MLC ఎన్నికలకు సర్వం సిద్దం.. గెలుపులో వారి ఓట్లే కీలకం..

by Sridhar Babu |
ap elections
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జరగనున్న పోలింగ్‌లో 1,324 మంది ఓటర్ల కోసం 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 1 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థల్లోని కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలింగ్ పర్యవేక్షణ అంతా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డు చేయనున్నారు. పోలింగ్ కోసం 36 మంది ఎన్నికల సిబ్బందిని నియమించగా, నిరక్షరాస్యులైన నలుగురు ఓటర్ల కోసం ప్రత్యేకంగా సహాయకులను కూడా నియమించారు. ఓటు వేసేందుకు ఒకటే బ్యాలెట్ పేపర్‌ను వినియోగించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉండగా ఇందు కోసం ఎన్నికల కమిషన్ అందించే పెన్నులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించే అవకాశం మాత్రం లేదని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి.కర్ణన్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరంలో ఓటర్లు క్యూలో నిల్చునేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు మాస్కులు, శానిటైజర్లను, హెల్త్ వర్కర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1113 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. 8 రూట్ల కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి తీసుకువెళ్లే వాహనాలకు ఎస్కార్టు ఏర్పాటు చేశామన్నారు.

ఓటర్ల వివరాలివే..

కరీంనగర్ పోలింగ్ కేంద్రంలో మొత్తం 205 మంది ఓటర్లు ఉండగా వీరిలో 94 మంది పురుషులు, 111 మంది మహిళలు ఉన్నారు. కార్పొరేటర్లు 60 మంది, కౌన్సిలరల్లు 25 మంది, 9 మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు 197 మంది, ఎక్స్ అఫిషియో సభ్యులు నలుగురు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హుజురాబాద్‌లో 180 మంది ఓటర్లలో 83 మంది పురుషులు, 97 మంది మహిళలు ఉన్నారు. 60 మంది కౌన్సిలర్లు, 9 మంది జడ్పీటీసీలు, 111 మంది ఎంపీటీసీలు ఓటు వేయనున్నారు. జగిత్యాలలో 220 మందిలో 96 మంది పురుషులు, 124 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 75 మంది కౌన్సిలర్లు, 12 మంది జడ్పీటీసీలు, 130 మంది ఎంపీటీసీలు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. కోరుట్లలో 146 మందిలో 62 మంది పురుషులు, 84 మంది మహిళలు ఉన్నారు. 59 మంది కౌన్సిలర్లు, ఆరుగురు జడ్పీటీసీలు, 80 మంది ఎంపీటీసీలు, ఒక ఎక్స్ అపిషియో సభ్యుడు ఉన్నారు.

పెద్దపల్లిలో 208 మంది ఓటర్లలో 94 మంది పురుషులు, 114 మంది మహిళలు, 49 మంది కార్పొరేటర్లు, 51 మంది కౌన్సిలర్లు, 9 మంది జడ్పీటీసీలు, 97 మంది ఎంపీటీసీలు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మంథనిలో 98 మంది ఓటర్లలో 39 మంది పురుషులు, 59 మంది మహిళలు ఉన్నారు. 13 మంది కౌన్సిలర్లు, 9 మంది జడ్పీటీసీలు, 75 మంది ఎంపీటీసీలు, ఒక ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. సిరిసిల్లలో 201 మందిలో 88 మంది పురుషులు, 113 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 66 మంది కౌన్సిలర్లు, 12 మంది జడ్పీటీసీలు, 121 మంది ఎంపీటీసీలు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. హుస్నాబాద్‌లో 68 మందిలో 25 మంది పురుషులు, 41 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 20 మంది కౌన్సిలర్లు, నలుగురు జడ్పీటీసీలు, 41 మంది ఎంపీటీసీలు, ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడు ఓటు వేయనున్నారు.

మహిళ ప్రతినిధులే కీలకం..

ఉమ్మడి జిల్లాలో 1,324 మంది ఓటర్లలో మహిళా ప్రజా ప్రతినిధులే ఎక్కువ మంది ఉన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వీరి నిర్ణయం కీలకం కానుంది. 743 మంది మహిళలు ఉండగా పురుషులు మాత్రం 581 మంది మాత్రమే ఉన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed