అవార్డులు ఇలాక్కూడా ఇవ్వొచ్చా?

by  |
అవార్డులు ఇలాక్కూడా ఇవ్వొచ్చా?
X

దిశ, వెబ్‌డెస్క్: చలనచిత్ర రంగంలో ట్రెండ్ సెట్ చేయాలంటే హాలీవుడ్ తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపితమైంది. అసలే కరోనా కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడి, థియేటర్లు మూతపడి చిత్రపరిశ్రమ చప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవార్డుల కార్యక్రమం గురించి ఊసేలేదు. చిత్రపరిశ్రమలో వివిధ రంగాల్లో పనిచేసే వారిని పురస్కరిస్తూ నిర్వహించే అవార్డు వేడుకలు చాలా సందడిగా ఉంటాయి. కానీ ఈసారి అలా జరుపుకునే అవకాశం లేదు. మరి హాలీవుడ్ ఊరుకుంటుందా? చేయలేము అనుకున్న పనులను చేసి చూపించే సత్తా ఉన్న చిత్రపరిశ్రమ అది. అందుకే టెలివిజన్ రంగంలో ప్రతిష్టాత్మకంగా అందించే ఎమ్మీ అవార్డుల వేడుకను చాలా వినూత్నంగా నిర్వహించింది. అందరూ ఒక దగ్గర లేరు అనే లోటు తప్ప అటు ఎంటరైన్‌మెంట్‌కు ఇటు ప్రతిభకు పట్టం కట్టడానికి ఎలాంటి లోటు లేకుండా వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమం అంతటినీ వ్యాఖ్యాత జిమ్మీ కెమ్మెల్ ఒంటి చేత్తో నడిపించారు. ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వాళ్లందరూ జూమ్ మీటింగ్ పెట్టుకున్నట్లు, అవార్డులకు నామినేట్ అయిన వాళ్లందరినీ వారి ఇంట్లో నుంచే వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి, తనదైన శైలిలో జోకులు వేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకరిద్దరు నటీనటులు కూడా జిమ్మీకి సహాయం చేశారు. అవార్డులను నేరుగా వాళ్లు ఉన్న చోటికే వెళ్లి ఇచ్చొచ్చారు. ఇక అడుగడుగునా శానిటైజర్‌లు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా అవార్డు కార్యక్రమాన్ని జరిపారు. అయినా, ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో అవార్డుల వేడుక నిర్వహించడం అవసరమా? అని విమర్శించినవాళ్లు కూడా ఉన్నారు. అయితే పాండమిక్ ద్వారా ఇబ్బంది పడిన ప్రపంచానికి ఈ అవార్డు వేడుకలు ఓ ఆటవిడుపుగా ఉంటాయని నిర్వాహకులు చెప్పారు. కాగా, ఎమ్మీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డుల బాటలోనే సినిమా రంగ అవార్డులైన ‘ఆస్కార్’ కూడా నిర్వహించే పరిస్థితి వస్తుందేమోనని అభిమానులు కలవరపడుతున్నారు.


Next Story

Most Viewed