- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్‌లో ఎలక్షన్… హైదరాబాద్‌లో సర్కార్ స్టంట్
దిశ, సిటీ బ్యూరో : హుజూరాబాద్ బై ఎలక్షన్‌కు అధికార పార్టీ హైదరాబాద్‌లో స్టంట్‌లు చేస్తోంది. 784 డబుల్ ఇళ్లను ఎంతో ఆర్బాటంగా పంపిణీ చేసి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు తహతహలాడుతోంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సర్కారు ఓట్ల కోసం మరోసారి ప్రజలను జీ హుజూర్ అంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ నెల 26, 28న రెండు రోజుల్లోనే 784 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. సుమారు రూ.58.50 కోట్ల వ్యయంతో నాలుగు ప్రాంతాల్లో ఈ ఇళ్లను నిర్మించారు. ఒక వైపు కరోనా వైరస్ విజృంభణ, మరోవైపు కాసుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడిక్కడే అర్దాంతరంగా ఆగిపోయాయి.
కరోనా వైరస్ మొదటి దశ లాక్ డౌన్ కల్లా నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న మహానగరంలోని నాలుగు ప్రాంతాల్లో రూ.784 ఇళ్లను రెండు రోజుల పాటు లబ్ధిదారులకు అందించేందుకు అధికార యంత్రాంగం ఆఘమేఘాలపై సన్నాహాలు చేస్తొంది. ఎలక్షన్ హుజూరాబాద్‌లోనే ఉన్నా, హైదరాబాద్‌లో లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, ఆగిపోయిన డబుల్ ఇళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సర్కారుపై నమ్మకం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేగాక, ఈ ఎన్నికలో గెలిచేందుకు ఇప్పటికే హుజూరాబాద్‌కు రూ.40 కోట్ల తాయిలాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ బై పోల్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతూ, అనుకూలంగా ఉన్న ప్రతి అంశాన్ని ఎన్నికల కోణంలో మలుచుకునేందుకు సిద్ధమవుతోందన్న విమర్శ ఉంది. ఈ నెల 26,28 తేదీన కేటీఆర్ పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వాస్తవానికి కూడా ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రాకముందే, ఆయన రాజీనామా చేయకముందే పూర్తయ్యాయినట్లు సమాచారం. వీటి లబ్ధిదారులంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదవారే. వారు నేటికీ అద్దె ఇళ్లలొనే నివాసముండటం ఎందుకన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే వారిపై అద్దె భారాన్ని తగ్గించేందుకు నిర్మాణం పూర్తయిన వెంటనే పంపిణీ చేసేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి సోయి సర్కారుకుంటే ఇప్పటికే డబుల్ ఇళ్ల నిర్మాణ పనులు ఆగిన డబుల్ ఇళ్ల లబ్ధిదారులకు అద్దె బాధలే ఉండేవి కావని ఈ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు వాపోతున్నారు. అసలే పాండమిక్ సమయం, వందల, వేల మందిని ఒక చోట పోగు చేసి, ఆర్భాటంగా ఇళ్ల పంపిణీ చేస్తున్న పాలకులకు కరోనా గైడ్ లైన్స్ వర్తించవా? లేక కరోనా వారికేమైనా మినహాయింపునిచ్చిందా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ సారైనా మంత్రి మాస్కు ధరిస్తారా?
కరోనా కష్టకాలంలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా, మాస్కు ధరించని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కనీసం ఈ నెల 26,28 తేదీల్లో జరిగే డబుల్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలోనైనా మాస్కు ధరిస్తారా? అన్నది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని మాస్కు లేకుండా దర్శనమిచ్చారు. ఇదే కార్యక్రమానికి హాజరైన హోం మంత్రి మహమూద్ అలీ సైతం మాస్కు ధరించినా, మంత్రి తలసాని కరోనా గిరోనా జాన్తా నహీ అన్నట్లున్నారు. కానీ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి కేటీఆర్ కూడా తరుచూ మాస్కు ధరించి కన్పిస్తుంటారు. మరీ ఈ సారైనా మంత్రి తలసాని మాస్కు ధరిస్తారా? లేక మాస్క్ లెస్ గానే వస్తారా? వేచి చూడాలి.
పంపిణీ చేయనున్న ఇండ్లు ఇవే..
రాంగోపాల్ పేటలోని అంబేద్కర్ నగర్‌లో రూ.28.05 కోట్ల వ్యయంతో 400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, పొట్టి శ్రీరాములునగర్‌లో రూ.14.01 కోట్లతో నిర్మించిన 162 ఇళ్లును ఈ నెల 26,28 తేదీల్లో లబ్ధిదారులకు అందజేయనున్నారు. జీవై రెడ్డి నగర్‌లో రూ. 15.57 కోట్లతో 180 ఇళ్లు, గొల్ల కొమరయ్యకాలనీలో రూ.85 లక్షలతో నిర్మించిన 12 ఇళ్లలో కొన్ని జూలై 1వ తేదీన, మరికోన్ని జూలై 5వ తేదీన లబ్ధిదారులకు అందించనున్నట్లు వెల్లడించిన జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల్లో పంపిణీ చేసే ఇళ్ల జాబితాలో పైన పేర్కొన్న 192 ఇళ్లను కూడా చేర్చారు. లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా సిద్ధం కాని 192 ఇళ్ల సంఖ్యను కూడా చూపించటంలో అధికారుల ఆంతర్యమేమిటో? వారికే తెలియాలి.
సారూ… మా ఇండ్ల సంగతేందీ?
నగరంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు సార్ మా ఇండ్ల సంగతి ఏందీ అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సమీపంలోని కట్టెలమండిలో మొత్తం 128 మంది లబ్ధిదారులకు డబుల్ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 103 మాత్రమే నిర్మించి లబ్ధిదారులకు అందించారు. అలాగే మీరు ఖాళీ చేసి జాగా అప్పగిస్తే ఏడాది లోపు వీలైనంత త్వరగా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని 2015లో నమ్మించి ఖాళీ చేయించిన అంబేద్కర్ నగర్ లో 330 ఇళ్లను నిర్మించి ఇస్తామన్న అధికారులు నేటికీ నిర్మాణం పూర్తి చేయలేదు. ఫలితంగా లబ్ధిదారులు అద్దె ఇళ్లలో నివాసముంటూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కొందరు తమ ఇళ్లను జర జల్దీ కట్టాలని వేడుకుంటూ అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ రాష్ట వ్యాప్తంగా రెండు లక్షల పై చిలుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్షా ఇరవై వేల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కానీ వీటి కోసం ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్షల్లో దరఖాస్తులు అధికారులకు అందాయి. అయినా నేటికీ నగర జనాభాలో సుమారు ముప్పై శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన కిరాయి ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిధుల లేమీతో ఈ ఇళ్ల నిర్మాణం ఆగిపోయినా, దరఖాస్తు అయితే పెట్టాం, ఏదో ఒక రోజు సర్కారు కట్టదా? మాకివ్వదా? అని ఎదురుచూస్తున్నారు.