2 ఏళ్ల పాపని చూపించి బ్రతిమాలినా చంపేశారు.. పహల్గాం ఉగ్రదాడిపై మధుసూదన్ భార్య సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
2 ఏళ్ల పాపని చూపించి బ్రతిమాలినా చంపేశారు.. పహల్గాం ఉగ్రదాడిపై మధుసూదన్ భార్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్ పహల్గాం (Pahalgam Terrorist Attack) ఉగ్రదాడిలో ఏపీకి చెందిన నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన్ మరణించిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడిపై గురువారం మీడియాతో మధుసూదన్ భార్య (Madhusudhan's wife) కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ శబ్దాలు విని తప్పించుకొని పారిపోతుంటే స్థానికంగా శాలువాలు అమ్మేవాళ్లు మమ్మల్ని తప్పుదోవ పట్టించారని ఆమె అన్నారు. కశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ అని వాళ్లు మమ్మల్ని తప్పుదోవ పట్టించారు.. ఇక్కడే ఉండండి అన్నారు.. లేకపోతే మేం బతికేవాళ్లం.. అని సంచలన విషయాలు తెలియజేశారు. ‘హోటల్ అతను మమ్మల్ని పరుగెత్తమన్నారు.. పరుగెత్తే లోపే మా చుట్టుపక్కల ఉన్నవాళ్లను కాల్చేశారు. 2 ఏళ్ల పాప ని చూపించి చంపొద్దని బ్రతిమాలినా చంపేశారు. ఇద్దరం కింద పడుకుందాం అని నా భర్త చెప్పారు. మేం కింద పడుకున్నా నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చారు. హిందువా? ముస్లిమా? అని మమ్మల్ని అడిగారు. వెంటనే బుల్లెట్ శబ్దం వచ్చింది. ఆ బుల్లెట్ షాట్ మా హస్బెండ్‌ది అనుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. గురువారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు ఆయన మంగళగిరిలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టార్గెట్ చేసి మరి దాదాపు 30 మంది అమాయకులను చంపేశారని ఆరోపించారు. సగటు భారతీయుడిగా ఈ ఘటన నన్నెంతో కలచివేసిందన్నారు. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక ఉగ్రవాది తూటా పేలితే దేశం నలుమూలలా కన్నీళ్లు వస్తాయనడానికి మన రాష్ట్రమే నిదర్శనమని చెప్పుకొచ్చారు.



Next Story