రెండేళ్లకే అధికారం ఔట్.. ఈసీనా మజాకా!

by Aamani |
రెండేళ్లకే అధికారం ఔట్.. ఈసీనా మజాకా!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికారుల నిర్లక్ష్యం వారి పదవికి గండమైంది. ఎన్నికల్లో గెలిచిన రెండేళ్లకే పీఠాలు కదిలిపోయాయి. ప్రజాప్రతినిధులు ఎన్నికై ఐదేళ్లు సేవ చేద్దామనుకున్న వారు అర్ధాంతరంగా పదవులు వదులుకోవాల్సి వస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేసిన ఖర్చులను చూపించని వారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో తమ పదవులు మధ్యలోనే వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులకు ఎన్నికల సంఘం ఝలక్ ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

బ్రాహ్మణ్​గావ్​ పాలకవర్గంలో మిగిలింది ఇద్దరే..

నిర్మల్​జిల్లా బ్రాహ్మణ్​గావ్​లో సర్పంచ్​తోపాటు ఎనిమిది మంది వార్డు సభ్యులున్నారు. ఇందులో ఒకరు ఉప సర్పంచిగా ఎన్నికవగా.. ఏడుగురు వార్డు మెంబర్లున్నారు. ఈ ఏడుగురు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించలేదని, ఎన్నికల సంఘం పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇక్కడ ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్​మాత్రమే మిగలారు. గ్రామ పంచాయతీలో 8 మంది వార్డు సభ్యుల్లో ఏడుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవయ్యారు. అందులో ఆరుగురు తాజాగా పదవిని కోల్పోవడం కొసమెరుపు.

ముధోల్ పంచాయతీలో ముగ్గురిపై వేటు

ముధోల్ గ్రామ పంచాయతీలో మొత్తం 16 మంది వార్డు సభ్యులు ఉండగా, ఇటీవల సర్పంచ్​తో పాటు ఉప సర్పంచ్​లు పదవుల నుంచి తొలగించబడ్డారు. 15 మంది వార్డు సభ్యులుండగా.. ఎన్నికల్లో వ్యయానికి సంబంధించిన లెక్కలు చూపలేదని ముగ్గురు వార్డు సభ్యులపై ఈసీ కొరడా ఝులిపించింది. ఇందులోనూ ఇటీవల తాత్కాలిక ఉప సర్పంచ్​గా ఎన్నికైన వారితో పాటు తాత్కాలిక సర్పంచి, ఉప సర్పంచి కోసం పోటీ చేసి ఓడిపోయిన వారుండటం గమనార్హం.

ఝలక్​ఇచ్చిన ఎన్నికల సంఘం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,506 గ్రామ పంచాయతీలకు 2019 జనవరి నెలలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్​తో పాటు వార్డు సభ్యులను ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల్లో, ఉప సర్పంచ్​ని వార్డు సభ్యులు చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 1న కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా.. అయిదేళ్ల కోసం ఎన్నికైన పలువురు ప్రజాప్రతినిధులకు ఎన్నికల సంఘం ఝలక్​ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు చేసిన ఖర్చులకు సంబంధించి వివరాలు అందజేయలేదనే కారణంతో పలువురిపై వేటు వేసింది. పలువురి పదవి కోల్పోగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తాము మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఖర్చుల వివరాలపై నివేదిక అందజేశామని వార్డు సభ్యులు పేర్కొంటున్నారు.

ఒక్క నిర్మల్ జిల్లాలోనే 110 మంది..

ఉమ్మడి జిల్లాలో వందలాది మంది వార్డు సభ్యులపై ఈసీ వేటు వేసింది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 110 మందిని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయం వివరాలు సమర్పించని కారణంగా వారిని పదవి నుంచి తొలగించింది. ఇప్పటికే బాసర మండలంలో నలుగురు, సారంగాపూర్ మండలంలో 26 మంది, ముధోల్ మండలంలో 28 మంది వార్డు సభ్యులను పదవుల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని మండలాల్లో మాత్రం ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయగా, అభ్యర్థులకు రసీదులు కూడా ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైన వెంటనే తాము సంబంధిత అధికారులకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను అందజేసినా.. అధికారులు తమకు ఎలాంటి రసీదు ఇవ్వలేదని పలువురు వార్డు సభ్యులు తెలిపారు.

అధికారుల తీరుపై నిరసన..

బ్రహ్మణ గావ్​ తో పాటు చాలా గ్రామాల వార్డు సభ్యులు కూడా ఎన్నికల లెక్కల వివరాలు సమర్పించినా.. వాటికి రసీదు తీసుకోలేదు. అన్నీ కలిపి ఒకేసారి వివరాలు నమోదు చేస్తామని జమ చేసి పక్కన పెట్టిన అధికారులు.. తర్వాత దొరికినవి మాత్రమే పంపారు. దీంతో అధికారుల నిర్లక్ష్యంతో వార్డు సభ్యుల పదవికి గండం వచ్చింది. తాజాగా వారికి నోటీసులు వచ్చేవరకూ తొలగించే విషయం తెలియకపోగా.. సంబంధిత అధికారుల తప్పిదం వల్లే తమకు ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వకపోవడంతోనే ఈసీ వారిని తొలగించిందని పేర్కొంటున్నారు. అయిదేళ్ల కోసం ఎన్నికైన వారు రెండేళ్లకే పదవి కోల్పోవడంతో పదవి కాస్తా ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది.

Advertisement

Next Story

Most Viewed