రెండో వన్డేలో సీన్ రివర్స్.. ఇంగ్లాండ్ ఘన విజయం

by Anukaran |
రెండో వన్డేలో సీన్ రివర్స్.. ఇంగ్లాండ్ ఘన విజయం
X

దిశ, స్పోర్ట్స్ : పూణేలో జరిగిన రెండో వన్డే ఎవరు గెలిచారన్నది పక్కనపెడితే.. క్రికెట్ అభిమానులను మాత్రం పరుగులతో అలరించింది. సిక్సులు, ఫోర్లతో బంతిని నలుదిక్కులా పంపి స్టేడియాన్ని మార్మోగించారు. వికెట్లు తీయడం సంగతి అటుంచితే.. పరుగులు రాకుండా బంతులు వేయడం ఎలాగో తెలియక ఇరు జట్ల బౌలర్లు చేతులెత్తేశారు. భారత జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ స్కోర్ సాధించింది అన్న సంతోషాన్ని ఇంగ్లాండ్ క్రికెటర్లు కొద్ది సేపటిలోనే ఆవిరి చేశారు. పంత్, పాండ్యా, రాహుల్‌ల విధ్వంసాన్ని మించి పోయేలా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ముఖ్యంగా బెన్‌స్టోక్స్ ఊచకోతతో వార్ వన్‌సైడ్ అయిపోయింది. చివర్లో వికెట్లు పడినా.. అప్పటికే ఇంగ్లాండ్ జట్టు విజయం ఖరారయ్యింది. మొత్తానికి భారీ స్కోర్‌ను ఛేదించి వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం (మార్చి 28) పూణేలోనే జరుగనున్నది.

పేటీఎం వన్డే సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని కేవలం 43.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మరోసారి శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో కలసి భారత బౌలర్లను చితకబాదారు. బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయారు. ఇటీవల నలబైలలో అవుటవుతున్న జేసన్ రాయ్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జేసన్ రాయ్, బెయిర్‌స్టో కలసి తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. జేసన్ రాయ్ (55) అనుకోకుండా రన్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత జానీ బెయిర్‌స్టోకు జతకలసిన బెన్ స్టోక్స్ భారత బౌలర్లను ఊచకోతకోశాడు. మొదటి బంతి నుంచే భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు.

స్టోక్స్, బెయిర్‌స్టోను ఆపడానికి ఏమి చేయాలో కెప్టెన్ కోహ్లీకి అర్దం కాలేదు. భువనేశ్వర్ తప్ప అందరి బౌలింగ్‌ను చితకబాదారు. కేవలం 115 బంతుల్లోనే వీరిద్దరూ కలసి 175 పరుగులు జోడించారు అంటే వీరి విధ్వంసం ఎలా కొనసాగిందో అర్దం చేసుకోవచ్చు. బెన్ స్టోక్స్ ఏకంగా 10 సిక్సులు, 4 ఫోర్లు బాదగా.. జానీ బెయిర్‌స్టో 7 సిక్సులు, 11 బౌండరీలు కొట్టాడు. వీరిద్దరే మ్యాచ్ పూర్తి చేస్తారని అనుకున్నారు. కానీ బెన్‌స్టోక్స్(99) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న జానీ బెయిర్‌స్టో (124) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అదే ఓవర్లో కెప్టెన్ జాస్ బట్లర్ (0)ను ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. వరుసగా వికెట్లు పడటంతో టీమ్ ఇండియా పట్టు భిగిస్తుందని అనుకున్నా.. దావీద్ మలన్ (16), అరంగేట్రం క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టన్ (27) కలసి మ్యాచ్‌ను పూర్తి చేశారు. ఇంగ్లాండ్ జట్టు మరో 39 బంతులు మిగిలి ఉండగానే 337 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకున్నది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జానీ బెయిర్‌స్టోకు లభించింది.

రాహుల్ క్లాస్.. పంత్ మాస్..

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన శిఖర్ ధావన్ (4) తక్కువ స్కోర్‌కే అవుటయ్యాడు. రీస్ టోప్లే బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. రోహిత్ శర్మ (25) కుదురుకున్నట్లు కనిపించినా.. సామ్ కర్రన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో టీమ్ ఇండియా 37 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడటంతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. మొదట క్రీజులో స్థిరపడటానికి ప్రాధాన్యత ఇచ్చారు.

నిలదొక్కుకున్న తర్వాత ఇద్దరూ పరుగులు రాబట్టడం మొదలు పెట్టారు. విరాట్ కోహ్లీ కాస్త వేగం పెంచడానికి ప్రయత్నించి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విరాట్ 62 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ కలసి మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇక పరుగుల వేగం పెంచే క్రమంలో విరాట్ కోహ్లీ (66) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

కేఎల్ రాహుల్‌కు రిషబ్ పంత్ జతయ్యాడు. వీరిద్దరూ కలసి ఇంగ్లాండ్ బౌలర్లను దంచి కొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లపై వరుసగా సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డు వేగం పెంచారు. పంత్ కేలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 108 బంతుల్లో 100 పరుగులు చేసిన తన కెరీర్‌లో 5వ సెంచరీని నమోదు చేశాడు. పంత్ , రాహుల్ కలసి నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో కేఎల్ రాహుల్ (108) టామ్ కర్రన్ బౌలింగ్‌లో రీస్ టోప్లేకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రిషబ్ పంత్ (77) టామ్ కర్రన్ బౌలింగ్‌లో జేసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 35 పరుగులు చేసి అవుటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి టీమ్ ఇండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రీస్ టోప్లే, టామ్ కర్రన్ చెరి 2 వికెట్లు, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు.

స్కోర్ బోర్డ్..

ఇండియా ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (సి) ఆదిల్ రషీద్ (బి) సామ్ కర్రన్ 25, శిఖర్ ధావన్ (సి) బెన్ స్టోక్స్ (బి) రీస్ టోప్లే 4, విరాట్ కోహ్లీ (సి) జాస్ బట్లర్ (బి) ఆదిల్ రషీద్ 66, కేఎల్ రాహుల్ (సి) రీస్ టోప్లే (బి) టామ్ కర్రన్ 108, రిషబ్ పంత్ (సి) జేసన్ రాయ్ (బి) టామ్ కర్రన్ 77, హార్దిక్ పాండ్యా (సి) జేసన్ రాయ్ (బి) రీస్ టోప్లే 35, కృనాల్ పాండ్యా 12 నాటౌట్, శార్దుల్ ఠాకూర్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లు) 336/6

వికెట్ల పతనం : 1-9, 2-37, 3-158, 2-271, 5-308, 6-334

బౌలింగ్ : సామ్ కర్రన్ (7-0-47-1), రీస్ టోప్లే (8-0-50-2), టామ్ కర్రన్ (10-0-83-2), బెన్ స్టోక్స్ (5-0-42-0), మొయిన్ అలీ (10-0-65-1), ఆదిల్ రషీద్ (10-0-65-1)

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్

జేసన్ రాయ్ (రనౌట్) 55, జానీ బెయిర్‌స్టో (సి) విరాట్ కోహ్లీ (బి) ప్రసిధ్ కృష్ణ 124, బెన్ స్టోక్స్ (సి) రిషబ్ పంత్ (బి) భువనేశ్వర్ కుమార్ 99, దావీద్ మలన్ 16 నాటౌట్, జాస్ బట్లర్ (బి) ప్రసిధ్ కృష్ణ 0, లియామ్ లివింగ్‌స్టన్ 27 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (43.3 ఓవర్లు) 337/4

వికెట్ల పతనం : 1-110, 2-285, 3-287, 4-287

భువనేశ్వర్ కుమార్ (10-0-63-1), ప్రసిధ్ కృష్ణ (10-0-58-2), శార్దుల్ ఠాకూర్ (7.3-0-54-0), కుల్దీప్ యాదవ్ (10-0-84-0), కృనాల్ పాండ్యా (6-0-72-0)

Advertisement

Next Story