ఒకే నగరంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారా..?

by Shiva |
ఒకే నగరంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నారా..?
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌ను కేవలం ఓకే నగరానికి పరిమితం చేయనున్నారా? ఐఎస్ఎల్‌ను గోవాలో నిర్వహించినట్లు ఐపీఎల్‌ను ముంబయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఐపీఎల్ 2021లో తొలి అంకం అయిన మినీ వేలం పూర్తయినా.. ఇంకా ఐపీఎల్ వేదికలు, షెడ్యూల్‌పై స్పష్టత రాలేదు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం అయినా.. కరోనా కేసులు ఇంకా నమోదవుతుండటం.. విదేశీ ప్రయాణాలు చేసే వారిపై ఆంక్షలు కొనసాగుతుండటం.. దేశంలోని పలు నగరాల్లో బహిరంగ సభలు, క్రీడలకు ఇంకా అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఐపీఎల్‌ను ఒకే నగరానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా వేలం సమయంలోనే ఐపీఎల్ వేదికలను ప్రకటించే బీసీసీఐ.. ఇంకా దీనిపై స్పష్టత ఇవ్వకపోవడానికి ఒకే నగరం వ్యూహమే కారణమని సమాచారం.

ఐఎస్ఎల్ పద్దతిలోనే..

ఇండియన్ సూపర్ లీగ్ 2020/21 ఫుట్‌బాల్ సీజన్‌ను ప్రస్తుతం గోవాలోని మూడు స్టేడియంలలో నిర్వహిస్తున్నారు. 11 జట్లు పాల్గొంటున్న ఈ ఫుట్‌బాల్ లీగ్‌ను ఒకే నగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే వ్యూహాన్ని ఐపీఎల్‌కు కూడా అనుసరించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఏడాది తర్వాత ఇండియాలో అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ఇంగ్లాండ్ జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. అయితే ఇంగ్లాండ్ పర్యటనను మొత్తం మూడు వేదికలకే పరిమితం చేసింది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మిగిలిన రెండు టెస్టులు ఐదు టీ20లు అహ్మదాబాద్‌లో, మూడు వన్డేలు పూణేలో నిర్వహిస్తున్నది. వేర్వేరు నగరాల్లో బయోబబుల్ వాతావరణం ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతే కాకుండా క్రికెటర్లు ఒకటి రెండు రోజులకే బయోబబుల్ వదిలి వెళ్లడం కూడా కుదరదు. అందుకే ఒకే నగరంలో నిర్వహిస్తే బయోబబుల్ ఏర్పాటు ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా.. ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియంలలో ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఫ్రాంచైజీలు ఒప్పుకుంటాయా?

చెన్నైలో జరిగిన మినీ వేలం సమయంలో అన్ని ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్స్‌కు తగినట్లుగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఒకే నగరంలో ఐపీఎల్ నిర్వహిస్తామంటే ఫ్రాంచైజీలు ఒప్పుకునే అవకాశం లేదు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లను ముంబయిలో ప్లేఆఫ్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని మొతేరాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బీసీసీఐ ఇదే పద్దతిని అనుసరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అన్ని ఫ్రాంచైజీలు ఈ పద్దతికి ఒప్పుకునేందుకు సిద్దంగా లేవని జిందాల్ అంటున్నారు. ఒక వేళ ఫ్రాంచైజీలు ఒప్పుకోకుంటే.. ఎవరి హోం గ్రౌండ్‌లో వాళ్లే బయోబబుల్ వాతావరణాన్ని సృష్టించుకోమని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నది. కానీ, అది ఆయా ఫ్రాంచైజీలకు భారంగా మారవచ్చు. దీంతో బీసీసీఐ నిర్ణయంపై ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది. త్వరలో ఐపీఎల్ ద్వారా క్రికెట్‌ను స్టేడియంలలో ప్రత్యక్షంగా చూడవచ్చని ఆశిస్తున్న అభిమానులకు కూడా ఈ ఒకే నగరం వ్యూహం నిరాశకు గురి చేసే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed