పుస్తకం ఒక మంచి నేస్తం

by Ravi |   ( Updated:2023-04-21 00:45:49.0  )
పుస్తకం ఒక మంచి నేస్తం
X

పుస్తకం మూడక్షరాలే అయినా ఎంతో మంది కలలకు ఆధారం, సామాన్యుని ఆయుధం పుస్తకం. చిరిగిన చొక్కనైన తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కొమ్మన్నాడు గురజాడ అప్పారావు. ఒక మంచి పుస్తకం వేయి మంది మిత్రులతో సమానమని అన్నారు మరో మహానుభావుడు. అలా ఎందరో మహానుభావులు పుస్తకం విశిష్టతను తెలియజేశారు. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకుడిని తనలో లీనం చేసుకునేది పుస్తకం. ఒంటరితనంలో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు పుస్తకం. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు.హస్త భుషణమే కాదు మన మస్తిష్కంలో ఉత్పన్నమయ్యే ఆలోచనల లావాను బయటపెట్టి అందరితో పంచుకునే మార్గం పుస్తకం. పుస్తకం నోరు తెరువని ఉపన్యాసకుడు. మౌనం వహించిన మహాకవి. ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు. పది మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చుని చదివే ఒక పుస్తకం ఎంతో ఉత్తమం.

17వ శతాబ్దంనాటి యూరప్‌లో ఈ రోజును సెయింట్ జార్జ్ డే గా పాటించేవారు. స్పెయిన్‌లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది. 2017 సంవత్సరానికి గానూ రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని ‘కొనాక్రీ’ సిటీని, 2018 సంవత్సరానికి గానూ గ్రీస్‌లోని ‘ఏథెన్స్‌’ నగరాన్ని 2022 సంవత్సరానికి గానూ మెక్సికో నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది.

పిల్లలు ఏడ్చినా, విసిగించినా, అలిగినా అన్నం తినకపోయినా వారిని నియంత్రించడానికి నేటి తరం ప్రయోగిస్తున్న అస్త్రం స్మార్ట్ ఫోన్. దీని పర్యవసానంగా చిన్నతనంలోనే ఎదుగుదల మందగించడం, కళ్లద్దాలు రావడం. డిజిటల్ యుగంలో చదవడం తక్కువైపోయింది అనడం నిర్వివాదాంశం. చిన్ననాటి నుండే పిల్లలకు స్మార్ట్ ఫోన్లను, ట్యాబ్‌లను అందించడం ద్వారా వారిలో పఠనాసక్తి తగ్గుతున్నది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తప్పులేదు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలకు వారు బానిసవ్వడం ఆందోళనను కలిగిస్తున్న అంశం.

పుస్తకం లేని ఇల్లు అత్మలేని శరీరం వంటిది అన్నారు పెద్దలు. పుస్తక పఠనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు సరిగా శిక్షణ పొందేలా పుస్తక పఠనం సహాయపడుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సరైన నిద్రకు పుస్తక పఠనం దోహదం చేస్తుంది. ఒంటరితనాన్ని తగ్గిస్తుంది, మంచి సంభాషణకు, ఏకాగ్రతను మెరుగుపరచడానికి కూడా పుస్తక పఠనం తోడ్పడుతుంది.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదివేలా వారిలో పఠనాసక్తిని పెంచేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలి. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అలవాటు చేసే విధంగా పాఠశాల టైం టేబుల్‌లో ప్రత్యేకంగా ఒక పీరియడ్ కేటాయించాలి. పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించే వివిధ పోటీల్లో బహుమతులుగా పుస్తకాలను ఇస్తే ప్రయోజనకరం. ఎన్ని డిజిటల్ పరికరాలు ఉన్నా అవి పుస్తకానికి మాత్రం సాటి రావు.

(ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా...)

సుధాకర్.ఏ.వి

90006 74747

Advertisement

Next Story

Most Viewed