వైన్స్ పనివేళలు పెంచొద్దు

by Ravi |   ( Updated:2023-03-28 00:15:21.0  )
వైన్స్ పనివేళలు పెంచొద్దు
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ద్వారా రాయు బహిరంగ లేఖ.

గత శుక్రవారం 24 -3-2023 నుంచి రాష్ట్రంలో మద్యం షాపుల పని వేళలను రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు పెంచడం చాలా బాధాకరమైన విషయం. ఇది అప్రజాస్వామిక నిర్ణయం. మద్యపాన నిషేధాన్ని అంచెలంచలుగా తీసేస్తానని మీరు మ్యానిఫెస్టో ద్వారా మాటిచ్చారు. కానీ అంచెలంచెలుగా దీన్ని పెంచడం ద్వారా కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమవుతుంది.

ఇప్పటీకే పోలీస్‌ స్టేషన్లో గృహహింస కేసులు పెరుగుతున్నాయి. యూనివర్సిటీలో, కాలేజీలలో, స్కూళ్లలో విద్యార్థులు తరగతిగదికి తాగి వస్తున్నారు. దీంతో మీరు రూపొందిస్తున్న విద్యావ్యవస్థ పునాదులు తాగుడుతో కదిలిపోతున్నాయి. అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాల ద్వారా వచ్చే డబ్బు దగ్గర దగ్గర 50% మళ్లీ తిరిగి మద్యం షాపులకే చేరుతుంది. 8 గంటల నుంచి 10 గంటలకు పెంచిన తర్వాత పోలీసులు రోడ్లను కాపాడలేరు. తాగుడు కోసం దొంగతనాలు పెరుగుతున్నాయి. రాత్రులు అత్యాచారాలు జరుగుతున్నాయి.

రాజ్యాంగ నిబంధనలను మద్యపాన విషయంలో మీరు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. మద్యం ఆదాయం ద్వారానే ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకోవడం అంటే అది చాలా అవమానకరమైన, బాధాకరమైన విషయం. మీరిస్తున్న ఆరోగ్యశ్రీలో కిడ్నీలు, లివర్లు, గుండె జబ్బులు, న్యూరో, మనోవైకల్యాలు సంబంధిత రోగాలకు ఎక్కువగా గురవుతోంది తాగుబోతులే, దీనివల్ల ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. మీరు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నారు అనే పేరు ఈ మద్యపానం అమ్మకాల వల్లే ఎక్కువగా వస్తోందని గ్రహించగలరు. మద్యానికి తోడు గంజాయి, మత్తు మందులు, పబ్‌లు, జూద శిబిరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిజానికి 8 గంటలనుండి 10 గంటల వరకు పెంచిన మద్యపాన షాపుల సమయాన్ని అమలుపరిచినట్లయితే పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, డి[గీ పరీక్షలు అన్నింటి మీద పెద్ద ప్రభావం పడుతుంది. మద్యపాన విక్రయ షాపుల పనిగంటలను ఎనిమిది నుండి 10 గంటల వరకు పెంచడాన్ని అమలు చేస్తే శాంతిభద్రతల సమస్య తీవ్రతరమవుతుంది. ఈ విషయాన్ని మీరు తీవ్రంగా పరిగణించి వెంటనే 8 నుండి 10 గంటల వరకు పెంచిన సమయాన్ని ఆపడమే కాక మద్యపాన నిషేధానికి మీరు పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు మద్యపాన నిషేధం అమలు చేయకపోతే అది రాజకీయంగా కూడా జనాదరణలో తీవ్రమైన మార్పులకు గురి అవుతుంది. కావున ఈ విషయమై పునఃపరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నా.

డా. కత్తి పద్మారావు

9849741695.

Advertisement

Next Story

Most Viewed