పాత కార్పొరేట‌ర్లు వ‌ర్సెస్ కొత్త కార్పొరేట‌ర్లు

by Anukaran |
పాత కార్పొరేట‌ర్లు వ‌ర్సెస్ కొత్త కార్పొరేట‌ర్లు
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: గ్రేట‌ర్ ప‌రిధిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల మధ్య అధికారం మాదంటే.. మాదంటూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గోషామ‌హ‌ల్, ఎల్బీన‌గ‌ర్, ముషీరాబాద్ త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో విచిత్రమైన ప‌రిస్థితి నెల‌కొంది. గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఆరు డివిజ‌న్లు ఉండ‌గా ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఐదు డివిజ‌న్లను కైవ‌సం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే సైతం బీజేపీ పార్టీకి చెందిన రాజాసింగ్ ఉన్నారు. 2016 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి ముగ్గురు టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఉన్నారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య ప్రచ్చన్న యుద్ధం జ‌రుగుతోంది. పాత కార్పొరేట‌ర్లు బ‌స్తీల్లో పెండింగ్ లో ఉన్న ప‌నులు చేయించ‌డం, ఓడిపోయినా ప్రజల్లో తిరుగుతుండడంతో కొత్తపాత కార్పొరేట‌ర్ల మ‌ధ్య వివాదాల‌కు ఆజ్యం పోసినట్లు అవుతోంది.

అధికారులు, నూత‌న కార్పొరేట‌ర్లతో స‌మావేశం

గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఒక్కడుగు ముందుకు వేసి ఏకంగా కొత్తగా గెలిచిన కార్పొరేట‌ర్లు, అధికారుల‌తో ఓ హోట‌ల్ లో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల గెలిచిన కార్పొరేట‌ర్లు ఎలాంటి బాధ్యతలు స్వీక‌రించ‌క పోయినప్పటికీ, పాత కార్పొరేట‌ర్ల పద‌వీకాలం ముగియ‌న‌ప్పటికీ ఆయ‌న అధికారుల‌కు ములాఖత్ పేరుతో స‌మావేశం ఏర్పాటు చేసి ఇక నుంచి త‌మ పార్టీ కార్పొరేట‌ర్లు చెప్పిన విధంగా న‌డుచుకోవాల‌ని అధికారుల‌కు హుకుం జారీ చేసిన‌ట్లు స‌మాచారం. దీనికి అధికారులు సైతం ఎందుకులే గొడ‌వ‌, రెండు నెల‌లు చూసీచూడ‌న‌ట్లు పోతే స‌మ‌స్యకు ప‌రిష్కారం దొర‌కుతుంద‌నే భావ‌న‌తో మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎల్బీ న‌గ‌ర్, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో..

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం11 డివిజ‌న్లు ఉండ‌గా ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని డివిజ‌న్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2016లో జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఇక్కడ అన్ని డివిజ‌న్లను అధికార టీఆర్ఎస్ కైవ‌సం చేసుకోగా తాజా ఎన్ని‌కల్లో సీన్ రివ‌ర్స్ అయింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌కు చెందిన సుధీర్ రెడ్డి ఉన్నారు. కాగా టీఆర్ఎస్ 11 మంది పాత కార్పొరేట‌ర్లు,11 మంది నూత‌నంగా గెలిచిన బీజేపీకి చెందిన కార్పొరేట‌ర్ల మ‌ధ్య విభేదాలు అప్పుడే మొద‌ల‌య్యాయి. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. 2016 లో నియోజ‌క‌వ‌ర్గంలోని 6 డివిజ‌న్లకు 5 డివిజ‌న్లను టీఆర్ఎస్, ఒక డివిజ‌న్ ను ఎంఐఎం కైవ‌సం చేసుకున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ కూడా అధికార పార్టీకి చుక్కెదురైంది. 5 డివిజ‌న్లను బీజేపీ గెలుచుకోగా ఒక డివిజ‌న్ ను ఎంఐఎం నిల‌బెట్టుకుంది. ఇక్కడ సైతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు. ఇలా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ ఘోరంగా దెబ్బతిన‌గా బీజేపీ బ‌ల‌మైన ప‌ట్టు సాధించింది. దీంతో పాత కార్పొరేట‌ర్లకు, కొత్త కార్పొరేట‌ర్లకు అధికారం కోసం ఆదిప‌త్య పోరు మొద‌లైంది. దీనికి ఎమ్మెల్యేలు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని తెలిసింది. ఇదే ప‌రిస్థితి జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొన‌సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed