ఈయన వెంట హిందువులు నడుస్తారా?

by Ravi |   ( Updated:2024-10-03 00:46:11.0  )
ఈయన వెంట  హిందువులు నడుస్తారా?
X

తిరుమల హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన లడ్డూ మహా ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులను తీవ్రమైన మనోవేదనకు గురిచేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం కల్తీ జరిగిందనీ, అదేం జరగలేదంటూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి రాజకీయ కోణంలో చేపట్టిన ఒక కుట్ర అని మరొక వర్గం అంటుంది. ఈ రెండు వర్గాల వాదనలు ఎటు ఉన్నా-సామాన్య హిందు వులు ఈ విషయంలో వాస్తవం ఎంత? అవాస్తవం ఎంత? అనే సందిగ్ధంలో చిక్కుకున్నారనేది వాస్తవం.

ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉప‌ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై సంవేదన చెందడం, హిందూ ధర్మం పట్ల లౌకికవాద రాజకీయ నాయకులకు చులకన భావన ఉందని, శ్రీవారి మహా‌ప్రసాదంలో కల్తీ జరగడం మహా అపచారమని, ఇందుకోసం 11 రోజులపాటు పరిహార దీక్షకు ఉపక్రమించడం, మంచి నిర్ణయమే. ఇక నుండి హిందూ ధర్మానికి రక్షణగా తాను ఉంటానని, హిందూ ధర్మ రక్షణ కోసం తన ప్రాణాన్నైనా ఫణంగా పెడతానని ఆయన ప్రకటించడం సాహసోపేతమైన చర్యే! స్వతంత్ర భారతదేశ చరిత్రలో లౌకికవాద పార్టీలకు చెందిన ఏ హిందూ రాజకీయ నాయకుడు ఇంత తెగింపుతో హిందూ ధర్మం కోసం తాను నిలబడతానని మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన సంవేదనను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోకుండా, హిందూ వ్యతిరేకులు కొందరు సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు గుప్పించడం నిజమైన హిందువులకు కోపం తెప్పించే విషయమే!

90 శాతం మందికి ధర్మనిష్ట లేదు!

లౌకికవాద ముసుగులో హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి తీవ్ర నష్టం జరుగుతుందనీ, తిరుమల హిందూ ధర్మ వ్యతిరేక కార్యక్రమాలకు కేంద్రమైందనీ, ఈ పుణ్యక్షేత్ర పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత తగ్గిందని, అన్యమతస్తులను టీటీడీ నుండి తొలగించాలని హిందుత్వ సం స్థల ప్రతినిధులు చాలా రోజుల నుండి వాపోతూనే ఉన్నారు. వీరి వాదనకు ఏనాడు ప్రాధాన్యతనివ్వని తెలుగు మీడియా, అధికార పార్టీ నాయకులు శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై గళం విప్పిన వెంటనే-విస్తృత స్థాయి కవరేజీ ఇవ్వడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ విషయంలో అత్యుత్సా హం ప్రదర్శించే మీడియా చానల్స్‌కు హిందూ ధర్మ పరి రక్షణ కంటే అధికార పార్టీ నాయకులకు సాగిలపడటడమే ముఖ్యమైన విషయంగా తోచిందనేది స్పష్టమవుతుంది.

ఇక హిందువులమని చెప్పుకునే హిందువుల మానసిక స్థితిని పవన్ కల్యాణ్ సరిగా అంచనా వేసినట్లు లేదు. హిందువుల్లో నూటికి 90 మందికి కుల నిష్ట తప్ప ధర్మనిష్ట లేదు. తమ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల, తమ మత గ్రంథాల పట్ల సరైన అవగాహన లేదు. 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం అనేకమంది ప్రచారకులు తయారు చేసి, నిరంతరం శ్రమిస్తున్నా హిందువుల ఆలోచన విధానం లో ఆశించిన విధంగా మార్పు రాలేదు.

శత్రువులు ఎక్కువవుతారు..

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, కేవలం హిందుత్వ విలువల కోసమే బీజేపీ పనిచేస్తుందనేది సత్యం. అయినప్పటికీ ఆ పార్టీకి కేవలం 37% హిందువులు మాత్రమే ఓట్లు వేస్తా‌రు. హిందుత్వ వ్యతిరేక పార్టీల ఓట్లు చీలిపోవడం వల్ల 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పూర్తి మెజార్టీ సీట్లు సాధించింది. అదే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ 240 సీట్లకు పరిమితం కావడానికి కారణాలు సుస్పష్టం. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉచిత హామీలకు ఓటర్లు లొంగిపోయారనేది వాస్తవం కాదా? ఇలాంటి విషయా లపై అవగాహన లేకుండానే హిందూ ధర్మ రక్షణకు నేను ముందుంటానని పవన్ ప్రకటించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇక సనాతన ధర్మ రక్షణ కోసం 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటు అవసరమని ఆయన చేసిన సూచన హర్షనీయం. ఆయనకు హిందుత్వ ముద్ర పడడంతో రాజకీయ శత్రువులు పెరిగే అవకాశం ఉంది. హిందుత్వం కోసం పని చేసేవారికి సహజంగా ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు ప్రధాన శత్రువులుగా నిలుస్తారు. ఇక కుల పిచ్చితో కునారిల్లుతున్న హిందువులు సైతం శత్రువర్గాల్లో చేరిపోతారు. హిందుత్వ సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు ఆయన ఆలోచనలకు మద్దతు ఇచ్చేదాన్ని బట్టి ఆయన భవిష్యత్తు నిర్ణయం అవుతుందంటే అతిశయోక్తి కాదేమో!

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Advertisement

Next Story

Most Viewed