ఏపీలో రివర్స్ విద్య..

by Vinod kumar |   ( Updated:2023-08-31 19:30:37.0  )
ఏపీలో రివర్స్ విద్య..
X

విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైనది, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు బలమైన పునాది వేసేది పాఠశాల విద్య. అటువంటి పాఠశాల విద్యపై వైకాపా ప్రభుత్వం ఏడాదికో ప్రయోగం చేస్తోంది. మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూ, త్రిభాషా సూత్రం అమలు చేస్తూ, పిల్లలకు వివిధ భాషలను పునాది స్థాయి నుండే తప్పనిసరిగా నేర్పించాలని, నిర్బంధంగా ఎలాంటి భాషా రుద్దకూడదని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. విద్యార్థులందరూ తమ పాఠశాలలో మూడు భాషలను నేర్చుకోవాలని, మూడు భాషల్లో కనీసం రెండైనా భారతీయ భాషలై ఉండాలని సిఫార్సు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ విద్య, ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమం (ఆప్షనల్) చంద్రబాబు గతంలోనే ప్రవేశ పెట్టారు. ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సమాజాలన్నీ వాటి మాతృభాషలోనే విద్యా బోధనను కొనసాగిస్తున్నాయి. జపాన్, చైనా, జర్మనీ వంటి దేశాలు తమ మాతృభాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్తాయికి చేరుకోగలుగుతున్నారన్న సత్యాన్ని విస్మరించి, జాతీయ విద్యా విధానం స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంకు షరతులకు అనుకూలంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్లంలో బోధనను తప్పనిసరి చేశారు. మాతృ భాషలో బోధన లేదని తేల్చేశారు.

నిర్వీర్యమవుతున్న పాఠశాలలు..

విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యా రంగంలో వరుసగా వచ్చిన జీఓలు 172, 117 ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని మునుపెన్నడూలేని విధంగా అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయకపోగా తరగతులను తరలించడం, పాఠశాలలను విలీనం చేయడం, ఏకైక ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ విధానాలతో పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారు. పాఠ్య ప్రణాళిక, బోధనా విధానాల అమలు కోసమే ఎన్ఈపి పాఠశాల విద్యను నాలుగు స్థాయిలుగా విభజించాము తప్ప పాఠశాలలను భౌతికంగా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర పాఠశాల విద్యా శాఖ చెప్పినా పెడచెవిన పెట్టి రాష్ట్రంలో 37 వేల ప్రాథమిక బడుల నుండి 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోను; ప్రాథమికోన్నత బడుల నుండి 6,7,8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ వంటి చర్యల వలన 4234 ప్రాథమిక పాఠశాలలు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం అయ్యాయి, దాదాపు 10 వేల ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయి, 9,602 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాద్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని, ఇప్పటికే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విఫలమైన 3-10 తరగతుల వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.1-5 తరగతుల విద్యార్థి సామర్థ్యాలు, 6-10 తరగతుల సామర్థ్యాలు వేరువేరుగా వుంటాయి. ప్లే స్కూల్‌గా వున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,2 తరగతుల పిల్లలకు చదువు నేర్పగలరా? 8వ తరగతి లోపు మాతృభాషలో విద్య నేర్పాలనే ఎన్‌ఇపి 2020 విధానాన్ని ఎందుకు పాటించలేదు అనేవి అంతుచిక్కని ప్రశ్నలు.

నాణ్యమైన విద్య ఇలాగేనా?

నాణ్యమైన విద్య అందాలంటే తరగతికి ఒక టీచరు ఉండాలనే అంశాన్ని విస్మరించి, సంస్కరణల పేరుతో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని (పిటిఆర్) పెంచింది ప్రభుత్వం. 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ఒక్కటే అమలు చేసి తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులను మిగులుగా తేల్చి వారిని సర్దుబాటు చేసారు. మూడవ తరగతి నుండే సబ్జెక్ట్ టీచర్ను ఇస్తానన్న జగన్మోహన రెడ్డి వాగ్దానాన్ని గాలికి వదిలేసి 3-8 తరగతి బడుల్లో 30 మందికి ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) చొప్పున కేటాయించారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం అయిన 3-5 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తున్నారు. 6-8 తరగతులుండే ప్రీ హైస్కూలులో 98 మంది కంటే తక్కువగా పిల్లలుంటే సబ్జెక్ట్ ఉపాధ్యాయులను కాకుండా ఎస్జీటీ లను కేటాయించడం వలన కూడా అభ్యసన పరంగా విద్యార్థులకు నష్టం జరుగుతోంది.


ఇక ఒకే వ్యక్తి మూడు తరగతులకు గణితం, సాంఘిక శాస్త్రం,సామాన్య శాస్త్రం బోధించడం సాధ్యమా? ప్రాథమిక పాఠశాలల్లో 130, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 531, ఉన్నత పాఠశాలల్లో 601 పిటిఆర్ ద్వారా నాణ్యమైన విద్య ఎలా అందివ్వగలదో ప్రభుత్వం చెప్పాలి. 6-8 తరగతుల్లో 53 మంది, 9,10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ అమలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించినా, పిటిఆర్ ప్రతికూలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు 47.56 శాతం, మాధ్యమిక పాఠశాలలు 17.93 శాతంగా ప్రభుత్వం పేర్కొంటూనే 717 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని బొంకుతోంది.

సిబిఎస్ఈ వద్దు.. ఐబీనే ముద్దు..

విద్యా పరంగా అస్థిర నిర్ణయాలతో ప్రభుత్వం ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తోంది. గతేడాది బైజూస్ సిలబస్ అంటూ హడావుడి చేశారు, తరువాత రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్ సి ఈ ఆర్ టి) పర్యవేక్షణలో స్వంత కంటెంట్ తయారు చేస్తున్నాం అన్నారు, 2022-23 లో రాష్ట్ర సిలబస్ బాగోలేదు, సిబిఎస్ఈకి అంతర్జాతీయ బ్రాండ్ ఉందంటూ ఎనిమిదో తరగతికి ఎన్‌సిఈఆర్‌టి రూపొందించే సిబిఎస్ఈ సిలబస్‌ను అమలు చేశారు. ఈఏడాది 1-7వ తరగతులతో పాటు తొమ్మిదవ తరగతికి కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని షుమారు 44 వేల ప్రభుత్వ పాఠశాలలకు విడతల వారీగా సిబిఎస్ఈ ప్రణాళిక అమలు చేయాలని మొదటి విడతగా 3108 పాఠశాలలకు సిబిఎస్ఈ గుర్తింపునకు దరఖాస్తు చేస్తే వారి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 1092 పాఠశాలలకు మాత్రమే గుర్తింపు లభించింది.


మిగిలిన బడుల్లో మౌలిక సదుపాయాలు, పిటిఆర్ (351) సిబిఎస్ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వలన అనుమతులు రాని పరిస్తితిలో, తాజాగా విద్యా శాఖపై సమీక్షిస్తూ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబి) సిలబస్ అమలుపై ఈనెలలో ఒప్పందం చేసుకోవాలని జగన్మోహన రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో గొప్పదైన సిబిఎస్ఈ సిలబస్ అంటే ఒక్కసారిగా ప్రభుత్వానికి విముఖత ఏర్పడడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ప్రభుత్వ పరంగా పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీల్లోనే బోధిస్తున్నారు. పదో తరగతి అర్హతతో నియామకమైన అంగన్వాడీ టీచర్లు ఐబి సిలబస్ ప్రమాణాలను అందుకుని బోధించలేరు. పిటిఆర్ ప్రాథమిక స్థాయిలో 301, ప్రాథమికోన్నత స్థాయిలో 351 ఉండాలన్న ఐబి నిబంధనలకు అనుగుణంగా మన పాఠశాలలు లేవు. సిబిఎస్ఈ ప్రమాణాలనే అందుకోలేని మన పాఠశాలలు ఐబి ప్రమాణాలను అందుకోగలవా అనేది ప్రశ్నార్థకమే.

రెండేళ్లలో 6.4 లక్షలమంది జంప్..

గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం 10వ తరగతిలో సగటు ఉత్తీర్ణత 22 శాతం తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి, ఆరవ తరగతుల్లో గతేడాది కంటే సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు తగ్గారు. 2021-22 విద్యా సంవత్సరంలో 44.29 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం 37.88 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో ఉన్నారు. అంటే ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల రెండేళ్లలో 6 లక్షల 41 వేల మంది విద్యార్థులు రివర్స్‌లో ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశోధించేందుకు విద్యాహక్కు చట్టం, ఎన్ సి ఈ ఆర్ టీ నిబంధనల మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన బేస్ లైన్, టిఎఆర్ఎల్ పరీక్షలో విద్యార్థుల పఠన సామర్ధ్యం తగ్గిపోతోందని రెండో తరగతి పాఠ్యాంశాన్ని ఐదవ తరగతి, ఐదవ తరగతి పాఠ్యాంశాన్ని పదో తరగతి పిల్లలు ఎక్కువమంది చదవలేక పోతున్నారని వెల్లడయ్యింది.

ప్రభుత్వ బడుల్లో 6-10వ తరగతి విద్యార్థుల్లో 10 లక్షల 74 వేల 869 మంది మూడు పదాలున్న చిన్న ఆంగ్ల వాక్యాన్ని చదవలేక పోతున్నారు. విద్యా విధానంలో జగన్మోహన రెడ్డి అనుసరిస్తున్న విపరీత విధానాల దుష్ఫలితమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ నివేదికలో ప్రాధమిక విద్యాభ్యాసంలో ఆంధ్రప్రదేశ్ 39.2 % స్కోరుతో 29 వ స్థానంలో నిలవడం. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (2021-22)లో రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. నాడు - నేడు పథకం ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న తర్వాత కూడా పాఠశాల విద్య పనితీరు శ్రేణి సూచికలో కీలకమైన అభ్యసన ఫలితాలు, నాణ్యత డొమైన్ లో 240 పాయింట్లకు గాను కేవలం 47.8 పాయింట్లు, మౌళిక సదుపాయాల డొమైన్లో 190 కి 84 పాయింట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని చెబుతున్నా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, పిల్లల సామర్ధ్యాలు దారుణంగా ఉన్నాయని పై నివేదికలు బట్టబయలు చేశాయి. పరిస్థితి ఇలా ఉంటే సిబిఎస్ఈ, ఐబి అంటూ మభ్యపెట్టకుండా విద్యలో, బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగే విధంగా సరైన దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోపోతే భావి తరాలు దారుణంగా నష్ట పోతాయి.

లింగమనేని శివరామ ప్రసాద్,

79813 20543





Advertisement

Next Story