ఎన్ కౌంటర్‌పై విచారణ జరిపించాలి.. మావోయిస్టు పార్టీ హెచ్చరిక లేఖ

by Sridhar Babu |
Maoist party
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: శనివారం మహారాష్ట్రలోని గ్యారపట్టిలో జరిగిన ఎన్ కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఎన్ కౌంటర్ పచ్చి బూటకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా ఇంఫార్మర్ వ్యవస్థను పెంచిపోసిస్తున్నాయని కమిటీ తరపున ఆజాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. అమాయక యువకులకు డబ్బు ఆశ చూపి వారి ద్వారా మావోయిస్టు కదలికలను నిత్యం పర్యవేక్షిస్తూ పార్టీని అంతమొందించేందుకు తీవ్రస్థాయిలో తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటూ దాడులకు తెగబడుతోందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఛత్తీస్గఢ్, గడ్చిరోలి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అపారమైన సహజ వనరులను కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు, వారి దోపిడీకి ఆటంకంగా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేతలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. గ్యారపట్టి ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని, అడవుల్లో మోహరించిన కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలను తక్షణమే ఉపసంహరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ఎన్ కౌంటర్‌కు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ బూటకపు ఎన్ కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed