- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yechuri Seetaram:బహుజన బాంధవుడు ఏచూరి!
జనవరి 17 2016 న.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఉన్నత విద్యాలయాల్లో తిష్టవేసిన అమానుష కులవివక్ష కారణంగా రోహిత్ ప్రాణాలొదిలాడని, ఆ దళితబిడ్డ చావుకు కారకులయిన మనువాదులను శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగాయి. చెట్టంత కొడుకుని కోల్పోయి, పుట్టెడు దుఃఖంతో.. రోహిత్ తల్లి వేముల రాధిక గుంటూరు నుంది హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నది ''నా బిడ్డ చావుకి కారకులైన వారెవరో తేల్చండి..! నాలాగా మరోతల్లికి గర్భశోకం రాకుండా చూడండి...!'' అంటూ ప్రభుత్వ పెద్దలను ఆమె వేడుకున్నది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి గోడును నాడు వినేవారే కరువయ్యారు. లోపలికొచ్చి ఏడవడానికి వీల్లేదంటూ.. నిర్దాక్షిణ్యంగా క్యాంపస్ గేట్లను మూసివేశారు.
ఆ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ఒక జాతీయ స్థాయి నాయకుడు.. వేముల రాధికను ఓదార్చి, దగాపడిన దళిత బిడ్డకు న్యాయం చేయాలంటూ ఉద్యమకారులతో కలిసి నినదిస్తూ.. ధర్నా శిబిరంలో బైఠాయించారు. శూద్రవర్ణంలో పుట్టిన నాయకులు సైతం పదవుల ఆశలో.. మనువాదుల తొత్తులుగా మారి, దళితుల పక్షాన గొంతు విప్పడానికి జంకుతున్న వేళ.. ఒక అగ్రవర్ణ కుటుంబ నేపథ్యం గల నాయకుడు.. దళిత శిబిరంలో కనబడడం నాడు సంచలనాలకు నెలవయింది. ఆ బహుజన బాంధవుడే.. మొన్న ఢిల్లీలో కన్నుమూసిన కామ్రేడ్ సీతారాం ఏచూరి! కమ్యూనిస్టులు నెరిపే కార్మిక వర్గ పోరాటాలతో పాటు.. ఈ దేశ బడుగుల సామాజిక న్యాయ పోరాటాలకు సైతం అడుగడుగునా అండగా నిలిచి.. లాల్ నీల్ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన విశిష్ట నేత సీతారాం ఏచూరి!
కుల వ్యవస్థ పీడితులకు అండగా..
భారతదేశ సామాజిక వాస్తవాలను ఆకళింపు చేసుకున్న ఏచూరి.. వర్గ దోపిడి పీడితులతోపాటు, కుల వ్యవస్థ పీడితులకు సైతం కమ్యూనిస్టులు అండగా నిలవాలన్న సత్యాన్ని గుర్తిం చారు. బడుగుల హక్కుల కోసం జరిగిన ప్రతి పోరాటంలోనూ ఆయన భాగస్వామిగా నిలిచారు. 2003లో.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు ధర్నాలలో సైతం పాలుపంచుకున్నారు. 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సాధన కోసం జరిగిన పోరాటానికి మార్గ నిర్దేశనం చేసిందీ కూడా ఆయనే. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) అధ్వ ర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ముందు జరిగిన ధర్నాలను ఆయనే స్వయంగా ప్రారంభించారు. వ్యవసాయ కూలీల ఉపాధి రక్షణ కోసం నేడు అండగా నిలుస్తున్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని.. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ పెద్దల మెడలు వంచి సాధించిన ఘనతలో ఆయనకు సైతం వాటా ఉన్నది. బీసీవర్గాల కులగణన డిమాండుకు సైతం తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటించాడు.
స్వయంగా వెళ్లి పరామర్శించి..
దేశంలో ఏ మూలన బడుగు వర్గాలపై దౌర్జ న్యాలు జరిగినా.. స్వయంగా వెళ్లి, బాధితులను పరామర్శించి, పీడితులకు న్యాయం దక్కాలని జరిగిన పోరాటాలన్నింటిలో స్వయంగా పాల్గొన్న ప్రజా ఉద్యమకారుడు ఏచూరి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో.. 2020 సెప్టెంబర్ 14న దళిత బిడ్డ మనీషా వాల్మీకి సామూహిక లైంగికదోపిడీకి గురైన వార్త దేశాన్ని అట్టుడికించింది. దుండగులు తన ఠాకూర్ కులానికి చెందిన వారు కాబట్టి.. రేప్ జరగనేలేదంటూ బుకాయించిండు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ దళిత బిడ్డ శవాన్ని సైతం బంధువులకు అప్పగించకుండా పోలీసుల చేత అడవుల్లో దహనం చేయించిండు. భయవిహ్వలురై, గుడిసె నుండి కాలు బయట పెట్టడానికి సైతం వణుకుతున్న ఆ నిరుపేద దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరూ రాకుండా పోలీసు బలాన్ని ఉపయోగించి కట్టడి చేశాడు. ఆ పరిస్థితులలో.. ఆ మారుమూల ఊరికి చేరుకుని, ఆ పూరి గుడిసె తలుపుతట్టి, బాధితులకు ధైర్యం చెప్పి.. ప్రభుత్వ పెద్దల దమన నీతిని ప్రపంచానికి చాటి చెప్పిండు ఏచూరి. ఎమర్జెన్సీ కాలంలో.. విద్యార్థి సంఘ నాయకుడిగా.. నాటి ప్రధాని ఇందిరను జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌కి పిలిపించి, అసమ్మతి పత్రాన్ని చదివి వినిపించి, ఆమె చేత చాన్సలర్ పదవికి రాజీనామా చేయించిన.. ఆ రాజీలేని పోరాట తత్వమే చివరి వరకూ ఆయన వెన్నంటి ఉన్నది.
ఇండియా కూటమి భావనకు రూపశిల్పి
దళిత సంక్షేమానికి అంకితమైన ఐఏఎస్ ఆఫీసర్ ఎస్.ఆర్ శంకరన్ సార్‌ని ఒకసారి పాత్రికేయు లు ఓ ప్రశ్న అడిగారు.. "బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన మీరు దళితుల ఆప్తుడిగా ఎలా మారారు?" అని. "నేను చదివిన మార్క్సిజమే నాకు ఆ మానవీయ దృక్పథాన్ని అందించింది" అంటూ సమాధానం ఇచ్చాడాయన. ఆ ముచ్చట సీతారాం ఏచూరికి సైతం బిల్కుల్ సరిపోతుంది. ఆయన కాంక్షించిన సామ్యవాద స్వప్నంలో సామాజిక న్యాయం సైతం ఒక భాగమని గుర్తించి, ఆచరణలో చూపించాడు. "మేమందరం కట్టుబడిన 'ఐడియా ఆఫ్ ఇండియా' భావనకి రూపశిల్పి ఏచూరినే" అని మొన్న రాహుల్ గాంధీ నివాళి అర్పించాడు. వీర తెలంగాణా గడ్డపై సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో బడుగుజనమే ముందుపీఠిన నిలిచారు. స్వతంత్ర్య భారత తొలి దళిత ప్రతిఘటనగా నిలిచిన "కీలవేణ్మని పోరాటం".. ఎర్రజెండా నీడలోనే సాగింది. తమిళనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 1960 దశకంలో సాగిన ఆ చారిత్రక పోరాటంలో.. తమ న్యాయమైన హక్కుల కోసం భూస్వాములతో పోరాడిన 44 మంది దళిత బిడ్డలు ప్రాణార్పణ కావించారు. ఎర్ర జెండాకు, బహుజన బిడ్డలకూ అవినాభావ సంబంధమే నాడూ నేడూ కొనసాగుతున్నది. అ మహోన్నత సాంప్రదాయానికి వారసుడిగా నిలిచిన కామ్రేడ్ సీతారాం ఏచూరిని బహుజన బిడ్డలు ఎల్లప్పుడూ యాదికుంచుకుంటారు.
ఆర్. రాజేశమ్
కన్వీనర్, సామాజిక న్యాయవేదిక
94404 43183