ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేర్వేరు కాదు

by Shyam |
JACTO
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయులను, ఉద్యోగులను వేరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే సహించేది లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. తామంతా ఐక్యంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) స్టీరింగ్ కమిటీల ఉమ్మడి సమావేశం జరిగింది. సమావేశానికి జి.సదానందం గౌడ్, ఎం.రఘుశంకర్ రెడ్డిల అధ్యక్షత వహించారు.

ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయులను వేరు చేయాలని, పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు ఉపాధ్యాయులకు వర్తించదంటూ చేస్తున్న ప్రచారం సంఘటిత శక్తిని బలహీన పర్చడం కోసం చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. అలాంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలను స్థానిక సంస్థలకు అప్పగించాలనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాయాలని చూస్తే సహించేది లేదని స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేలోగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ప్రతిపాదనలపై విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోకుంటే ఎన్నికల అనంతరం దశలవారీగా ప్రత్యక్ష పోరాటాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మూడు నెలల్లో పీఆర్సీ ఇస్తామని ఊరించి 30 నెలల తర్వాత వచ్చిన రిపోర్టుపై సరైన నిర్ణయం తీసుకోకుండా ఎన్నికల కోడ్ వచ్చిందాకా తాత్సారం చేయటం, జనవరి నెలాఖరులోగా పదోన్నతులు ఇస్తామని ఉపాధ్యాయులకు ఇవ్వకపోవటంతో క్షేత్ర స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నదన్నారు.

ఎవరు పిలుపునిచ్చినా ఉపాధ్యాయులు వెల్లువలా కదిలి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఆ అసంతృప్తిని పక్కదారి పట్టించేటందుకే ఉపాధ్యాయుల్లో భయాందోళనలు కలిగించే వార్తలను ప్రచారంలో పెడుతున్నారని స్టీరింగ్ కమిటీ విమర్శించింది. ప్రశ్నిస్తే సహించలేని స్థితి సమంజసం కాదన్నారు. సంఘ నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు కె. జంగయ్య, కె.రమణ, ఎం.రాధాకృష్ణ, కె.కృష్ణుడు, డి.సైదులు, చావ రవి, ఎం.పర్వతరెడ్డి, టి.లింగారెడ్డి, ఎస్.హరికిషన్, జి.రాములు, బి. కొండయ్య, ఎన్.యాదగిరి, బి.నగేష్ యాదవ్, పి.చంద్రశేఖర్, టి.సత్యనారాయణ, కె.మల్లయ్య తదితరులు పాల్లొన్నారు.

‘పీఆర్సీ వెంటనే అమలు చేయాలి’

Advertisement

Next Story