బాధ్యులెవరు.. బాధ్యతెవరిది..?

by Vinod kumar |   ( Updated:2023-03-30 01:00:14.0  )
బాధ్యులెవరు.. బాధ్యతెవరిది..?
X

ఏ వ్యవస్థ అయినా దాన్ని నడిపించడానికి ఒకరో ఇద్దరో వ్యక్తులుంటారు. మంచికైనా, చెడుకైనా వారిదే బాధ్యత. పేపర్ లీకేజీ వ్యవహారంలో లోపం ఎక్కడ, ఎందుకు జరిగిందో దర్యాప్తులో తేలకముందే తప్పంతా ఆ ఇద్దరు వ్యక్తులదే అని తేల్చేశారు సదరు మంత్రి. దీంతో ఉన్నతస్థానంలో ఉన్నవారిని వివాదం నుంచి తప్పించేశారు. స్వయంగా మంత్రే ఈ నిర్ణయానికి రావడంతో ఇక దర్యాప్తు జరుపుతున్న ‘సిట్’ మాత్రం ఇంతకంటే భిన్నంగా ఎలాంటి ముగింపునకు రాగలుగుతుంది? మంత్రి చేసిన వ్యాఖ్యలు ‘నేరం నాది కాదు ఆకలిది’ అనే సినిమాను తలపిస్తున్నాయి. తప్పు వ్యవస్థది కాదు.. ఆ ఇద్దరు ‘దుర్మార్గులది’ అని చెప్పడం ద్వారా ఆ వ్యవస్థను నడిపే ఇద్దరికీ ఎలాంటి జవాబుదారీతనం లేదని తేల్చేశారు.

మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తేనో, చెడుమార్గంలో పోతేనో తల్లిదండ్రులదే బాధ్యత అంటాం. ఏదేని కారణాలతో దేశం నష్టపోతే ప్రధానిదో లేక నిర్దిష్టంగా ఆ శాఖ మంత్రిదో బాధ్యత పడాలని అంటాం. రాష్ట్ర స్థాయిలో జరిగితే దానికి ముఖ్యమంత్రిని లేదా సంబంధిత శాఖ మంత్రిని జవాబుదారీ చేస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో మాత్రం అలాంటిదేదీ కనిపించడంలేదు. “ఇది వ్యవస్థ లోపం కాదు.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు..” అని స్వయంగా మంత్రే అంటున్నారు. జరిగిన నిర్వాకానికి ఆ ఇద్దరు ‘దుర్మార్గులే’ కారణమని మంత్రి తేల్చేశారు. ఆ కమిషన్‌ను నడిపించే ఉన్నత స్థానంలో ఉన్నవారికి ఎలాంటి బాధ్యత లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు.

నిజానికి ఆ ఇద్దరు వ్యక్తులను పర్యవేక్షించే పెద్దల నిర్లక్ష్యం, జవాబుదారీతనం గురించి సదరు మంత్రి నుంచి సమాధానం లేదు. ఏ వ్యవస్థ అయినా దాన్ని నడిపించడానికి ఒకరో ఇద్దరో వ్యక్తులుంటారు. మంచికైనా, చెడుకైనా వారిదే బాధ్యత. పేపర్ లీకేజీ వ్యవహారంలో లోపం ఎక్కడ, ఎందుకు జరిగిందో దర్యాప్తులో తేలకముందే తప్పంతా ఆ ఇద్దరు వ్యక్తులదే అని తేల్చేశారు సదరు మంత్రి. దీంతో ఉన్నతస్థానంలో ఉన్నవారిని వివాదం నుంచి తప్పించేశారు. స్వయంగా మంత్రే ఈ నిర్ణయానికి రావడంతో ఇక దర్యాప్తు జరుపుతున్న ‘సిట్’ మాత్రం ఇంతకంటే భిన్నంగా ఎలాంటి ముగింపుకు రాగలుగుతుంది? ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత నివేదిక ఎలా వస్తుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు.

మచ్చ పడింది వ్యవస్థపైనే..

లోపాలు, పొరపాట్లు, నిర్లక్ష్యం వ్యక్తుల ద్వారానే జరుగుతాయి. వారివారి స్థాయినిబట్టి అది నిర్దిష్టంగా ఆ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నిజానికి ఇద్దరు వ్యక్తుల కారణంగానే పేపర్ లీక్ అయిందంటే ఆ వ్యవస్థ నిర్వహణలో ఎన్ని లోపాలకు బాధ్యులెవరు? నిర్దిష్టమైన నిబంధనల మేరకు కమిషన్‌ను నడపాల్సిన చైర్మన్, సెక్రటరీ వైఫల్యాన్ని ప్రశ్నించేదెవరు? క్రిందిస్థాయి సిబ్బంది తగిన క్రమశిక్షణ ప్రకారం నడుచుకోకపోతే పర్యవేక్షకులుగా ఉన్న వీరి జవాబుదారీతనమేంటి? కమిషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి నిర్దిష్టమైన బాధ్యతలే ఉంటాయి. వాటిని నిరంతరం పర్యవేక్షించడం, గాడి తప్పుతున్నప్పుడు చక్కదిద్దడం వారి బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే వ్యవస్థ బాగుంటుంది.

ఈ డ్యూటీలో జరిగిన వైఫల్యమే ఇప్పుడు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొచ్చింది. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లింది. వారి ఆగ్రహంలో అర్థమున్నా పరిష్కారం లేకుండాపోయింది. తప్పుచేసినట్లు రుజువైతే న్యాయస్థానాలు శిక్షలు విధిస్తాయి. పశ్చాత్తాపమో, పరివర్తనో వస్తుందని, మరోసారి ఆ తప్పు చేయరనే ఉద్దేశంతో వారిని జవాబుదారీ చేస్తాయి. తప్పుచేసినవారిలోనూ ఒక రకమైన భయం కలుగుతుంది. అది లేనప్పుడు విచ్చలవిడితనం, ఏది చేసినా చెల్లుబాటవుతుందనేది స్థిరపడుతుంది. ఇప్పుడు పేపర్ లీక్ విషయంలో కమిషన్ తరఫున బాధ్యత కలిగినవారిపై చర్యలు లేకపోవడంతో నిరుద్యోగుల్లో ఆ అభిప్రాయమే ఏర్పడింది. చివరకు కమిషన్‌పైనే మచ్చ పడింది.

క్రెడిట్‌కు ఓకే.. ఫెయిల్యూర్‌కు మాత్రం..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు గురించి చెప్పుకోవాల్సిన పని లేదని, 13 రాష్ట్రాల కమిషన్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కితాబునిచ్చాయంటూ మంత్రి గొప్పగా చెప్పుకున్నారు. వ్యవస్థ భేషుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తంచేశారు. ఆ రూపంలో కమిషన్ పనితీరుకు క్రెడిట్ తీసుకున్నారు. తాజాగా జరిగిన నిర్వాకానికి కూడా నిజాయితీతో వ్యవస్థ తప్పిదంగా ఒప్పుకుని ఉంటే సమస్యే ఉండేదికాదు. దాన్ని సంస్కరించడానికి, ఇకపైన ‘ఫూల్-ప్రూఫ్’గా తీర్చిదిద్దడానికి అడుగు ముందుకు పడేది. విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం కాకుండా ఉండడానికి దోహదపడేది. కానీ ఫెయిల్యూర్‌ను మాత్రం ఇద్దరు వ్యక్తులకే పరిమితం చేసేలా మంత్రి వ్యవహరించడం ప్రశ్నార్థకంగా మారింది.

మంత్రి చేసిన వ్యాఖ్యలు ‘నేరం నాది కాదు ఆకలిది’ అనే సినిమాను తలపిస్తున్నది. తప్పు వ్యవస్థది కాదు.. ఆ ఇద్దరు ‘దుర్మార్గులది’ అని చెప్పడం ద్వారా ఆ వ్యవస్థను నడిపే ఇద్దరికీ ఎలాంటి జవాబుదారీతనం లేదని తేల్చేశారు. ఘోరమైన రైలు ప్రమాదం జరిగినప్పుడు మంత్రిగా లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. లోకో పైలట్ల కారణంగా ప్రమాదం జరిగింది. ‘నాకేం సంబంధం’ అని ఆయన భావించి ఉంటే భేషుగ్గా మంత్రిగా కంటిన్యూ అయి ఉండేవారు. ఇప్పుడు లీకేజీ విషయంలో నష్టపోయిన విద్యార్థులు అలాంటి రాజీనామాలను కోరడంలేదు. కమిషన్ నిర్వాహకుల నైతిక బాధ్యతను, జవాబుదారీ తనాన్ని ప్రశ్నిస్తున్నారు. వారి నిర్లక్ష్యానికి చర్యలేవని నిలదీస్తున్నారు.

లీకేజీల్లో రాష్ట్రాలతో పోటీయా..?

‘గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి.. అక్కడి మంత్రులు రాజీనామా చేశారా’ అని మంత్రి ప్రశ్నించడం నిరుద్యోగుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. మధ్యప్రదేశ్ ‘వ్యాపమ్’ కుంభకోణంలో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేశారా అని కూడా సదరు మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి ఎదురుప్రశ్నలతో ఇప్పుడు ఎవరూ రాజీనామా చేయరు అనే అంశాన్ని నొక్కిచెప్పినట్లయింది. ఇతర రాష్ట్రాల్లో జరిగే కుంభకోణాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువే అని మంత్రి చెప్పదల్చుకున్నారు. ఇతర రాష్ట్రాలతో ఉండాల్సిన పోటీ ఇదేనా ఎన్ని ఎక్కువ తప్పులు జరిగితే అంత ప్రగతి సాధించినట్లు లెక్క వేసుకోవాలా? ఆ రాష్ట్రాల్లో జవాబుదారీతనం కనిపించనప్పుడు తెలంగాణకు మాత్రం ఎందుకుండాలి? అనేది మంత్రి లాజిక్ కాబోలు!

‘నాకేం సంబంధం’ అని మంత్రి చేసిన కామెంట్లను పక్కన పెడదాం. పేపర్ లీకేజీలో ఎవరికి సంబంధం ఉందనేది తేలాలి. ఇప్పుడు బైటపడింది కాబట్టి చర్చించుకుంటున్నాం. గుట్టుచప్పుడు కాకుండా గతంలోనూ ఇలాంటి తప్పిదాలు జరిగాయేమో.. ఉద్యోగాల్లో చేరిపోయినవారిలో ఎంతమందికి ఇలాంటి లీక్‌లు చేరిపోయాయో.. వాటి లోతుల్లోకి కూడా వెళ్ళి దర్యాప్తు జరపాలి.. అంటూ నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తే సదరు మంత్రి ఏం సమాధానం చెప్తారు? మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే దోషులెవరో ముఖ్యమంత్రి తేల్చేశారు. ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలోనూ ‘సిట్’ ఏర్పాటు కాకముందే ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగిన తప్పు అంటూ మంత్రి డిసైడ్ చేసేశారు.

విశ్వసనీయత ఏర్పడడం ఎలా..?

నియామకాల విషయంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తే ఉన్నది. ప్రభుత్వ పెద్దలు లక్షల్లో ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నా యువత అభిప్రాయం ఇందుకు భిన్నం. తొలి కమిషన్ హయాంలో కోర్టు వివాదాలతో 40 వేల లోపు ఉద్యోగాలు మాత్రమే సాధ్యమైంది. రెండో టర్ములో ఇప్పటికి ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఒక్క ప్రశ్నాపత్రమే లీకైందని తేలినా చివరకు నాలుగైదు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇంకెన్నింటిని రద్దు చేస్తుందో అనే ఆందోళన కూడా ఉన్నది. ప్రభుత్వంపై యువతలో అసంతృప్తి, ఆగ్రహం ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై విశ్వసనీయత లేకుండా పోయింది. దాని పనితీరు, ప్రభుత్వ నిర్లక్ష్యమే అందుకు కారణం.

రాజ్యాంగబద్ధంగా పనిచేసే స్వతంత్ర సంస్థ అని ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తున్నదనేది యువతలో మాత్రమే కాక ప్రతిపక్షాల నేతల్లోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం. ‘ప్రభుత్వానికేం సంబంధం’ అని ప్రశ్నిస్తున్న మంత్రి... కమిషన్ తరఫున ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. దర్యాప్తు కోసం ‘సిట్’ను ఏర్పాటు చేశాంగదా అని ప్రభుత్వం సర్దిచెప్పుకుంటున్నది. కానీ అలాంటి ‘సిట్’లపైన నమ్మకం లేదని, గతంలో డ్రగ్స్ కేసు, నయీం కేసు తదితరాలను ప్రస్తావిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థగా అటు గవర్నర్‌కూ జోక్యం లేక.. ఇటు ప్రభుత్వానికీ పట్టక.. కమిషన్‌లోని చైర్మన్, సెక్రటరీలకూ జవాబుదారీతనం లేక.. చివరకు ఈ కమిషన్‌పై బాధ్యతెవరిది... జరిగిన తప్పుకు బాధ్యులెవరనేది సమాధానం లేని సందేహంగా మిగిలిపోయింది. పోయిన విశ్వసనీయతను పొందడం సవాలుగా మారింది.

ఉన్నది ఉన్నట్లు

ఎన్ విశ్వనాథ్




Advertisement

Next Story