అగ్నిపథ్ మీద ఆందోళన ఎందుకు?

by Ravi |   ( Updated:2022-09-03 15:18:45.0  )
అగ్నిపథ్ మీద ఆందోళన ఎందుకు?
X

దేశంలో బీజేపీ అధికారం చేపట్టాక తీసుకువస్తున్న సంస్కరణలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, పౌరసత్వ సవరణ చట్టం, రైతు చట్టాలు, ప్రస్తుతం అగ్నిపథ్ దేశవ్యాప్త ఆందోళనలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు వలన పేద ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆశించాం కానీ, అది నెరవేరలేదు. జీఎస్టీ అమలు వలన ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావించాం. మార్పుల సంగతి అటుంచితే పన్నుల భారం పెరిగింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం దీనిపై కొన్ని ప్రాంతాలలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. రైతు చట్టాల మీద ఉద్యమం సుమారు సంవత్సరకాలం కొనసాగగా, చివరకు స్వయంగా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకున్నారు.

ఇందులో ఉన్నదేంటి?

సైనికుల ఎంపిక విధానంలో 'అగ్నిపథ్' నూతన ప్రక్రియ. సైన్యంలో యువశక్తి ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను సైన్యంలోకి ఎంపిక చేసుకుంటారు. ఆరు నెలల శిక్షణ తర్వాత మూడున్నర సంవత్సరాలు వారి సేవలు ఉపయోగించుకుంటారు. ఆ తరువాత ఇందులో నుంచి 75 శాతం మందిని రిటైర్ చేసి ఇంటికి పంపుతారు. 'ఈ నాలుగేళ్ల కాలంలో నెలకు 30 నుండి 40 వేల రూపాయల వరకు జీతం. జీవిత బీమా సౌకర్యం.

రిటైర్మెంట్ సమయంలో 11.71 లక్షల రూపాయల ప్యాకేజీ, తదుపరి ప్రభుత్వ హామీతో స్వయం ఉపాధి కల్పించుకోవడానికి బ్యాంకు రుణ సదుపాయం. చదువు కొనసాగాలంటే వారికి ఇంటర్‌తో సమానమైన సర్టిఫికెట్ ఇస్తామని, భవిష్యత్తుకు ఢోకా లేదని' ప్రభుత్వం చెబుతున్నది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 శాతం మందిని అగ్ని వీరులుగా రెగ్యూలర్ సైన్యంలోకి చేర్చుకుంటారు. అయినప్పటికీ యువకులలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చినట్లు? ప్రాణాలకు తెగించి ఆందోళనలు ఎందుకు చేస్తున్నట్లు? ఇప్పటివరకు ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలపై అనేక ఉద్యమాలు అహింసా మార్గంలోనే జరిగాయి. ఈ రెండు ఉద్యమాలు మాత్రమే ఎందుకు హింసాయుతంగా మారుతున్నట్లు?

రక్షణ రంగం బలోపేతం కోసం

ఉత్తర భారతదేశంలో యువత ఎక్కువగా సైనిక ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. దేశ సేవకు సైన్యంలో చేరుతుంటారు. ఇపుడు సాధారణ భర్తీని రద్దు చేస్తూ కేవలం నాలుగు సంవత్సరాల సర్వీస్‌తో నూతన విధానాన్ని ప్రకటించడంతో యువతలో తీవ్ర ఆందోళన మొదలైంది. సాధారణ భర్తీ ద్వారా ఆర్మీలో చేరితే సుమారు 15 నుంచి 20 సంవత్సరాలపాటు ఉద్యోగం చేయవచ్చు. పెన్షన్ ఉంటుంది. తదుపరి చిన్న చితకా ఉద్యోగాలతో జీవితం నెట్టుకు రావచ్చు. కానీ, అగ్నిపథ్ కారణంగా ఇకముందు ఎంపిక కానున్న వారికి అన్ని ప్రయోజనాలు హరించుకుపోనున్నాయి. అందుకే ఆందోళనలు మొదలయ్యాయి.

మరొక విషయం ఏమిటంటే ఇప్పటికే ఆర్మీ రిక్రూట్మెంట్ మొదలై శారీరక పరీక్ష ముగిసింది. రాత పరీక్ష మాత్రమే మిగిలి ఉంది. దానిని ఇప్పటివరకు ఆరు సార్లు వాయిదా వేశారు. శారీరక పరీక్షలలో నెగ్గిన యువత దాదాపుగా ఉద్యోగాలు వచ్చినట్లే అని మానసికంగా సంసిద్ధులై ఉన్నారు. కేంద్రం అగ్నిపథ్ తీసుకురావడంతో ఆగ్రహానికి గురయ్యారు. రక్షణ వ్యవస్థకు కేటాయిస్తున్న నిధులలో ఎక్కువ మొత్తం జీతభత్యాలకు, పింఛన్లకే సరిపోతుంది. రక్షణ రంగ ఆధునికీకరణకు ఖర్చు పెట్టడానికి వనరులు తక్కువగా ఉన్నాయి. అగ్నిపథ్ విధానం ద్వారా ఎంపికైన వారికి పెన్షన్లు ఇవ్వాల్సిన పని లేదు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవచ్చునని కేంద్రం పేర్కొనడం విస్మయానికి గురిచేస్తున్నది.

దేశ రక్షణ విషయంలోనూ

జీవితాలను పణంగా పెట్టి దేశ సేవలో ఉన్న వారికి రిటైర్మెంట్ అనంతరం కల్పిస్తున్న పెన్షన్ ప్రభుత్వానికి భారంగా మారడం విచారకరం. 2004 నుంచి ఒక్క సైనికులకు తప్ప ఏ ఉద్యోగికీ పెన్షన్ సౌకర్యం లేదు. సైనికులకు పెన్షన్ ఇవ్వడం ఖర్చుగా భావించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్‌పరం చేస్తూ, ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చుతున్నారు. చివరకు కాంట్రాక్టు సైనిక విధానాన్ని తీసుకురావడం దేశ రక్షణ అని ఎలా అనిపించుకుంటుంది.

ప్రతిభ కనబరిచినవారినే అగ్ని వీరులుగా సైన్యంలోకి తీసుకుంటున్నప్పుడు, మళ్లీ ప్రతిభ ఆధారంగా 25 శాతం మాత్రమే రెగ్యూలర్ సైనికులుగా తీసుకోవడం సరి కాదు. నాలుగు సంవత్సరాల తరువాత అందరినీ రిటైర్మెంట్ పేరుతో ఇంటికి పంపరని గ్యారెంటీ ఏమిటి? అగ్నివీరులకు రిటైర్మెంట్ అనంతరం పారా మిలటరీ దళాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడంతో వారి భవిష్యత్తుకు హామీ దొరికినట్టే. కానీ, మన దేశ పరిస్థితులకు తాత్కాలిక సైనిక పద్ధతి సరిపోదు. కొన్ని దేశాలలో ఈ రకమైన సైనిక నియామక ప్రక్రియ ఉండొచ్చు. మన దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దీనిని పునరాలోచించాలి. దేశానికి యువతే బలం. యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.

జుర్రు నారాయణ యాదవ్

టీటీయూ, అధ్యక్షుడు

మహబూబ్‌నగర్

9494019270

Advertisement

Next Story