చిన్న వెంకన్న సన్నిధిలో.. గుప్త నిధుల కలకలం

by Mahesh |   ( Updated:2024-08-13 02:37:41.0  )
చిన్న వెంకన్న సన్నిధిలో.. గుప్త నిధుల కలకలం
X

దిశ, ఏలూరు: ఏలూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో గుప్త నిధుల కలకలం చెలరేగింది. ద్వారకా తిరుమల బస్టాండ్ సమీపంలో ఉన్న కుచ్చెలమెట్టపై గుర్తుతెలియని వ్యక్తులు రెండు రోజులుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న నృసింహ సాగర పుష్కరిణి సమీపంలో కుచ్చెల మెట్లపై పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి మండపం ఉండేది. క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామి వారి నృసింహ సాగరంలో తెప్పోత్సవానికి వచ్చిన సమయంలో కుచ్చల మెట్లపై ఉన్న స్వామివారి మండపంలో పూజలు నిర్వహించే వారు. గత కొంతకాలంగా అది శిధిలావస్థకు చేరుకోవడంతో మెట్ట పైకి ఎవరూ వెళ్లడం లేదు.

గతంలో తవ్వకాలు..

గతంలో కొందరు దుండగులు మండపం ఉన్న ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అప్పట్లో ఈ విషయమై కలకలం రేగింది. అది సద్దుమణిగాక మళ్లీ తాజాగా గత రెండు, మూడు రోజులుగా కుచ్చెలమెట్టపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు తెలిపారు. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా అక్కడ పసుపు, కుంకుమ, దేవుడు ఫోటోలు పెట్టి పూజలు చేయడంతో పాటు, పెద్ద గొయ్యి తీసిన ఆనవాలు ఉందని చెబుతున్నారు. అటువైపు వెళ్లాలంటే తాము భయపడుతున్నామని, గుప్త నిధుల తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed