తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారా?

by Ravi |   ( Updated:2024-06-01 01:01:05.0  )
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారా?
X

నాలుగున్నర కోట్ల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ నూటికి నూరుపాళ్లు ప్రతిబింబించేలా ఉన్న పాత రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు కోరారు. ఈ నిర్ణయం సరైంది కాదని కాకతీయ తోరణం, చార్మినార్‌కు మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డా. అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ పాట జనాల్లోకి ఎంత బలంగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలను ఉర్రూతలూగించిన పాట అది. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక చరిత్ర ప్రతిబింబించే రీతిలో ఈ గీతం సాగుతుంది. ఈ పాటను గతంలోనే తెలంగాణ అధికార గీతంగా ప్రకటిస్తారని అనుకున్నా అది జరగలేదు. కానీ పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ తొలి క్యాబినేట్ మీటింగ్‌లోనే ఈ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. కానీ గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడు ఎందుకు అవసరమొచ్చిందో అర్థం కావడం లేదు.

ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతిరూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2011 జనవరి 3న విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు సామూహికంగా ఆలాపించిన తెలంగాణ గీతం. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల హృదయాలను ఒకచోట చేర్చిన భావోద్వేగాలతో కూడుకుని వెలిగింది. జనగణమన, వందేమాతరం చిత్రాలకు సర్వ కల్పన చేసింది సినీసంగీత దర్శకులు కాదే..!

తెలంగాణ తల్లి చిత్రాన్నీ మారుస్తారా?

అలాగే 2017 డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు మహాసభల్లో గత ప్రభుత్వం కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. కానీ విగ్రహంలో మార్పులు చేర్పులు చేయాలని గతంలో కాంగ్రెస్ సూచించింది. కానీ కేసీఆర్ పట్టించుకోకపోవడంతో.. తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీభవన్‌లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పట్లో రూపొందించింది. పైగా అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాం అంటూ ఆనాడే హెచ్చరించింది. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిపిన రూపంలో మన తెలంగాణ తల్లిని కొలుద్దామంటూ.. గతంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు కూడా. ఇప్పటికే రాజముద్ర, పలు పథకాల పేర్లు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం స్థాన ఆ పార్టీ రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుందేమోననే సందేహాలు బలపడుతున్నాయి.

చిహ్నం మార్పు సహేతుకమేనా?

గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ అధికారిక చిహ్నంను నాలుగున్నర కోట్ల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ నూటికి నూరుపాళ్లు ప్రతిబింబించేలా రూపొందించారు. అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు కోరుతున్నారు. చిహ్నం మార్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైనది కాదని వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన కాకతీయ రాజులు, ఓరుగల్లు కేంద్రంగా తెలుగు రాష్ట్రాలను అత్యంత అద్భుతంగా పాలించారని, చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని అలాంటి చిహ్నాన్ని మారుస్తాననడం సరికాదని వాదిస్తున్నారు. ఇంతటి విశేషం ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్‌కు మించిన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

- సుధాకర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed