టీచర్ల చావులు ప్రభుత్వానికి శాపం!

by Ravi |   ( Updated:2023-03-09 19:15:12.0  )
టీచర్ల చావులు ప్రభుత్వానికి శాపం!
X

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. విద్యారంగ చరిత్రలో చావుల అధ్యాయం మొదలవడం అవాంఛనీయ పరిణామం. ఈ నెలలో ఇప్పటికే 5 గురు ఉపాధ్యాయులు మరణించడం మనసును కలచివేస్తోంది. తప్పు ఎవరిది అయినా జరుగుతున్న సంఘటనల వలన టీచర్ల కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి. నిన్నమొన్నటి దురదృష్టకర మరణాలు మాత్రమే కాదు, అంతకు మించి వ్యధలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉపాధ్యాయ లోకం వాస్తవ జీవితం కోల్పోయింది. బడి గంట సమయం మించిపోతుందనే భయం, హాజరు ఆలస్యమవుతుందనే ఒత్తిడి మధ్య ప్రయాణిస్తున్న సొంత వాహనం ఎక్సలేటర్ స్పీడో మీటరును పరిమిత వేగపు పరిధిని దాటిస్తోంది. నిర్ణీత సమయంలో యాప్‌లు అప్లోడ్ చేయకుంటే అధికారులు బదనాం చేస్తారనే భయం వారిలో దడ పుట్టిస్తోంది. ఉద్యోగులను పనిదొంగలుగా సమాజం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన పాలకులు ప్రజలను దారి మళ్లిస్తున్నారు.

కారణమేదైనా నేలరాలుతున్నది ఉపాధ్యాయులే! విద్యుక్త ధర్మ నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురై నూరేళ్ళ జీవితాన్ని నడి ప్రాయంలో పోగొట్టుకుంటున్నది ఉపాధ్యాయులే! దరిమిలా ఆయా కుటుంబాలకు తీరని నష్టం జరుగుతోంది. వృద్ధాప్యంతోనో, వ్యాధుల తీవ్రతతోనో అనారోగ్యానికి గురై అర్ధంతరంగా తనువు చాలించడం వేరు. ఆత్మనూన్యతాభావంతో మానసిక ఒత్తిడికి గురై ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం వేరు. గుండెలు పిండేంతటి భయానికి గురిచేసి చచ్చిపోయేలా చేయడం వేరు. విధుల నిర్లక్ష్యం పేరుతో చర్యా ప్రేరేపిత ఆత్మహత్యలకు ప్రోత్సహించడం వేరు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. విద్యారంగ చరిత్రలో చావుల అధ్యాయం మొదలవడం అవాంఛనీయ పరిణామం.

హరీ మంటున్న గురువులు...!

మొన్న రోడ్డు ప్రమాదంలో నందిగామలో శ్యామల కుమారి, రాజమ్మ, నిన్న చీరాల మండలం వాకావారి పాలెం లో గుండెపోటుతో తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు జయరాజ్. ఈ నెలలో ఇప్పటికే 5 గురు ఉపాధ్యాయులు మరణించడం మనసును కలచివేస్తోంది. తప్పు ఎవరిది అయినా జరుగుతున్న సంఘటనలు వలన టీచర్ల కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి. కరోనా టైంలో కూడా ఇదే విధంగా వందలాది మంది ఉపాధ్యాయులు నేలకొరిగారు. ఇలా.... నిన్నమొన్నటి దురదృష్టకర మరణాలు మాత్రమే కాదు అంతకు మించి వ్యధలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈరోజు ఏ అధికారి వస్తాడో ఏం ప్రశ్నిస్తాడో, ఏ సమాధానం చెప్పాలో తెలియని అగమ్యగోచర స్థితి ఉపాధ్యాయులను వెంటాడుతోంది.

దడ పుట్టిస్తున్న సమయపాలన

ఉపాధ్యాయ లోకం వాస్తవ జీవితం కోల్పోయింది. బడి గంట సమయం మించిపోతుందనే భయం, హాజరు ఆలస్యమవుతుందనే ఒత్తిడి మధ్య ప్రయాణిస్తున్న సొంత వాహనం ఎక్సలేటర్ స్పీడో మీటరును పరిమిత వేగపు పరిధిని దాటిస్తోంది. నిర్ణీత సమయంలో యాప్‌లు అప్లోడ్ చేయకుంటే అధికారులు బదనాం చేస్తారనే భయం వారిలో దడ పుట్టిస్తోంది. మీదుమిక్కిలి డజన్ల కొద్దీ యాప్‌లు తమ సొంత సెల్ ఫోన్లలో పరకాయ ప్రవేశం చేసి ఉపాధ్యాయులను వెక్కిరిస్తున్నాయి. దీంతో తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధనా స్వేచ్ఛను కోల్పోయారు. ఉపాధ్యాయుల కొరతతో మితిమీరిన అనవసర పనిభారం ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా జీవన గమనంలో సమతుల్యత కోల్పోయి ప్రాణాలు బలి పెడుతున్నారు.

ఉపాధ్యాయులకు జీతమే జీవిత సమస్యగా మారింది. ఇప్పుడు తాజాగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపుదలపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తూ ప్రధానోపాధ్యాయులను వెబెక్స్‌ల్లో నలిపేస్తున్నారు, మూలిగే నక్క మీద తాటిపండు బైజూస్ యాప్‌లో సబ్జెక్టు కంటెంట్ చూడాలనే ఉత్తర్వులు అప్పుడే వెలువడ్డాయి. ఒకవైపు రోజువారీ పరీక్షలు. బైజూస్‌లో కంటెంట్ ఎంత సమయం చూసారనేది కూడా పాఠశాల ఫేసియల్ యాప్‌లో అప్లోడ్ చేయాల్సివుంది. లేదంటే తాఖీదులు. అధికారులు సృష్టిస్తున్న ఈ పెను తుఫాను ధాటిని దీటుగా ఎదుర్కోగలిగేలా ఉపాధ్యాయులు రాటుదేలలేదు. అంతేకాకుండా సంఘాల్లోని అనైక్యత కూడా ప్రభుత్వానికి ఆయాచితంగా కలిసొచ్చింది. వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దకుండా సకల పాపం టీచర్లదే అన్నట్లు, తమను శాపగ్రస్థులుగా మార్చేసిన కులీన సమాజంలో ఉపాధ్యాయులు తమకు తామే జవాబుదారీ అయ్యారు.

టీచర్లను భయపెట్టి బావుకుంటారా!

దశాబ్దాల తర్వాత పాలకుల వైఖరిలో మార్పుతో జీతానికి కట్టుబడి వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయారు. అయితే వ్యక్తి స్వేచ్ఛ, ఉద్యోగుల స్వేచ్ఛ భిన్నమైనవి కావు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగితే చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు. అయితే చట్టం ముసుగులో మానసికంగా హింసిస్తుంటే, వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంటే, మానసిక దుర్భలురను చేస్తుంటే సాధారణ ఉపాధ్యాయుల దైన్యాన్ని ఎవరికి చెప్పుకోవాలి ఎలా సాంత్వన పొందాలి జీవితాలను ఎలా కాపాడుకోవాలి కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న ఈ వ్యధాభరిత వ్యవహారానికి ముగింపు కోసం కొంత సంయమనంతో సమిష్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగిని సీసీఏ రూల్స్‌తో మాత్రమే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ హక్కుని ఒక్కసారి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు ఆత్మాభిమానం కలవారు. భయపెట్టి సాధించేదేమీ ఉండబోదు. వారిని అభిమానంతో మాత్రమే జయించగలరనే వాస్తవాన్ని గ్రహించాలి.

ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందనేందుకు సవాలక్ష ఉదాహరణలున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చాలా సఖ్యత ఉంటే ఆ పరిస్థితి ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ వారిని బదనాం చేస్తే ప్రజలు మరింత సంతోషపడతారని ప్రభుత్వానికి ఎవరైనా ఉచిత సలహాలు ఇచ్చినట్లుంది. అందుకే బ్రిటిష్ కాలం నాటి సీసీఏ నిబంధనలకు పదునుపెట్టే యత్నాలు ఆరంభించింది. అణచివేత ద్వారా అదుపులోకి తెచ్చుకోవాలని నడుం బిగించింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్ళ తర్వాత ఉద్యోగులను దారికి తెచ్చుకోవాలని సంకల్పించింది. అందుకే జిల్లా పాలనాధికారులకు అందిన సూచనల మేరకు వారు కార్యరంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ఉద్యోగుల కదలికలను కట్టడిచేసే యత్నాలు ముమ్మరం చేశారు. తనిఖీల పేరుతో, నిఘా విభాగాలు నెలకొల్పి ఠారెత్తించబోతున్నారు. దీనిని పరోక్ష గూఢచర్యంగానే చూడవలసివుంటుంది. ఇదొక దుస్సాహసం.

టీచర్లపై ‘దండ’ ప్రయోగం

ఇపుడే నిద్ర మేల్కొన్నట్టు ప్రభుత్వం ఎందుకు ఇంత ఎక్కువగా స్పందిస్తోందో అంతుపట్టడం లేదు. ప్రజలకు సేవలందించడంలో ఉద్యోగుల వెనుకబాటుతనం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందా జవాబుదారీతనం తగ్గిందా ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. అయితే దాన్ని సరి చేయడానికి సవాలక్ష మార్గాలున్నాయి. దాన్ని బూచిగా చూపి ప్రభుత్వం లోని ప్రతి శాఖలోని ఉద్యోగులపైనా డేగ కన్ను వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజా బాహుళ్యం నుంచి వచ్చిన వారే కదా! వారిని ప్రత్యేక శత్రువర్గం గా ముద్ర వేయడం దేనికి సంకేతం ప్రజలకు దూరం చేయడంవల్ల బావుకునేదేంటి? ఉపాధ్యాయుల, ఉద్యోగుల పనితీరును కొలవడానికి అనేక ప్రామాణిక పద్ధతులున్నాయి. వారు నిజంగా పని చేయకుండా తప్పించుకు తిరుగుతున్న సందర్భంలో అదుపులో పెట్టడానికి మరెన్నో మార్గాలున్నాయి. సామ, బేద, దాన దండోపాయాలలో చివరి అస్త్రం గత్యంతరం లేని స్థితిలో తీసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి.

ఈ సంకట స్థితికి కారణంమేంటి కారకులెవరు? తెరముందు పాత్రధారులెవరు, తెరవెనుక సూత్రధారులెవరు? ఈ తరహా వైఖరి ఏ వైపు దారితీస్తుంది? ఇంత యాగీ చేసి ప్రభుత్వం బావుకునేదేంటి? ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేని శాఖలకు కూడా ఇదే సెగ పెట్టడంలోని ఆంతర్యం ఏంటి? నిశితంగా పరిశీలిస్తే ఆదాయ వనరులు లేని విద్య, వైద్య శాఖలపై ఈ ఒత్తిడి నరాలు చిట్లే స్థాయికి పెంచారు.

ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోరుతున్న ఉద్యోగులను ప్రభుత్వం కుంటిసాకులతో మూడేళ్ళుగా ఇబ్బందులకు గురి చేస్తోందన్నది ఉద్యోగ వర్గం గుర్తించింది. కరువు భత్యం ఎగ్గొట్టి పెరుగుదల అంటూ పీఆర్సీలో చూపించడం ఒక అశాస్త్రీయ వాదనను తెరపైకి తేవడాన్ని ఎండగడుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే మెలుగుతూనే అవకాశం దొరికిన సందర్భంలో భగ్గుమంటున్నారు. ఉద్యోగులను పని దొంగలుగా సమాజం ముందు నిలబెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన పాలకులు ప్రజలను దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య వారధులుగా పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం అనుమానం కలిగేలా, అపవాదు వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉద్యోగులపై నిఘా పెట్టి హాజరు, పనితీరును ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, డాగ్‌స్క్వాడ్లతో తనిఖీలు చేయించబూనడం దురదృష్టకరం. ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉద్యోగులను పని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం.

గౌరవ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ మిత్రులారా! సకాలంలో స్కూల్‌కి వెళ్లడానికి సమయం మించి పోతుందని ప్రాణాలను ఫణంగా పెట్టి రిస్కు తీసుకోవద్దు. ఆలస్యం వలన ఆందోళనతో ప్రాణాలు కోల్పోవద్దు. వత్తిడికి గురయి హార్ట్ ఎటాక్‌లకు గురి కావద్దు. జాగ్రత్తగా పాఠశాలకు చేరుకోండి. మిమ్మల్ని నమ్ముకుని మీ పాఠశాల మాత్రమే కాదు, మీ కుటుంబాలు, పిల్లలు కూడా ఉన్నారు అని గుర్తుంచుకోండి.

మోహన్ దాస్

రాష్ట్ర కౌన్సిలర్, ఏపిటిఎఫ్ 1938.

94908 09909

Advertisement

Next Story