కాళేశ్వరం మునకలో తప్పెవరిది?సాల్వ్ చేసేందుకు మేఘాకు ఉన్న అడ్డంకి ఏంటి?

by Ravi |   ( Updated:2022-09-03 15:15:37.0  )
కాళేశ్వరం మునకలో తప్పెవరిది?సాల్వ్ చేసేందుకు మేఘాకు ఉన్న అడ్డంకి ఏంటి?
X

తెలంగాణలో సాగునీటి సమస్య దశాబ్దాలుగా భావోద్వేగంతో నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అమలుకు వచ్చాయి. ఈ మూడు ప్రాజెక్టులకు దాదాపు రూ. రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సాగునీటి రంగంలో లేదా మరే ఇతర రంగాలలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదు. ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుల పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమవుతుందని ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, దానికి విరుద్ధంగా, రాష్ట్రం ఆర్థికాభివృద్ధికి ప్రతికూలంగా, ముంపుతోనూ ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయా?

తెలంగాణ భౌగోళికంగా గురుత్వాకర్షణ ఆధారిత ప్రాజెక్టులకు సానుకూలంగా లేదు. తెలంగాణలో రెండు ప్రధాన దక్షిణాది నదులు కృష్ణా, గోదావరి ముఖ్య పరీవాహక ప్రాంతాలు ఉన్నప్పటికీ, నీరు తక్కువ స్థాయిలో ఉండగా, అవసరం ఎక్కువ స్థాయిలో ఉంది. అందువలన సాగునీటిని అందించాలంటే కచ్చితంగా ఎత్తిపోయాల్సిందే. ఇది అత్యంత ఖరీదైన ప్రక్రియ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పెద్ద పెద్ద మార్పులతో ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని కూడా ఊహించని విధంగా పెంచేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ. 80 వేల కోట్లు. ఖర్చు ఇప్పటికే రూ. 1 లక్షా 20 వేల కోట్లకు చేరుకుందని అంటున్నారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని అదనంగా పొందడానికి ప్రాజెక్టును మరింతగా పొడిగించే చర్యలు మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1 లక్షా 10 వేల కోట్లు అని ఆగస్టు 2021లో పేపర్లు నివేదించాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువలు, ఇతర నిర్మాణాలు, అదనపు భూసేకరణ, అదనపు టీఎంసీ కోసం పైపులు మొదలైన వాటితో ఈ ప్రాజెక్ట్ వ్యయం మొత్తంగా రూ.1 లక్షా 50 వేల కోట్ల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

అసలు వాస్తవం ఏమిటంటే

కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోవడం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. బాహుబలి పంప్‌‌హౌస్‌లు ఎంత వరద వచ్చినా మునిగిపోవని పదే పదే చెబుతూ వచ్చారు. అయినా, మునిగిపోయాయి. 17 బాహుబలి మోటర్లకు రక్షణగా సిమెంట్‌‌‌తో కట్టిన ఫోర్‌‌ బేస్‌‌మెంట్‌‌ గోడ దారుణంగా కూలిపోయింది. పంప్‌‌హౌస్‌ హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ గేట్లు కూడా పగిలిపోయాయని ప్రచారం జరుగుతోంది. దీనిని ప్రభుత్వం కూడా ఖండించలేదు. పంప్‌హౌస్‌లలో నీటిని తోడేందుకు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావడం లేదని కూడా పత్రికలలో వచ్చింది. అధికారులు మాత్రం రోజుకో కారణం చెబుతున్నారు.

నిజానికి అక్కడి నీళ్లను తోడేయడం మెఘా లాంటి పెద్ద కాంట్రాక్టు సంస్థకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. పగిలిపోయిన గేట్లను సరి చేయకుండా నీళ్లను తోడడానికి మోటార్లను అమర్చితే ఎన్ని రోజులు డీవాటరింగ్‌‌ చేసినా గోదావరి నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయని, అందుకే కంపెనీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. సుందిళ్ల వద్ద 8.83 టీఎంసీల సామర్థ్యంతో సముద్ర మట్టానికి 130 అడుగుల ఎత్తున పార్వతి బ్యారేజీని నిర్మించారు. గతంలో గోదావరికి వచ్చిన వరదలను లెక్కలోకి తీసుకునే దీనిని నిర్మించారు. 13 లక్షల 50 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునే స్థాయిలో కరకట్టల నిర్మాణం జరగకపోవడం, అది కుంగడం నాణ్యతా లోపానికి అద్దం పడుతోందని జలవనరుల నిపుణుల మాట.

అప్పుడే నష్టమెంతో తేలేది

డి-వాటరింగ్‌ ప్రక్రియ పూర్తయితేనే నిపుణులు ప్రాథమికంగా అంచనా వేసి, నష్టం ఎంతో తేల్చే అవకాశం ఉంది. మోటర్లు నీటిలోనే మునిగిపోతే, వాటి తడిని తొలిగించేందుకు 17 మోటర్లను హీట్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి కనీసం నెలన్నర నుంచి రెండు నెలల సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత మోటర్లను రన్‌ చేయాలి. అవి రన్‌ అయ్యి నీటిని లిఫ్ట్‌ చేస్తే చిన్నపాటి ఖర్చుతో తిరిగి వినియోగంలోకి తేవచ్చని, రన్‌ కాకపోతే విదేశాల నుంచి ఇంజినీర్ల బృందాన్ని తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు. దీనికి కనీసం రెండు మూడు నెలల సమయం పట్టొచ్చని అంచనా. ఇక, రక్షణ గోడ కూలడం వలన డ్యామేజీ జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఈ విషయాలేవీ నిర్ధారణ చేయకుండానే పంప్‌హౌస్‌ల మునకతో నష్టం రూ.25 కోట్లేనని నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో, వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రకటన చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాళేశ్వరం వద్ద నిషేధాంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. కనీసం మీడియాకు కూడా అనుమతి లేకపోవటంతో వాస్తవ పరిస్థితులు బయటకు రావడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. నీట మునిగిన పంపుహౌస్‌ను పరిశీలించేందుకు ప్రయత్నించినవారందరినీ అరెస్టు చేస్తున్నారు.

ఇందుకు కారణం ఏమిటి?

1986లో గోదావరికి అతి పెద్ద వరదలు వచ్చాయి. అప్పుడు 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇప్పుడు 26 లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే పరీవాహక ప్రాంతం మునిగిపోవడానికి కారణం ఏమిటో ప్రభుత్వం చెప్పాలి. లోపం ఉంది కాబట్టే, గతం కంటే తక్కువ నీరు వచ్చినప్పటికి మునిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాటి 'ప్రాణహిత' ప్రాజెక్టును యథాతథంగా తుమ్మిడిహెట్టి వద్దనే మొదలు పెట్టి కట్టి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవే కాదని అంటున్నారు. సొరంగాలు సురక్షితంగా ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికి అయినా తెలంగాణ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, సమూల మార్పులను చేర్చడానికి సమీక్ష ప్రక్రియను ప్రారంభించాలి.

డా. బి. కేశవులు. ఎండీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659.

Advertisement

Next Story