వరల్డ్ వాక్: భారత్ సహకారం కోరుతున్న సింగపూర్ ఎందుకో తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-11 18:45:52.0  )
వరల్డ్ వాక్: భారత్ సహకారం కోరుతున్న సింగపూర్ ఎందుకో తెలుసా?
X

ష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, కోవిడ్ సంక్షోభం వంటి పరిస్థితులు ప్రపంచ దేశాల మధ్య అనేక రంగాలలో స్వయం సమృద్ధి సాధించుటకు, తమ తమ దేశాలను రక్షించుకునేందుకు నూతన కూటములతో జత కట్టడం, వివిధ దేశాల మధ్య కొత్త సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఇండియా-సింగపూర్ మధ్య కొత్త మినిస్టీరియల్ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు 'ఇండియా- సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ఐఎస్ఎమ్ఆర్)'వేదిక నూతనంగా అంకురార్పణ జరిగింది.

దీనిలో భాగంగానే సెప్టెంబర్ 17వ తేదీన సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి 'లాంగ్‌వాంగ్'విదేశాంగ మంత్రి వివాన్ బాలక్రిష్ణన్, వాణిజ్య మంత్రి గాన్ కిమ్‌యాంగ్, రవాణా శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ బృందం భారత్ వచ్చి న్యూఢిల్లీలో మన భారతీయ డెలిగేషన్ నిర్మాలా సీతారామన్, పీయూష్ గోయల్, జయశంకర్ మంత్రుల బ్రృందాన్ని కలిసి అనేక విషయాలపై చర్చించారు.‌ ప్రస్తుతం అస్థిరంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల మధ్య సింగపూర్ పురోభివృద్ధి సాధించుటకు భారత్ సహకారం ఎంతో అవసరం అని తెలిపారు.‌ సింగపూర్ చైనాతో కూడా స్నేహం, సహకారం కోరుతున్నది.‌ 1990లో ప్రారంభించిన 'లుక్ ఈస్ట్ పాలసీ'తరువాత, సౌత్ -ఈస్ట్ ఆసియా దేశాల మధ్య నూతన సంబంధాలు మెరుగుపరచడానికి ఈ నూతన వేదిక ఐఎస్ఎమ్ఆర్ ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు.‌ ముఖ్యంగా టెర్రరిజం, ఫండమెంటలిజం పై పోరాటం అత్యావశ్యకం అని ఇరువురు నేతలు ప్రకటించారు.

ఆర్థిక సంబంధాలు

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారం, పెట్టుబడులు ప్రోత్సహించుకోవడం, ఇరువురికి లాభకర రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత, నూతనంగా వస్తున్న వివిధ రంగాలలో అభివృద్ధి సాధించుటకు అంగీకరించారు. ముఖ్యంగా ఆహారం, ఎనర్జీ, డిజిటలైజేషన్, గ్రీన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఫైనాన్స్ సెక్టార్ ఆపరేషన్స్, గ్రీన్ ఫిన్‌టెక్ కొరకు నిధులు మంజూరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అని ఇరువురు నిర్ణయించారు.

భవిష్యత్తులో ఇరు దేశాలు మరింతగా సహకరించుకుంటూ ఆర్ధికాభివృద్ధి వేగంగా అందుకోవాలని, ఈ ప్రాంతంలో మరింత 'సప్లై చైన్'గా ఎదగాలని ఆకాంక్షించారు.‌ 'మా శక్తితోనే పూర్తిగా మేము అభివృద్ధి సాధించలేము. కావున ప్రపంచ దేశాల సహకారం కావాలి. అందులో ముఖ్యంగా భారత్ సహకారం మాకు మరింత తోడ్పడుతుంది' అని సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి వాంగ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఆసియా దేశాలు ఒకరికి ఒకరు అన్ని రంగాల్లో సహకరించుకుంటూ, ఉగ్రవాదానికి ఉరి వేసి, అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ యూరోపియన్ దేశాలకు ధీటుగా భవిష్యత్తులో నిలబడటానికి ఈఐఎస్‌ఎమ్ఆర్ వంటి కూటములు ఉపయోగపడతాయి అని భావిద్ధాం.


ఐ.ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story

Most Viewed