మునుగోడులో ఎవరిది ఆఖరి ఆట?దీని ఎన్నిక తర్వాతే రాష్ట్ర రాజకీయం మారబోతుందా?

by Ravi |   ( Updated:2022-09-03 13:58:51.0  )
మునుగోడులో ఎవరిది ఆఖరి ఆట?దీని ఎన్నిక తర్వాతే రాష్ట్ర రాజకీయం మారబోతుందా?
X

బీజేపీ టీఆర్‌ఎస్ వ్యూహరచనను అమలు పరుస్తున్న పార్టీగా రూపాంతరం చెందుతున్నది. బీజేపీ మునుగోడులో కాషాయ జెండా ఎగురేయాలని తహతహలాడుతుంటే, సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఇక కాంగ్రెస్ తాపత్రయపడుతున్నది. రేవంత్ వర్సెస్ రాజగోపాల్‌గా పరిస్థితులు మారిపోయాయి. దీంతో మునుగోడులో కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని, అది తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. మునుగోడును కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్‌కు తిరుగుండదని భావిస్తోంది. తదనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. నవంబర్‌లో జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు బీజేపీకి కీలకం కావడంతో జాతీయ నాయకత్వం అక్కడ తిష్ట వేసుకుని ఉంటుంది. ఇదే అదనుగా తెలంగాణలో ముందస్తుకు వెళ్లి స్వీప్ చేయాలనే ఎత్తుగడలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటది. ఈ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజ‌కవర్గాలు ఉన్నాయి. 'మునుగోడు' నియోజకవర్గంలో ఆరు మండలాలు మునుగోడు, నారాయణపూర్, మర్రిగూడ, చండూరు, నాంపెల్లి, చౌటుప్పల్ ఉండేవి. గట్టుప్పల్ కొత్త మండలంగా ఏర్పడింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ సెగ్మెంట్‌లో 2004లో జరిగిన ఎన్నికలలో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐకి చెందిన పల్లా వెంకటరెడ్డి టీడీపీ అభ్యర్థి చిలువేరు కాశీనాథ్‌పై 11,285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అప్పటి సీఎం డా. వైఎస్ రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మేల్యేలను నయానా, భయానా లొంగదీసుకునే యత్నం చేశారు. దీంతో 2009 టీడీపీతో కలిసి ఎన్నికలకు పోవడం సీపీఐకి కలిసి వచ్చింది. సీపీఐ అభ్యర్థి వి. యాదగిరిరావు గెలుపొందారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. కాలం చెల్లిన సిద్ధాంతాలతో కకావికలం అయిన నయా రివిజనిష్టుల పార్టీకి నిలువ నీడ లేకుండా చేసింది. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఆయన నోటి దురుసుతో తమ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జులను కించపర్చి, పార్టీకి దూరంగా ఉండి, బీజేపీ మైండ్ గేమ్‌లో చిక్కుకొని మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది.

అన్ని పార్టీలకూ కీలకమే

ఇపుడు మునుగోడు కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా తయారైంది. గెలుపు కీలకంగా మారింది. అదే ఆసక్తికరంగా ఉండి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్నపుడూ కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ రాజకీయాలను శాసించారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు ఉన్న జిల్లా కావడం, అది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి ఎలాగైనా ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని అధిష్టానం రాష్ట్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసింది.అతిరథ మహారథులకు ఎన్నిక బాధ్యతను అప్పగించింది.వచ్చే ఎన్నికల మీద మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం తప్పకుండా ఉంటుందన్నది నిర్వివాదాంశం.

గట్టుప్పల్ మండలం సహా మొత్తం ఏడు మండలాలలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో హుజురాబాద్ ఎన్నికల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం జరుగుతుందని గ్రహించి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థానం చేజిక్కించుకుంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు 'నల్లేరు మీద నడకే' అని నాయకత్వం భావిస్తున్నది. 'గెలుపు గుర్రం' అన్వేషణ ప్రారంభించింది. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది. ఈ ఎన్నికలలో విజయం సాధిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందని, ఒకవేళ పరాజయం పాలైతే పార్టీ అధోగతేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గులాబీ బాటలో కమలం

తెలంగాణ ఉద్యమ ఫలితంగా, కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి అడుగు జాడలోనే ఇప్పుడు అధికారం పొందేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోంది. తెలంగాణ ఉద్యమం నీరు గారిపోతున్న ప్రతిసారీ ఉద్యమ పునరుత్తేజం కోసం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ రాజీనామాస్త్రాలతో ఉప ఎన్నికల పాచికలు ప్రయోగించేది. ప్రతి ఉప ఎన్నిక ఆ పార్టీ క్యాడర్‌ను అలర్ట్‌గా ఉంచటమే కాకుండా ఉద్యమ విస్తృతికి హేతువవుతుందని నాడు టీఆర్‌ఎస్ అధినేత ఆలోచన. ప్రతీ ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో రాజీనామా వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్నది. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందడం, అదే ఊపులో హుజూరాబాద్‌లో ఈటల విజయం దాని ఫలితమే. తర్వాత కూడా బీజేపీ టీఆర్‌ఎస్ వ్యూహరచనను అమలు పరుస్తున్న పార్టీగా రూపాంతరం చెందుతున్నది.

బీజేపీ మునుగోడులో కాషాయ జెండా ఎగురేయాలని తహతహలాడుతుంటే, సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఇక కాంగ్రెస్ తాపత్రయపడుతున్నది. రేవంత్ వర్సెస్ రాజగోపాల్‌గా పరిస్థితులు మారిపోయాయి. దీంతో మునుగోడులో కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని, అది తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. మునుగోడును కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్‌కు తిరుగుండదని భావిస్తోంది. తదనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. నవంబర్‌లో జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు బీజేపీకి కీలకం కావడంతో జాతీయ నాయకత్వం అక్కడ తిష్ట వేసుకుని ఉంటుంది. ఇదే అదనుగా తెలంగాణలో ముందస్తుకు వెళ్లి స్వీప్ చేయాలనే ఎత్తుగడలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తారనే భయంతోనే దృష్టి మళ్లించేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ పావుగా వాడుకొని టీఆర్ఎస్ పైకి వదిలారనే విమర్శ ఉంది. త్రిముఖ వ్యూహంలో మును(జనం)గోడులో జరిగే చివరి ఆటలో విజేతగా ఎవరు నిలుస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరమాల ఎవరికో వేచి చేద్దాం మరి!!

డా. సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355

Advertisement

Next Story

Most Viewed