చివరికి నీ గతి అంతే.. మంత్రి హరీశ్‌రావుకు ఈటల శాపం

by Sridhar Babu |   ( Updated:2021-07-06 06:13:56.0  )
చివరికి నీ గతి అంతే.. మంత్రి హరీశ్‌రావుకు ఈటల శాపం
X

దిశ, కమలాపూర్: మంత్రి హరీష్ రావుకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ శాపనార్థం పెట్టారు. హరీష్‌రావు మెప్పు పొందాలని చూస్తున్నారని, ఆయన మెప్పు పొందలేరని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావుకు చివరకు తనకు పట్టిన గతే పడుతుందని ఆరోపించారు. త్వరలో హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ‘హరీష్ రావు ఇక్కడి మందిని తీసుకుపోవాలే.. దావత్ ఇయ్యాలే..డబ్బులు ఇయ్యాలే.. ఇదే పని ఆయనది అని ఈటల విమర్శలు గుప్పించారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా సీఎం కేసీఆర్ కుట్రలు చేశారన్నారు.

వాళ్ళ అబద్ధాల పత్రిక, అబద్దాల ఛానల్‌లో పదేపదే అబాద్దాలు చెప్పారని, ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత టీఆర్ఎస్ నాయకులను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం యావత్తు తెలంగాణ ప్రజానీకం చూసిందని, హుజురాబాద్‌లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా గెలవాలని చూస్తున్నారని ఈటల విమర్శించారు. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ వైపు చూస్తున్నారని, డబ్బును ,ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందన్నారు. మావైపు తిరిగే యువకులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతిఒక్కరిని బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారన్నారు.

పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా, మావాళ్ళను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు. ఏ రోజైనా హుజురాబాద్‌కి మంత్రులు,ఎమ్మెల్యేలు వచ్చారా? అని ప్రశ్నించిన ఈటల.. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిపిస్తున్నారని ఆరోపించారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు… కానీ ఇంత గోరంగా ఉంటారా..? మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి…రేపు మీ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఇంతే’ అని ఈటల విమర్శించారు.

TRSలోకి ‘ఈటల’ ముఖ్య అనుచరుడు.. రాజేందర్ గెలుపు సాధ్యమేనా.?

Advertisement

Next Story