కేసీఆర్ మైండ్‌గేమ్.. కాంగ్రెస్ తట్టుకునేనా?

by Ravi |   ( Updated:2023-08-17 08:13:27.0  )
కేసీఆర్ మైండ్‌గేమ్.. కాంగ్రెస్ తట్టుకునేనా?
X

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో సానుకూల వాతావరణం నెలకొంది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన అధికార బీఆర్‌ఎస్‌పై సహజంగానే ఏర్పడే ప్రతికూలత కాంగ్రెస్‌కు అనుకూలంగా సాగుతున్నట్టు ఆ పార్టీతో సహా విమర్శకులు సైతం భావిస్తున్నారు. అయితే అధికారంలోకి రావడానికి బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తనదైన అంతుచిక్కని వ్యూహాలైన.. రైతు రుణ మాఫీ, ఆర్టీసీ విలీనం, బీసీలు, మైనారిటీలకు లక్ష రూపాయల నగదు, గృహలక్ష్మీ లాంటి పథకాల ద్వారా వ్యతిరేక వాతావరణం నుంచి సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు వెలికి తీస్తున్నారు.. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో కేసీఆర్‌తో సహా కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తూ.. రాష్ట్రాన్ని ఎన్నికల మూడ్‌లోకి తీసుకువచ్చారు.

ఎత్తులలో మహా దిట్ట..

కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక అర్థం, ప్రతి నడక వెనుక ఒక మాయాజాలం ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో బెదిరింపులు, ఆటుపోట్లను సునాయాసంగా తన రాజకీయ చతురతతో ఎదుర్కొన్న మహామేధావి కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయడంలో అన్నీ పార్టీలు వరుసగా విఫలం అవుతున్నాయి. కేసీఆర్ రాజకీయంగా ఎవరితోనూ శత్రుత్వం గాని, మితృత్వం గాని, శాశ్వతంగా ఉంచుకోడు, ముఖ్యంగా విభిన్న ఆలోచన ద్వారా మాస్టర్ స్ట్రోక్ లేదా మైండ్ గేమ్‌ల ద్వారా ప్రతిపక్షాలలో అయోమయం సృష్టించి వాళ్ళ బలాలు- బలహీనతలు, అవసరాలను ఆసరాగా చేసుకుని వివిధ సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ, తన మాటల, చేతల ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో కేసీఆర్‌కి ఉన్న పరిజ్ఞానం ఎవ్వరికి లేదన్నది నగ్న సత్యం.

పలు ప్రైవేట్ సర్వేలలో 70కి పైగా అసెంబ్లీ సీట్లలో ప్రభుత్వంపై వ్యతిరేకం ఉందనీ, 40 ( మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు కలిపితే ) సీట్లల్లో మాత్రం వ్యతిరేకత అధిగమించి గ్యారంటీగా గెలుస్తుందని, విపరీత ధన ప్రవాహం, ఓట్లను కొనుగోలు చేయడం ద్వారా, ప్రతిపక్ష అభ్యర్థుల నియోజక వర్గాల్లో చీలికలు లేదా డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడం లేదా ఇతర పార్టీల నేతలు గెలిపించీ, తర్వాత పార్టీ ఫిరాయింపుల ద్వారా ఇంకో పది నుంచి పదిహేను సీట్లలో గెలిపించుకునే అసాధారణ నైపుణ్యం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమని ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. అందుకే రేవంత్ రెడ్డి సైతం 80 సీట్లు కాంగ్రెస్ గెలవకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలను అపడం దేవుని తరం నుంచి కాదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కేసీఆర్‌కి సాధారణ మెజారిటీ చేరుకోలేకపోతే తన చిరకాల మిత్రపక్షం ఎమ్ఐఎంను కలుపుకుంటే సాధారణ మెజారిటీ రావడం కష్టమైన పనేమీ కాదని, బీజేపీని వ్యతిరేకించే ప్రజలు, ముస్లిం సమాజం గంపగుత్తగా బీఆర్ఎస్‌కు ఓట్లు వేయడం ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం 100% కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం బీఆర్ఎస్ పార్టీలో ప్రబలంగా ఉంది. తన మాస్టర్ స్ట్రోక్‌లతో ఎవరి మస్తిష్కానికి అందనంత ఎత్తులో కేసీఆర్ ఆలోచనలు ఉంటాయనే విషయం మరువద్దు.

కాంగ్రెస్ దూకుడు..

రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ ఫైర్ బ్రాండ్, ముక్కుసూటి నైజం, ప్రత్యర్థులపై ఎదురుదాడి, పదునైన బాణాలతో అధికార పార్టీని, వ్యతిరేక శక్తులను సైతం ఆగమాగం చేస్తూ, ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే దూకుడు స్వభావం ఆయనకు మాత్రమే సొంతం. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేత. ఆయన ఏం చేసినా సంచలనమే... విమర్శలైనా, నిరసనలైనా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంటారు. కేవలం 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే 130 ఏళ్ల చరిత్ర గల జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు అయ్యారు. రాజకీయాల్లో తలపండిన నేతలను సైతం దీటుగా ఎదుర్కొంటూ... తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు పాదయాత్రలు చేస్తూ, ప్రత్యర్థి వ్యూహాలను ఛేదిస్తూ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శక్తి యుక్తులను ధారపోస్తున్నారు.

ఇటీవల ఆయన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన మాజీ కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను పార్టీలోకి రప్పిస్తున్నారు. ఎన్నికల టైంలో సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా పోరాడే సూచనలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ముస్లిం మెజార్టీ ఉన్న నియోజకవర్గాలలో ఎంఐఎం తన అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్‌కు లాభం చేకూర్చవచ్చనే అనుమానం కొందరిలో ఉండటంతో దీనికి పోటిగా ముస్లింలను ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. అయితే పార్టీకి గతంలో లాగా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు లేవు. అన్ని విధాల బలంతో తులతూగుతున్న బీఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి బీఆర్‌ఎస్‌లో ఉన్న కొందరు బడా వ్యాపారవేత్తలే కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

ఆ ఎన్నికల జోరు ఉండేనా?

తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమని జి.కిషన్‌రెడ్డి, ఈటెల రాజేందర్ అంటున్నారు. అయితే, ఆకాంక్ష ఉండగానే సరిపోదు, ఆ దిశగా తగిన పార్టీ నిర్మాణం, వ్యూహం ఉండి తీరాలి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు గెలవాలి. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాలకు ఒక సీటు గెలిచింది. అప్పుడు సాధించిన ఓట్ల శాతం కేవలం 6.98 మాత్రమే. కానీ అనూహ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అప్పుడు 20 శాతం ఓట్లు సాధించింది. నాటి ఎన్నికలలో 21 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ ఓట్లు సాధించగా, మరో 22 స్థానాల్లో ఓట్లపరంగా రెండో స్థానంలో నిలిచింది. కనుకనే తెలంగాణలో బీజేపీ బలం పుంజుకునే అవకాశం వుందని ఆ పార్టీ అగ్ర నాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్నట్టు కనిపించింది. కానీ పట్టణ పరిధిలో బీజేపీ కొంత నిర్మాణం ఉన్నా, గ్రామీణ స్థాయిలో బీజేపీ నిర్మాణం బలపడలేదన్నది వాస్తవం. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి గణాంకాల ప్రకారం చూసుకున్నా.. ఆనాడు మెజారిటీ సాధించిన 21 స్థానాలతో పాటు, రెండో స్థానంలో నిలిచిన 22 స్థానాలను కైవసం చేసుకుంటే బీజేపీకి అది అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. బీజేపీ నాయకులు కేసీఆర్‌ కుటుంబపాలన, అవినీతి గురించి గొప్పగా మాట్లాడుతున్నారే తప్ప, శిక్షలు వేయలేక పోతున్నరనే అపవాదు ప్రజల్లో బాగా నాటుకుపోయింది.

సర్వేలు ఏం తేల్చాయి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ బయటికి ధీమాగా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం కనీసం 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని సర్వేలు వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి బీఆర్‌ఎస్‌కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ జిల్లాల్లో భారీ విజయం సాధించాలంటే కాంగ్రెస్ చాలా కష్టపడాల్సిందే. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కొంత బలం పుంజుకున్నప్పటికీ, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గట్టి పట్టున్న అభ్యర్థుల కోసంవేట మొదలెట్టారు. కొద్దిరోజుల క్రితం రేవంత్‌ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు చెరి 45 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, మరో 15 స్థానాల్లో రెండు పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందని చెప్పాడు. కాంగ్రెస్‌కు 35 శాతంతో పోలిస్తే బీఆర్‌ఎస్ ఓట్ల శాతం 37 శాతం ఉంటుందని, ఆ కొంచెం ఓట్ల శాతం ఎన్నికల టైంలో పోలరైజేషన్ జరిగి, బీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా తగ్గుతుందని, అలాగే బీజేపీ కేవలం ఆరు లేదా ఏడు సీట్లతో ఓట్ల శాతం 22 శాతం నుంచి 14 శాతానికి తగ్గిపోతున్నదన్నారు.చివరికి ఎంఐఎం కూడా తనకున్న ఏడు సీట్లకి మించి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఏ మాత్రం లేదన్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సా లేదా బీజేపీనా అనేది రాబోయే ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి..

డా. బి. కేశవులు నేత, ఎండి

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Advertisement

Next Story