china: భారత్ పైకి దూకుడు పెంచిన డ్రాగన్

by Ravi |   ( Updated:2022-12-27 19:00:35.0  )
china: భారత్ పైకి దూకుడు పెంచిన డ్రాగన్
X

ముఖ్యంగా జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘర్షణలు, అలజడులు పెరిగాయి. గల్వాన్ ఉదంతం తర్వాత చైనాకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఇండియా ఆ దేశానికి చెందిన పలు యాప్‌లను నిషేధించింది. అయితే, చైనాలో ఉన్న పరిస్థితి వేరు. అక్కడ తయారీ రంగం బాగా అభివృద్ధి చెందింది. అక్కడ తయారైన వస్తువులను మనం దిగుమతి చేసుకోవడం లేదు. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్‌కు సంబంధించిన అనేక పని ముట్లను మనం చైనాకు పంపి, ఆ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. మనం పంపిన ముడి సరుకులతో చైనాలో తయారైన వస్తువులు తిరిగి మన దేశానికి వస్తున్నాయి. తయారీ రంగంలో మనం వెనుకబడి ఉండడమే ఇందుకు కారణం. ఈ రకంగా బలమైన ఆర్థిక శక్తిగా ఉండటం వలన చైనా భారత్ మీద ఎప్పుడు ఒత్తిడిని ఉంచుతున్నది. ఆధునిక చైనా ఏర్పడిన తర్వాత 1983 వరకు భారత్, చైనా ఆర్థిక స్థితులు దాదాపు సమానం. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. చైనా నుంచి దిగుమతుల విలువ 103.60 బిలియన్ డాలర్లు. ఎగుమతుల విలువ కేవలం 32 బిలియన్ డాలర్లు.

భారతదేశానికి ఎప్పుడూ పక్కలో బల్లెం లాగా ఉండే చైనా మరింత దూకుడు పెంచింది. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(jinping) అక్టోబర్ మాసంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎంపికై మూడవసారి చైనా అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. పార్టీ నూరవ మహాసభలు, 20వ జాతీయ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ పదవిని స్వీకరించి ప్రపంచంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. చైనాలో కూడా ఆయనకు ఎదురులేని పరిస్థితి ఏర్పడింది. ఆ మహాసభలలో ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రసంగిస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తమ మిలిటరీ సిబ్బందికి పిలుపునిచ్చారు.

తైవాన్‌తో యుద్ధం ఎప్పుడైనా రావచ్చునని, అందువలన ఇప్పటినుంచే దానికి సన్నద్ధం కావాలని ఉద్బోధించారు. ఇది తైవాన్(taiwan) ఉద్దేశించి చెప్పినా, పరోక్షంగా భారత్‌కు కూడా ఒక హెచ్చరికగా భావించవచ్చు. సరిహద్దు రేఖ వెంబడి జరుగుతున్న అలజడిని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. 2020లో గల్వాన్ ఘర్షణ(galwan valley clash) సందర్భంగా సూర్యాపేటకు చెందిన సంతోష్‌ బాబు(Colonel Santosh Babu) సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనాకు సంబంధించిన కొంతమంది సైనికులు మరణించారు. తమ సైనికులు ఎవరూ మరణించలేదని తొలుత చెప్పిన చైనా తర్వాత ధ్రువీకరించింది.

వారికి ప్రాధాన్యం

గల్వాన్ ఘర్షణలో పాల్గొన్న చైనా మిలిటరీ సిబ్బందికి కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో పాల్గొనే అవకాశం కల్పించి, వారికి తగు ప్రాముఖ్యతను ఇవ్వడం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారతదేశంతో తలపడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజెప్పే ఉదాహరణలు. గల్వాన్ ఉదంతం తర్వాత రెండు, మూడు సార్లు సరిహద్దు ప్రాంతంలో చైనా సైనికుల అలజడి కనిపించింది. లడక్, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో చైనా మిలిటరీ కొన్ని పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టింది. కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. వీలు కుదిరినప్పుడల్లా చైనా(china) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది.

తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో(tawang sector) చైనా సైనికులు ఒక నదిని దాటి మన దేశంలో చొరబడాలని ప్రయత్నించినట్టు, మన సైనికులు ఎదురు దాడి జరిపినట్టు చిత్రాలు బయటికి వచ్చాయి. మన సైనికులు వారిని గట్టిగానే ఎదుర్కొన్నట్టు ఆ చిత్రాలు నిరూపించాయి. చిన్న చిన్న గాయాలేగానీ, ప్రాణనష్టం జరగలేదు. ఘర్షణ దాదాపు ప్రశాంతంగా ముగిసింది. ఇరుదేశాల వారు కమాండర్ స్థాయిలో చర్చించుకుని తాత్కాలికంగా ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు.

నిరుపయోగంగా చర్చలు

తవాంగ్ ఘర్షణ కంటే ముందు గల్వాన్ ఉదంతం తర్వాత కమాండర్ స్థాయిలో 16 సార్లు చర్చలు జరిగాయి. కమాండర్ స్థాయి చర్చల వల్ల పెద్దగా ఫలితం ఉండడం లేదని, తాత్కాలిక ప్రశాంతతనే ఏర్పడుతున్నదని అక్కడి పరిణామాలు తెలియజేస్తున్నాయి. చైనా దుష్ట పన్నాగాలకు వెరవకుండా వారిని ఎదుర్కొనేందుకు మన దేశం కూడా ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెంచడంతోపాటు సైనికులు సులభంగా చేరేలా రహదారులు, టన్నెల్స్ నిర్మిస్తున్నది. భారత్‌తో పర్మినెంట్ శత్రుత్వం పెట్టుకున్న చైనా ఏ సమయంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితి సరిహద్దులో ఉంది. దీనికి కనుచూపు మేరలో శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. చైనాతో మనకు ఇంతవరకు రెండు యుద్ధాలు జరిగాయి. 1962, 1967లో జరిగిన ఆ యుద్ధాలు రెండు దేశాలకూ నష్టం కలిగించాయి.

1962 యుద్ధం తరువాత దాదాపు 38 వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా ఆక్రమించినట్టుగా భారతీయ మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. చైనా దీనికి ఒప్పుకోవడం లేదు. తమ భూమిని మాత్రమే తాము తమ ఆక్రమణలో ఉంచుకున్నామని వారి వాదన. భారతదేశం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా వాదిస్తున్నది. రెండు దేశాల మధ్య గీసిన వాస్తవాధీన సరిహద్దు రేఖ విషయంలో కూడా రెండు దేశాలకు వివాదాలు ఉన్నాయి. మనం చూపించే రేఖను చైనా ఒప్పుకోవడం లేదు. చైనా చూపించే రేఖను మనం ఒప్పుకోవడం లేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ విషయంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది. యుద్ధం తర్వాత కొంతవరకు ప్రశాంతంగా ఉన్నా పాలకుల కారణంగా ఘర్షణలు చెలరేగుతున్నాయి.

అందుకే ఘర్షణలు

ముఖ్యంగా జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘర్షణలు, అలజడులు పెరిగాయి. గల్వాన్ ఉదంతం తర్వాత చైనాకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఇండియా ఆ దేశానికి చెందిన పలు యాప్‌లను నిషేధించింది. అయితే, చైనాలో ఉన్న పరిస్థితి వేరు. అక్కడ తయారీ రంగం బాగా అభివృద్ధి చెందింది. అక్కడ తయారైన వస్తువులను మనం దిగుమతి చేసుకోవడం లేదు. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్‌కు సంబంధించిన అనేక పని ముట్లను మనం చైనాకు పంపి, ఆ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. మనం పంపిన ముడి సరుకులతో చైనాలో తయారైన వస్తువులు తిరిగి మన దేశానికి వస్తున్నాయి. తయారీ రంగంలో మనం వెనుకబడి ఉండడమే ఇందుకు కారణం. ఈ రకంగా బలమైన ఆర్థిక శక్తిగా ఉండటం వలన చైనా భారత్ మీద ఎప్పుడు ఒత్తిడిని ఉంచుతున్నది.

ఆధునిక చైనా ఏర్పడిన తర్వాత 1983 వరకు భారత్, చైనా ఆర్థిక స్థితులు దాదాపు సమానం. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. చైనా నుంచి దిగుమతుల విలువ 103.60 బిలియన్ డాలర్లు. ఎగుమతుల విలువ కేవలం 32 బిలియన్ డాలర్లు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ప్రధాని మోడీ ఈ నెల 25న ఒక ప్రసంగంలో తెలిపారు. చైనా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక శక్తి కలిగిన దేశంగా ఉంది. మిలటరీ పరంగా, వ్యాపార, వాణిజ్యపరంగా పరిశ్రమలు బాగా ఉన్న కారణంగా చాలా బలమైన దేశంగా ఉన్నది. కానీ, మన దేశం సంకల్ప శక్తి ముందు చైనా ఎందుకూ పనికిరాదు.

మిలిటరీ స్థితిగతులు

చైనాకు మిలిటరీ, వాయు, నావికా దళాలు కలిసి దాదాపు పది లక్షల మంది సుశిక్షితులైన సైనికులు ఉన్నారు. యుద్ధ ట్యాంకులు, తుపాకులు, రైఫిల్స్, అటాకింగ్ రైఫిల్స్, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఆధునిక మిలిటరీ ఆయుధాలు కలిగిన దేశం చైనా. అణ్వస్త్రాలు కూడా మనకంటే చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. అలా అని మన దేశం పూర్తిగా బలహీనంగా లేదు మన బలం మనకు ఉన్నది. చైనా లాగే మన దగ్గర కూడా సుఖోయ్ విమానాలున్నాయి. అత్యంత పెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్(INS vikranth) వంటి ఆధునిక యుద్ధ వాహనాలను మనం కలిగి ఉన్నాము. అందువలన చైనా బెదిరింపులకు మనం భయపడాల్సిందేమీ లేదు. కాకపోతే, యుద్ధం అంటూ సంభవిస్తే ఇరు దేశాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ నష్టం జరుగుతుంది. అందుకే మన ప్రధాని మోడీ ఇది యుద్ధాల శకం కాదని అంటున్నారు. చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా మనం చైనా నుంచి నిత్యం జాగరూకతతో ఉండవలసిన అవసరం ఉంది.

శ్రీనర్సన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

83280 96188

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed