ఆ పథకంలోని లోపాలే వారికి శాపాలా.. దయచేసి పిల్లల పొట్ట కొట్టకండి

by Sridhar Babu |   ( Updated:2021-09-04 01:03:29.0  )
ఆ పథకంలోని లోపాలే వారికి శాపాలా.. దయచేసి పిల్లల పొట్ట కొట్టకండి
X

దిశ,కాటారం: పాఠశాలలో ప్రత్యక్ష బోధనకు స్వీకరించడంతో 19 నెలల తర్వాత పాఠశాలలో బోధన ప్రారంభమైంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా బకాయిలు విడుదల కాకపోవడంతో, మళ్లీ అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాల్సివస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు.

పిల్లల భోజనానికి పెద్దలు ఎసరు పెడుతున్నారు. సరైన సమయానికి నిధులు ఇవ్వకపోవడం, నిర్వాహకుల మధ్య భేదాభిప్రాయాలు, ఇతరత్రా సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. కరోనా సమయంలో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందక తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బడులు తెరవడంతో ఇప్పటికైనా మంచి ఆహారం అందుతుందని సంబరపడుతున్న పిల్లలకు ఈ పథకంలోని లోపాలు శాపాలుగా మారుతున్నాయి. బకాయిలు అధికంగా పేరుకుపోవడంతో మహిళలు అప్పులు చేసి మధ్యాహ్న భోజనాన్ని తయారుచేస్తున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల సాయంతో నెట్టుకొస్తున్నారు.

ధరల్లో భారీ వ్యత్యాసం..

ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కావడం లేదు.. వచ్చే అరకొర వేతనం కూడా సమయానికి పడటం లేదు. నిత్యావసర సరుకుల ధరలు అప్పటికీ, ఇప్పటికీ బాగా పెరిగాయి. ముఖ్యంగా పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే ధరలకు ప్రస్తుతం భోజనం అందించడం ఆర్థిక భారం అవుతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు కూలీకి వెళ్తే బయట 500 వరకు వస్తుంటే కేవలం 1000 రూపాయల వేతనం కోసం పని చేయడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లేకపోవడంతో బయట కట్టెల కింద వంట చేయడంతో మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అవసరమున్న చోట కిచెన్ షెడ్లు నిర్మించడం, గ్యాస్ పొయ్యిలు మంజూరు చేయడం, బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

చెల్లించాల్సిన బకాయిలు రూ.12 లక్షలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏడు మండలాల్లో రూ.12,32,643 చెల్లించాల్సి ఉంది. మలహర్ లో మూడు ఏజెన్సీలకు రూ.1.19 లక్షలు, రేగొండ మండలంలో 2 ఏజెన్సీలకు రూ.2.12 లక్షలు, భూపాలపల్లి మండలంలో 2 ఏజెన్సీలకు రూ. 1.09 లక్షలు, చిట్యాల మండలంలో 6 ఏజెన్సీలకు రూ.4.38 లక్షలు, ఘన్‌పూర్‌ మండలంలో ఒక ఏజెన్సీకి రూ.11.175 లక్షలు, టేకుమట్ల మండలంలో ఐదు ఏజెన్సీలకు రూ.2.75 లక్షలు, మొగుళ్లపల్లి మండలంలో ఒక ఏజెన్సీకి రూ.62,890 వేలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెనూ రేట్లు పెంచాలని ఏజెన్సీల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed