- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రకం కరోనాపై ఈటల సమీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో : బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ ఉనికిలోకి రావడంతో దాని వ్యాప్తి వేగాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటోంది. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి సుమారు 1200 మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు 846 మందిని గుర్తించారు. వారి వివరాలను సేకరించారు. ఇందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే వీరిలో కొత్త రకం వైరస్ ఉందా లేక పాతదా అని తేల్చడానికి వారి శాంపిళ్ళను సీసీఎంబీ ల్యాబ్‌కు పంపారు వైద్య సిబ్బంది. పాజిటివ్ పేషెంట్లతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. నెగెటివ్ వచ్చినవారి ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించాల్సిందిగా స్థానికంగా ఉండే వైద్యారోగ్య సిబ్బందికి హైదరాబాద్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ శాఖ ఉన్నాధికారులతో సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. కొత్త వైద్య పరికరాలను ప్రభుత్వాసుపత్రులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతం ఏకైక పరిష్కారం కనిపిస్తోందని, అది వచ్చిన వెంటనే పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ ఇవ్వడంపై పది వేల మంది వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. మొదటి దశలో రోజుకు పది లక్షల మంది చొప్పున మొత్తం 80 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తొలుత వైద్యారోగ్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు, పోలీసులు తదితరులకు ఇస్తామని, మొదటి డోస్ వేసుకున్న 28 రోజుల తర్వాత వీరికి రెండో డోస్ ఇస్తామని తెలిపారు. వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా కేంద్రాలను నెలకొల్పుతున్నామని, అది ఇచ్చిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్టులు, రియాక్షన్ తదితరాలను గమనించడానికి అవసరమైన తీరులో అబ్జర్వేషన్ ప్రాంతాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ వ్యాక్సిన్ కేంద్రంలో మంచినీరు, కుర్చీలు, టెంట్లు తదితరాలు ఉంటాయన్నారు. వ్యాక్సిన్ నిల్వ చేయడానికి తగిన కోల్డ్ చైన్ స్టోరేజీ వ్యవస్థ కూడా రెడీ అవుతోందన్నారు.
ప్రజలు వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మాస్కులు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి జాగ్రత్తలను కొనసాగించాలని కోరారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి లాంటి పండుగలను ఇండ్లలోనే జరుపుకోవాలని, జనం ఎక్కువగా గుమికూడే చోటకు వెళ్ళవద్దని కోరారు. మరోవైపు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పదకొండు సీటీ స్కాన్ మిషన్లను, మూడు ఎమ్ఆర్ఐ మిషన్లను తక్షణం కొనుగోలు చేయడానికి రూ. 30 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.