- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ ప్రాచీన వైద్య విధానాలు
మానవ జాతి ఆవిర్భవించినప్పటి నుంచి మనిషి రోగాలు ఎదుర్కొన్నాడు. వైద్యం కోసం వెదుకులాడాడు. కొండకోనల్లో తిరుగుతూ.. చెట్టూ పుట్టా చాటున తలదాల్చుకుంటూ మనుగడ సాగించిన మానవుడికి గురువూ, పుస్తకం ప్రకృతి మాత్రమే! ప్రకృతిలో కలిగే మార్పులు గమనిస్తూ, ఆ ప్రకృతి అందించే ఆకులు, అలములు, పళ్లు, కంద మూలాలు, వేటాడిన పశు పక్ష్యాదులను తింటూ ఆరోగ్యంగా ఆనందంగా కాలం గడిపేవారు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా చికిత్సలు ప్రకృతిలోనే వెతుక్కున్నాడు. అందరిలో కొంచెం చురుగ్గా ఉండేవారు ఆకులు, మూలికలు తెచ్చి రోగ నివృత్తికి ఉపయోగపడుతుందేమో అని పరీక్షించేవారు.అలా సేకరించిన విషయాలని క్రోడీకరించి చుట్టూ ఉండే సమాజానికి ఉపయోగపడే వైద్య విధానాలను రూపొందించారు. నిశిత పరిశీలన, అవగాహన ఉన్న వ్యక్తులు ఆయా సమాజాలలో ధన్వంతరీలుగాను, అగ్రగణ్యులుగానూ వెలసిల్లి విరాజిల్లారు.ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా నెలకొనడం విశేషం.
వారి అవగాహన ఆధారంగా..
ప్రాచీన సమాజం అందించిన అవగాహన ఆధారంగా ఆధునిక వైద్య వ్యవస్థ మానవుల జీవిత నాణ్యతని పెంచుతూ ఆరోగ్యకర సమాజ స్థాపనకి కృషి చేస్తోంది.చైనా, జపాన్ లాంటి ప్రాచ్య (ఓరియంటల్) సమాజాలు, అమెరికన్ తెగలవారు, వారి వారి అవగాహన మేరకు, వారి చుట్టూ ఉన్న ప్రకృతి చూపిన పరిష్కారాలను తమ సమాజ సభ్యుల ఆరోగ్య రక్షణకి వాడారన్నది మనకు తెలిసిన విషయం. తూర్పు ఆసియా దేశాలైన చైనా, జపాన్, కొరియా,మంగోలియా టిబెట్ ప్రాంతాలకు చెందిన వైద్య విధానం, భారతదేశంతో సహా దక్షిణ, ఈశాన్య ఆసియా ప్రాంతాలలో అభివృద్ధి చెందిన వైద్య విధానాలు, ఈజిప్టు, గ్రీకు, ఇరానియన్, రోమన్ సమాజాలు ఉన్న మెడిటరేనియన్ ప్రాంత వైద్య విధానాలు, ఆఫ్రికన్ ప్రాంత వైద్య విధానాలు, బ్రెజిల్ వంటి దక్షిణ అమెరికా దేశాల వైద్య విధానాలు శతాబ్దాలుగా విరాజిల్లుతూ మనుగడ సాగిస్తున్నాయి.
ఈ వైద్యానికి అనుభవమే పునాది!
అయితే ఇవన్నీ శాస్త్రీయ పద్ధతుల్లో రూపొందించిన విధానాలు కావు. ఇవి అనుభవాధారిత విధానాల ద్వారా రూపొందించబడిన వైద్య విధానాలు, ఔషధాల రూపకల్పనలు. అంతమాత్రం చేత ఈ విధానాలు, ఆయా సమాజాలలో ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలు రోగ నిర్ధారణకు, చికిత్సకు అనువైనవి కావని కాదు. అవన్నీ వాటికి ఉన్న పరిమితులకు లోబడి, శతాబ్దాలుగా ఆయా సమాజాల వైద్య అవసరాలను తీర్చిన, తీరుస్తున్న వైద్య విధానాలు. ప్రతీ విధానంలోనూ స్థానికంగా దొరికే మూలికలు, మొక్కలతో తయారు చేసిన ఔషధాలను వినియోగించడంతో పాటు ఆ విధానానికి వర్తించే రోగ నిర్ధారణ పద్ధతులు అవలంబిస్తారు.
అల్లోపతి శాస్త్రీయమే కానీ..
పంతొమ్మిదవ శతాబ్దంలో అవతరించిన అల్లోపతీ విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, శాస్త్రీయ పద్ధతుల్లో రోగ నిర్ధారణ, చికిత్సా విధానాలను రూపొందించడం వల్ల, నిరంతర అధ్యయనం ద్వారా మెరుగుపరిచే దిశగా వైద్య శాస్త్ర నిపుణులు కృషి చేయడం వలన, తక్కిన వైద్య విధానాలు స్థానిక అవసరాలు తీర్చేవిగా మాత్రమే స్థిరీకరించబడ్డాయి. అయితే ఎంతో అభివృద్ధి చెందిన అల్లోపతీ విధానం కూడా వివాద రహితం కాదు.
ప్రాచీన అహగాహన.. ఆధునిక వైద్యం
శరీరంలో ఏ అవయవానికి వచ్చే వ్యాధికి ఎలాంటి చికిత్స చేయాలి. వ్యాధులను ఎలా నిర్ధారించాలి అన్న విషయంలో ఆధునిక వైద్య అవగాహనకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ఆధునిక వైద్య విధానాలు దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రాచీన సమాజం అందించిన అవగాహన ఆధారంగా ఆధునిక వైద్య వ్యవస్థ మానవుల జీవిత నాణ్యతని పెంచుతూ ఆరోగ్యకర సమాజ స్థాపనకి కృషి చేస్తోంది. వివిధ వైద్య విధానాలు ఎలా మొదలయ్యాయి, వాటిలో రోగ నిర్ధారణ చికిత్స పద్ధతులు ఏలా ఉంటాయి అన్న విషయాలు తెలుసుకోవడం విజ్ఞానదాయకం మాత్రమే కాక వైద్య వ్యవస్థ పట్ల అవగాహన పెంచే అవకాశం ఉంది.
డా. కొవ్వలి గోపాల కృష్ణ
సీనియర్ సైంటిస్ట్ , అమెరికా,