోనున్నారు. ఇక శామ్ కర్రన్, మార్క్‌వుడ్ తొలి రెండు టెస్టులకు విశ్రాంతినిచ్చారు. 2021లో ఇంగ్లాండ్ జట్టు 17 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది. అంతే కాకుండా ఏడాది చివర్లో ఇండియాలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనాల్సి ఉన్నది. కాబట్టి, ఆటగాళ్లు గాయాలు పాలు కాకుండా సరైన విశ్రాంతి లభించడానికి రొటేషన్ పద్దతిని అమలు చేస్తున్నది.

మాజీ క్రికెటర్ల విముఖత..

ఈసీబీ అమలు చేస్తున్న రొటేషన్ పద్దతిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంచి పామ్‌లో ఉన్న క్రికెటర్లు అర్దాంతరంగా జట్టుకు దూరమై విశ్రాంతి తీసుకోవడం వల్ల వారి ఆటలో తేడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, నాసిర్ హుస్సేన్, మైఖెల్ వాగన్ ఈసీబీ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. పూర్తి జట్టుతో ఇండియాలో ఆడటమే కష్టమైన పని.. అలాంటిది కీలకమైన ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చి ఎలా గెలవాలని భావిస్తున్నారో చెప్పాలని ఈసీబీని డిమాండ్ చేస్తున్నారు. ఏ క్రికెటర్ అయినా, అథ్లెట్ అయినా వరుసగా ఆడుతుంటేనే వారి ఆట మెరుగవుతుంది.. గత ఏడాది కరోనా కారణంగా ఆరు నెలలకు పైగా ఇళ్లలోనే ఉన్నారు.

ఇప్పుడు ప్రత్యేకంగా విశ్రాంతి పేరుతో రొటేషన్ పద్దతి అనుసరించడం వృధా అని అంటున్నారు. క్రికెటర్లు అలసిపోతారని భావిస్తే వారికి సరైన ట్రైనర్లను, మెంటల్ హెల్త్ ట్రైటర్లను నియమిస్తే వారికి ఉపశమనం లభిస్తుంది. ఇంటిలో కూర్చోవడం వల్ల క్రికెటర్లకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండదని మాజీలు వాదిస్తున్నారు. టీమ్ ఇండియాలోని పలువురు క్రికెటర్లు కూడా రొటేషన్ పద్దతిపై పెదవి విరుస్తున్నారు. ఐసీసీ టోర్నీలకు సిద్దపడాలంటే వరుసగా మ్యాచ్‌లు ఆడితేనే వస్తుంది తప్ప విశ్రాంతి తీసుకోవడం వల్ల లాభం ఉండదని అంటున్నారు. క్రికెటర్ల వెంట కుటుంబాలను తీసుకెళ్లడానికి అనుమతిస్తే వారి మానసిక ఆందోళన కాస్త తగ్గించొచ్చని అంటున్నారు. మరి క్రికెటర్లు, మాజీలు అందరూ విమర్శిస్తున్న ఈ పద్దతిపై ఈసీబీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మరి ఈ సమయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed