- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఆర్సీ, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు.?
దిశ, తెలంగాణ బ్యూరో: ఏళ్ల నుంచి ఊరిస్తున్న అంశాలపై అమితుమీ తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. స్వరాష్ట్రంలో ఉద్యమాలు, వ్యతిరేకతలను మర్చిపోయిన ఉద్యోగవర్గాలు ఇప్పుడు సర్కారుకు సెగ తగిలించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ఉద్యోగ సంఘాలను పక్కన పెట్టేందుకు కూడా ఒక్కటవుతున్నారు. జేఏసీ నుంచి మినహా మిగిలిన సంఘాలు ఉద్యోగుల ఆగ్రహాన్ని పసిగడుతున్నాయి. దీంతో పీఆర్సీ డిమాండ్‌ను నెత్తికెక్కించుకుంటున్నాయి.
ఇప్పటికే ఓ సంఘం రెండు రోజుల కిందట నిరసనలకు దిగగా, తాజాగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు నిర్ణయం తీసుకుంది. జేఏసీ మాత్రం ఇంకా మౌనంగానే ఉంది. కొట్లాడి కాకుండా, బతిమిలాడుకుని డిమాండ్లు సాధించుకోవాలనే తీరుతో వ్యవహరిస్తోంది. తాము ఇక ఆ పరిస్థితులలో లేమని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. దీనంతటికీ డిసెంబర్ డెడ్‌లైన్‌గా ఉంది. ఆలోగానే ఏ నిర్ణయమైనా వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. సమస్యల పరిష్కారానికి అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వంతో మాట్లాడుతామంటూ ఉద్యోగ జేఏసీ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లడం, అదృష్టంతో సీఎం అప్పాయింట్మెంట్ దొరికితే కలువడం, అక్కడ చెప్పింది వినడం, ఓ బోకే ఇవ్వడం, వెనుదిరిగడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఉద్యోగుల సమస్యలను సీఎంకు చెబుతున్నారా, లేకుంటే నేతలకు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పుకుని వస్తున్నారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. కిందిస్థాయిలో సమస్యలను సీఎంకు వివరిస్తే కొంతైనా పరిష్కారం ఉండేదని భావిస్తున్నారు.
ఐఆర్ కూడా లేదు
పీఆర్సీ కమిషన్ గడువు మళ్లీ పెంచితే చాలా నష్టాలు ఉంటాయని ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు నివేదిక ఇస్తారనే ప్రచారం ఉంది. కానీ దీనిపై స్పష్టత లేదు. ఒకవేళ ఇచ్చినా ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా అనుమానంగా మారింది. 2018 జూలై నుంచే పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం 2018 మే నెలలోనే వేతన సవరణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా ఉమామాహేశ్వరావు, మహ్మద్ ఆలీ రఫీ సభ్యులుగా ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అన్ని వర్గాల ఉద్యోగులను, అన్ని సంఘాల నేతలను కలిసి అభిప్రాయాలు సేకరించింది. కమిటీ ఏర్పాటైన మూడు నెలలకే అసెంబ్లీ రద్దవడం, అప్పటినుంచి 2019 మే చివరిదాకా వరుస ఎలక్షన్లతో పీఆర్సీ అంశం మరుగునపడింది. మళ్లీ 2019లో జూన్ నుంచి మళ్లీ పీఆర్సీ అంశంపై దృష్టిపడింది. ఇప్పటి వరకు పీఆర్సీ గడువును ఈ ఏడాది మూడుసార్లు పొడగించారు. ఈసారి డిసెంబర్ వరకు పెంచారు. మరోసారి పెంచితే చాలా నష్టాలు ఉంటాయని అంటున్నారు. కనీసం కమిటీ నివేదిక ఇస్తే సరిపోతుందని, వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు చేస్తే ఏప్రిల్ నుంచి నగదు జమ అవుతందనే ఆశతో ఉన్నారు. లేకుంటే ఏరియర్స్ అన్ని పీఎఫ్ ఖాతాలకు బదిలీ చేసినా సంతోషమే అంటున్నారు. కమిటీ గడువు పెంచితే కనీసం ఐఆర్ కూడా అడిగే పరిస్థితి ఉండదని, గడువు పెంచకుండా చూసుకోవాలని నేతలు పేర్కొంటున్నారు.
ఎప్పటి నుంచి ఇస్తారో.?
పీఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది సందేహంగా మారింది. ఈసారి కూడా ఏడాదో, ఏడాదిన్నరో నష్టపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ అంచనా వేస్తున్నారు. 2013కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అందాల్సిన పీఆర్సీని 2015 ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్ 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. అప్పటికే ఉద్యోగులు 11 నెలల కాలాన్ని కొల్పోయారు. ఆ తర్వాతి పీఆర్సీ 2018 జులై 1 నుంచే అమలు కావాల్సి ఉంది. ఇప్పుడు పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధమైనట్లు భావిస్తున్నారు. ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపై చాలా ఊహగానాలు ఉన్నాయి. 2019 జూలై లేదా… 2020 జూలై నుంచి ఇస్తారంటు చెప్పుకుంటున్నారు. పీఆర్సీ ఇచ్చే అవకాశాలుంటే మాత్రం ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారని, త్వరలోనే జేఏసీకి సమాచారం అందుతుందని ఆశల్లో ఉన్నారు. సీఎంతో భేటీ అయితే కచ్చితంగా 2018 జూలై నుంచి పట్టుబట్టాలని, అలాంటప్పుడు 2019 నుంచైనా వర్తింపచేస్తారనే ధీమాతో ఉన్నారు. కమిటీ నివేదిక ప్రకారం 30 శాతం ఫిట్‌మెంట్‌ను 2020 జూలై నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2020 జూలై నుంచి ఇస్తే ఉద్యోగవర్గాలు మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితే. ఎందుకంటే దాదాపు 26 నెలలు నష్టపోవాల్సిందే. దీన్ని జేఏసీ పక్షాన ఒప్పుకున్నా… కిందిస్థాయిలో మాత్రం చాలా సమస్యలు వస్తాయని సంఘాల నేతలు కూడా ఆందోళన పడుతున్నారు.
ఉద్యమించాలి
ఉద్యోగవర్గాలలో ఓపిక నశిస్తోంది. తమకు కనీస విలువ కూడా లేదని అంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగవర్గాలను దూరం పెడుతోందని తేలింది. వరుసగా ఎన్నికలలో కూడా ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని చూపిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కోపం చూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఉద్యమం చేయాలనే డిమాండ్ కిందిస్థాయి నుంచి వస్తోంది. ఎంతకాలం ఓపిక పడుతామంటూ మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రం సహనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. సామరస్యంగా ఉండి సమస్యలు సాధించుకోవాలని సర్ధి చెప్పుతున్నాయి.
మాకు నమ్మకం ఉంది
ఈసారి పీఆర్సీ వస్తుందనే నమ్మకం ఉంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఈ నెలాఖరులోగా ప్రకటన వస్తుందని భావిస్తున్నాం. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల డిమాండ్లను సీఎంకు వివరిస్తాం. ఎలాగైనా వాటిని పరిష్కరించుకుంటామనే ధీమా ఉంది.
–మామిళ్ల రాజేందర్, ఏనుగుల సత్యనారాయణ, రాయకంటి ప్రతాప్, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
పీఆర్సీ అంశంలో ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తోంది. 2018 నుంచి ఎదురు చూస్తున్నాం. ఎంతకాలం ఓపికతో ఉంటారు. ప్రభుత్వం ఈ అంశంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగవర్గాల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాల్సిందే. ఫ్రెండ్లీ వాతావరణాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగ విరమణ పమిమితి పెంచుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఏదో ఒకటి చెప్పాల్సిందే.
–సంపత్ కుమారస్వామి, టీఈఏ అధ్యక్షుడు
పెన్షనర్ల అంశాలు కూడా తేల్చాలి
పెన్షనర్లకు చాలా హామీలు ఇచ్చారు. పెన్షనర్లు అంటేనే ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఒక్కటి కూడా తీర్చడం లేదు. పెన్షనర్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. కోత పెట్టిన పెన్షన్ తీసుకునేందుకే కోర్టుకెక్కాల్సి వచ్చింది. ఏండ్ల తరబడి సర్వీసు చేసి పదవీ విరమణ తర్వాత ఆశతో ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి.
–లక్ష్మయ్య, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు