చివరి అంకం.. రేపటితో ప్రచారానికి తెర

by Sridhar Babu |   ( Updated:2021-10-26 12:00:17.0  )
Huzurabad-by-election
X

దిశ ప్రతినిధి. కరీంనగర్ : ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలకు మిగిలింది రేపు ఒక్క రోజే. దాదాపు ఐదున్నర నెలలుగా ప్రచార హోరులో దద్దరల్లిపోయిన హుజురాబాద్ బుధవారం రాత్రి 7 గంటలకు మూగబోనుంది. ప్రాంతీయ, జాతీయ స్థాయి నాయకుల ప్రసంగాలు, మైకుల మోతలు, ధూంధాంలతో మారుమోగిన హుజురాబాద్‌లో రేపటితో ప్రశాంత వాతావరణం నెలకొననుంది.

పోటాపోటీ ప్రచారం..

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీ ప్రచారం చేశాయి. సెప్టెంబర్ 28న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ వెలుగులోకి వచ్చిన మే మొదటి వారం నుంచి టీఆర్ఎస్ మైదానంలోకి దిగింది. మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ నాయకులు కూడా హుజురాబాద్‌లోనే క్యాంప్ వేసి సమీకరణాలు చేశారు. రాజీనామా చేసిన తరువాత ఈటల రాజేందర్ దంపతులు కూడా కదనరంగంలోకి దూకారు. పాదయాత్ర చేపట్టిన ఈటల తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేశారు. అయితే, అనారోగ్యం కారణంగా పాదయాత్ర అర్థాంతరంగా నిలిపేశారు. ఓ వైపున ఈటల రాజేందర్ మరో వైపున ఆయన సతీమణి జమునమ్మ ఇంటింటికీ, ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. మధ్యలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా ఈటలకు అనుకూలంగా ప్రచారం చేశారు. ఈ నెల 20 నుండి బీజేపీ ముఖ్య నాయకులంతా హుజురాబాద్ పైనే దృష్టి సారించారు.

నేటితో క్లోజ్..

బుధవారం రాత్రితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కదనరంగంలోకి దిగుతున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ప్రచారం చేయనున్నారు. స్థానిక నాయకులు ఓటర్లను నేరుగా కలిసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు.

నాన్ లోకల్స్ ఔట్..

ఇకపోతే నాన్ లోకల్ లీడర్లంతా కూడా హుజురాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. స్థానికేతర నాయకులు అంతా కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండకూడదన్నారు. స్థానికేతరులపై ప్రత్యేక నిఘా వేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ప్లాన్ చేశారు.

అదనంగా 2 గంటలు..

కొవిడ్ పాండమిక్ నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ప్రతీ పోలింగ్ బూతులో భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు, శానిటైజర్లను అందజేస్తోంది. ఈ కారణంగా అదనంగా 2 గంటల పాటు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అయ్యే పోలింగ్ ప్రకియ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. దీంతో పోలింగ్ పర్సెంటేజీ కూడా ఎక్కువయ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

మూడు రోజుల ముందే..

గతంలో ఏ ఎన్నికల్లోనూ లేని విధంగా హుజురాబాద్ బై పోల్స్‌లో ప్రచారాన్ని మూడు రోజుల ముందు నుంచే ముగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సాధారణంగా 48 గంటల ముందు నుంచి ప్రచారానికి బ్రేకులు వేసేవారు. కానీ ఈ సారి మాత్రం 72 గంటల ముందే ప్రచారానికి తెర దించాలని ఆదేశించింది. దీంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉండవని అంచనా వేస్తున్నారు. అయితే, స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే పొలిటికల్ పార్టీలు ముందస్తు వ్యూహం రచించుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed