వచ్చే ఏడాదికి భారత్‌లో టెస్లా కార్లు!

by Harish |   ( Updated:2020-11-26 03:50:27.0  )
వచ్చే ఏడాదికి భారత్‌లో టెస్లా కార్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా 2021లో భారత్‌లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉన్నట్టు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ శుక్రవారం తెలిపారు. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించే అంశంపై అడిగిన ఓ ప్రశ్నకు ఎలన్ మస్క్ ‘వచ్చే ఏడాది ఖచ్చితంగా ఉంటుందని’ చెప్పారు. అయితే, ఇటీవల అమెరికా వాహన తయారీ కంపెనీలైన హార్లే డెవిడ్‌సన్, జనరల్ మోటార్స్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన సమయంలో టెస్లా ఇంక్ భారత్‌లో ప్రవేశానికి సిద్ధమవడం పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల మరో కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కూడా భారత్‌లో తయారీ కర్మాగారాన్ని, ఇతర ఆస్తులను జాయింట్ వెంచర్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి విక్రయించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎలన్ మస్క్ ప్రకటన ఆసక్తి కలిగిస్తోంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా ఉన్న టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ భారత్‌లో కార్యకలాపాల గురించి ప్రస్తావించడం ఇది మొదటిసారి కాదు. కాబట్టి, వాస్తవ రూపంలో చర్యలు ప్రారంభమయ్యే వరకు స్పష్టత ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ ట్విటర్ యూజర్ టెస్లా భారత ప్రవేశానికి సంబంధించి ప్రశ్నించినపుడు ఇప్పట్లో సాధ్యపడదేమో అనే సందేహాన్ని ఎలన్ మస్క్ వ్యక్తం చేశారు. గతేడాది మార్చి సమయంలో సైతం ఏడాది కాలంలో భారత్‌కు వచ్చేందుకు ఇష్టపడుతున్నట్టు, అయితే ఖచ్చితంగా చెప్పలేనని చెప్పారు. ఆ సమయంలో..భారత్‌లో ఆటో పరిశ్రమకు సంబంధించి పన్ను నిబంధనలు, సుంకాలను కారణంగా ఎలన్ మస్క్ ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed