బీజేపీ కింగ్ మేకర్ కానుందా?

by Ravi |   ( Updated:2023-11-24 00:31:11.0  )
బీజేపీ కింగ్ మేకర్ కానుందా?
X

తెలంగాణలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీలు జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికలు గతం లాగా కాకుండా చాలా ఆసక్తికరంగా ఉంటాయని ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అందులో భాగంగా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ 2018 ఎన్నికల తర్వాత, రాష్ట్రంలో పుంజుకున్న తీరు.. ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు కూడా అందరికీ విదితమే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 30 నుండి 40కి పైగా అసెంబ్లీ సీట్లలో ‘త్రిముఖ పోటీ’ బలంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతుందా అనే చర్చ కూడా నేడు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుత మూడు పార్టీల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా హంగ్ వస్తే బీజేపీకి వచ్చిన సీట్ల ద్వారా అది ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కూడా అయ్యే అవకాశం ఉందని అర్ధమవుతుంది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీని అంత సులువుగా తక్కువ అంచనా వేయలేము, పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అలాంటి అవకాశాలు కూడా ఉంచొచ్చు.

బీజేపీకి అనుకూలించే అంశాలు..

తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా, బీసీ అభ్యర్ధిని ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించినప్పటి నుండి ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం పెరిగింది. అదే విధంగా బీసీలకు అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీగా ఈ పార్టీ గుర్తింపు పొందింది. మహిళల కూడా అన్ని పార్టీలకంటే ఎక్కువ సీట్లు కేటాయించింది. మేనిఫెస్టో కూడా అమలకు సాధ్యమయ్యే అంశాలు మాత్రమే పొందుపరిచి అన్ని పార్టీల లాగా కాకుండా స్పష్టమైనటువంటి అంశాలను మాత్రమే పొందుపరిచి ఒక ప్రత్యేకతని చాటుకుంది. బీసీ అధ్యక్షుని తొలగింపుతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న పార్టీ పైన పేర్కొన్న అంశాలతో.. మళ్లీ ఆ పార్టీ గ్రాఫ్‌ పెంచేందుకు దోహదపడ్డాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి పార్లమెంట్ సభ్యులు కూడా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం వారి చరిష్మా కూడా కొంత వరకు ఎక్కువ సీట్లను గెలవడానికి, కొన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం, ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం బీజేపీకి కలిసొచ్చే అంశాలు.

మరికొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీలకు చెందినటువంటి వ్యక్తులపై ఉన్నటువంటి వ్యతిరేకత, ఆసహనం లాంటి అంశాలు కూడా ఓటర్లు బీజేపీ వైపు చూడడానికి కారణం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రకటించిన హామీలు, చేసిన కొన్ని అభివృద్ధి పనులు, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ లాంటివి కూడా పలు జిల్లాల్లో ఓటర్లను ప్రభావితం చేసి ఎక్కువ సీట్లను సాధించడానికి ఉపయోగపడొచ్చు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు వారు ప్రవేశపెట్టినటువంటి విధానాలు, పథకాలు కూడా కలిసిరావొచ్చు.. మోడీ చరిష్మా ఇందుకు అదనపు బలం! ముఖ్యంగా బీసీ, దళిత, యువ ఓటర్లు మద్దతుతో కేంద్రంలో మోడీ గ్యారెంటీలతో ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామనే ధీమాలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇలా మొత్తానికి బీజేపీ 2018 కంటే ఈసారి ఎక్కువ సీట్ల గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహిస్తుందనే చర్చ జనాల్లో నేడు జరుగుతుంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం కాబోతుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కర్ణాటక రాష్ట్రం స్థానంలో తెలంగాణ ఉంటుందని భావిస్తున్నారు.

డా. కె. శ్రవణ్ కుమార్

[email protected]

Advertisement

Next Story