చినుకు పడితే.. చిత్తడే

by Shyam |
చినుకు పడితే.. చిత్తడే
X

దిశ, కుత్బుల్లపూర్: వర్షాకాలం వచ్చిందంటే కుత్బుల్లాపూర్ వాసుల కష్టాలు వర్ణనాతీతం. వర్షం వచ్చినప్పుడల్లా ఎటు నుంచి వరదలు వస్తాయోననే ఆందోళనలో ప్రజలున్నారు. ఏటా ఈ తిప్పలు పడాల్సిందేనా? మా బతుకులు మారవా? అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వాన పడితే పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు నిలిచిపోతోంది. చిన్నపాటి వర్షాలకే కుంటలను తలపిస్తున్నాయని, వర్షం ఎక్కువగా పడితే ఇండ్లల్లోకి కూడా వస్తాయని ప్రజలు తెలియజేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యిందని స్థానికులు వాపోతున్నారు.

లోతట్టు ప్రాంతాలు..

జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీ ఎస్సార్ డీజీ స్కూల్, ఎంఎన్ రెడ్డి నగర్, బ్యాంక్‌కాలనీ, వెంకటేశ్వరనగర్, గాయత్రినగర్ తదితర ప్రాంతాలు వర్షాలు కురిస్తే చెరువులను తలపిస్తాయి. గాజులరామారం డివిజన్ పరిధిలోని ప్రకాశం పంతులు నగర్, మహదేవపురం, సూరారం గ్రామం, శివానగర్, జగద్గరిగుట్టలోనూ సమస్య తీవ్రంగా ఉంది. నిజాంపేట నుంచి బాచుపల్లి వెళ్లే రోడ్డులోనికాలనీలు పూర్తిగా నీటి కుంటలతో కన్పిస్తాయి.

అడ్డుకట్ట వేయాలి..

జీడిమెట్ల డివిజన్ పరిధిలోని 65 శాతం కాలనీలలో ఉన్న వరద నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే మిలిటరీ ప్రాంతం నుంచి వచ్చే వరదకు అడ్డు కట్ట వేయాలి. ఇందుకు గానూ బ్యాంక్ కాలనీ పైభాగం నుంచి వచ్చే వరద నీటి తరలింపునకు కాలనీ కొత్త సంక్షేమ సంఘం భవనం నుంచి వెంకటేశ్వర కాలనీ, దత్తాత్రేయ నగర్, వెంకన్నహిల్స్ మీదుగా ఫాక్స్ సాగర్ నుంచి వస్తున్న నాలాలోకి పైప్‌లైన్ వేయాలి. నిజాంపేటలోని సమస్య పరిష్కారానికి కూడా వరద కాలువలు తవ్వించాలి.

Advertisement

Next Story

Most Viewed