సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు : ఈటల

by Sridhar Babu |
సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు : ఈటల
X

దిశ సూర్యా పేట: సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణాలో ఎవ్వరు సంతోషంగా లేరని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం వెళుతూ మార్గంమధ్యలో పట్టణంలో‌ని సంకినేని వెంకటేశ్వరరావు నివాసం వద్ద ఆగి మహాత్మ జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఓటమి జీర్ణించుకోలేని కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ధాన్యం కొనుగోలు, సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనలకు అంగీకరించి ఇప్పుడు కేసీఆర్ మాట మారుస్తున్నాడన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరగని విధంగా హుజురాబాద్ ఎన్నికల్లో కెసీఆర్ అక్రమాలకు పాల్పడ్డాడన్నారు. హుజురాబాద్ ఎన్నికలలో ప్రజాస్వామ్యం గొంతునొక్కి కెసీఆర్ కుట్రలు చేస్తున్నడని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారం మీద హుజురాబాద్ ప్రజలు చెంపదెబ్బ కొట్టినా కేసీఆర్‌కి బుద్ధి రాలేదన్నారు. హుజురాబాద్ తీర్పుతో కెసీఆర్ మానసికంగా దెబ్బతిని ఎం మాట్లాడుతున్నాడో అర్ధం కాకుండా ఉందన్నారు. ఈ ఏడాది 56 వేల కోట్ల రూపాయలు అప్పులు చెల్లించాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకచ్చాడని మండిపడ్డారు. విద్యార్థులకు మెస్ చార్జీలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దిగజార్చడన్నారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఇవ్వాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్‌ను రెండు సంవత్సరాలుగా ఇవ్వడంలేదని అన్నారు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించే పరిస్థితి లో రాష్ట్ర ప్రభుత్వం లేదని పేర్కొన్నారు.

చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలె రాష్ట్రాన్ని ఉంచాడని వాపోయారు. ఉపఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరగదు అనే భావన‌ ప్రజల్లో ఉందని తెలిపారు. అన్ని నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కెసీఆర్ ను బొంద పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణాలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కెసీఆర్ ప్రజలను వదిలి, డబ్బును నమ్ముకున్నాడని ఎద్దేవా చేశాడు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు కడియం రామచంద్రయ్య, బీ. జె. వై. ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకినేని వరుణ్ రావు, మన్మధ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర ,రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ,చలమల నరసింహ, కట్కూరి కార్తీక్ రెడ్డి, పల్స మల్సూర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed