- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రిజర్వేషన్లు..చట్టం చేస్తేనే పాటిస్తారా?
భారత రాష్ట్ర సమితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసింది. అయితే 115 మందితో కూడిన ఈ ఫస్ట్ లిస్ట్‌లో ఏడుగురు మహిళలకు మాత్రమే చోటు కల్పించింది. దీంతో ఈ అంశం అధికార పార్టీని విమర్శించడానికి విపక్షాలకు ఒక అస్త్రంలా మారింది. కాగా, మహిళలకు అధిక స్థానాలను కేటాయించిన చరిత్ర గులాబీ పార్టీకి గతంలోనూ లేదు. అయితే ‘చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు’ కల్పించే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ వేదికగా ధర్నాలు చేయడంతో.. ‘కారు’ పార్టీపై అంచనా పెరిగింది. ఈ సారి మహిళలకు అత్యధిక టికెట్లు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లు కేటాయించడంతో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మరోసారి దీక్ష!
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు ప్రకటించాక, కవితను ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై ఇదేనా చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. మహిళలకు ఇంకా ఎక్కువ టికెట్లు ఇవ్వాలని తండ్రి కేసీఆర్‌ను ఎందుకు అడగడం లేదని నిలదీశారు. ఈ విమర్శలపై కవిత సైతం ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు అనవసరంగా నాపై విమర్శలు చేస్తున్నారు. మహిళలకు ఏ పార్టీలు ఎన్ని సీట్లు కేటాయించాయనేది ముఖ్యం కాదని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే వారికి అన్ని పార్టీల్లో న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే వారి ప్రాతినిధ్యం పెరిగిందని గుర్తు చేశారు. అయితే 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. అసలు నేను ఈ అంశాన్ని గుర్తు చేస్తేనే రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ఈ బిల్లును ఆమోదించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో మరోసారి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతానని, ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ వంటి మహిళా నేతలను సైతం ఆహ్వానిస్తానని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయినా మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్ళుగా.. రాజకీయ అంశంగా
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో 2008 మేలో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సులకు పంపించారు. ఆ తర్వాత 2010లో రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించారు. లోక్‌సభకు పంపినా ఆమోదం పొందలేదు. 15వ లోక్‌సభలో ఇది వీగిపోయింది. పలుమార్లు ఈ బిల్లు మీద రాజకీయ పార్టీల మధ్య చర్చ జరిగినా.. ఇందుకు పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవటంతో.. ఈ బిల్లు అక్కడితో ఆగిపోయింది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా ఒక రాజకీయ అంశంగా ఉపయోగపడుతున్నది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు.. రాజకీయంగా సెంటిమెంట్‌ను రగిలించేందుకు ఈ బిల్లును నేతలు తరచూ ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద ఈ అంశంపై ధర్నా చేసే సమయంలోనూ విమర్శలు వచ్చాయి. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో మాట్లాడకుండా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పేరు బయటకు రావటంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఈ బిల్లును తెరపైకి తెచ్చారని విపక్షాలు విమర్శించాయి.
చిత్తశుద్ధి లేకనేనా!
మహిళా రిజర్వేషన్ల కోసం చేసే పోరాటానికి చిత్తశుద్ధిని కవిత నిరూపించుకోవాలంటే బీఆర్ఎస్ టికెట్ల విషయంలోనూ తండ్రిని ప్రశ్నించాల్సింది. అలా కాకపోయినా పొగడకుండా మౌనంగా ఉన్నా సరిపోయేది. అయితే ‘దందార్ లీడర్ - ధమాకే దార్ డెసిషన్’ అంటూ కవిత ట్వీట్ చేయడం కూడా అనేక విమర్శలకు తావిచ్చింది. చట్టం చేసే వరకు చూడకుండా పార్టీలు స్వతహాగా మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయించే స్వాతంత్ర్యం వారికున్నది. ఈ అంశంపై పోరాటం చేస్తున్నామని చెప్పేవాళ్లయితే కచ్చితంగా 33 శాతం టికెట్లు కేటాయించి మహిళలు, ప్రజల విశ్వాసం గెలుపొందే అవకాశమున్నది. అయితే గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీ చేసే వారిలో నిర్ణీత శాతంలో మహిళలు ఉండేటట్లు చూడాలన్న ప్రతిపాదనకూ ఆమోదం లభించడం లేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శలు సైతం ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం
ప్రస్తుతం పార్లమెంట్‌లో సభ్యుల సంఖ్య 543. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మంది మహిళలు లోక్‌సభలో అడుగుపెడ్తారు. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 78 మంది మాత్రమే. అంటే 14.3 శాతం. చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ అసెంబ్లీలో అడుగుపెడుతున్న మహిళల శాతం తొమ్మిదిలోపే ఉంటున్నది. అన్ని రాష్ట్రాలను కలుపుకొని దేశం మొత్తం మీద 4235 అసెంబ్లీ స్థానాలుంటే, అందులో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 476 మాత్రమే. అంటే ఇది 11 శాతం మాత్రమే. తెలంగాణలో 2014లో తొమ్మిదిగా ఉన్న మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 2018 ఎన్నికల తరువాత ఐదుకు పడిపోయింది. అయితే మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకువస్తే బీఆర్ఎస్ నుంచి కనీసం 39 నుంచి 40 స్థానాలకు మహిళలకు కేటాయించాల్సి వచ్చేది. వీరిలో సగం మంది మహిళలు గెలిచినా అసెంబ్లీలో అడుగుపెట్టే ఎమ్మెల్యేల సంఖ్య 20 వరకు ఉండే అవకాశముండేది. తెలంగాణలో ప్రతివర్గానికీ మేలు చేస్తున్నామని టముకు వాయిస్తున్న ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో ఈ మౌనం పాటించడం దేనికన్నది ప్రశ్న.
-ఫిరోజ్ ఖాన్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
96404 66464
- Tags
- Women