చిన్నమ్మ రీఎంట్రీ వ్యూహం ఎవరిది..?

by Ravi |   ( Updated:2024-06-22 00:45:59.0  )
చిన్నమ్మ రీఎంట్రీ వ్యూహం ఎవరిది..?
X

ఏపీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సాధించిన ఘన విజయం తమిళనాడులోనూ అటువంటి కూటమి ఆవశ్యకతను తెలియజేస్తోంది. ముఖ్యంగా బీజేపీకి ఆ అవసరం ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రలో ఏర్పడ్డ కూటమి వంటిది తమిళ నాడులోనూ ఏర్పడాలి. ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

తమిళనాడులో స్వర్గీయ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఆమె నీడలా మెలుగుతూ శశికళ రాష్ట్రంలో పాలన పరంగానూ, పార్టీ పరంగానూ చక్రం తిప్పేవారు. అది అప్పట్లో పలు వివాదాలకు కూడా కారణం అయింది. ఎంజీ రామచంద్రన్ మరణానంతరం పార్టీ తిరస్కారానికి, అవమానాలకు గురై ఒంటరి ఐన జయలలిత తన మేధ, తన తీరుతో పుంజుకుంటూ కరుణానిధికి పోటీగా రాటుదేలుతున్న సమయంలో శశికళ, ఆమె బంధువర్గం జయలలితకు తోడూ నీడ అయ్యారు. జయలలితకు వాళ్లు అంగరక్షకులుగా కూడా నిలిచారు. జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత నుంచీ ఆమె గెలుపు ఓటముల్లో శశికళ భాగమయ్యారు.

పళనిస్వామి బలహీనుడవుతుండటంతో..

అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం పూర్తిగా శశికళ పట్టులో ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో శశికళ వ్యక్తులే కీలక స్థానాల్లో ఉండేవారు. కీలకమైన ప్రభుత్వ అధికారులుగా కూడా శశికళ వ్యక్తులనే నియమించారు. ఒక కేసులో శిక్ష పడి శశికళ జైలుకు వెళ్లగా ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా శశికళ విధేయుడే. శశికళ పాదాలపై పడి ఆశీర్వాదం పొంది సీఎం అయిన వ్యక్తే. శశికళ జైలుకు వెళ్లాక పళనిస్వామి పార్టీపై తన పట్టు బిగించి పార్టీని సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలో శశికళను పూర్తిగా పార్టీకి దూరం చేశారు. అందువల్ల శిక్షాకాలం ముగించుకుని వచ్చిన శశికళ రాజకీయాలకు, పార్టీకి దూరంగానే ఉండాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి అధ్యక్షతన ఏఐఎడీఎమ్‌కె పార్టీ ఓడిపోయి డీఎమ్‌కే పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీ ఓటమినే చవి చూసింది. పళనిస్వామి పార్టీలోనూ, ప్రజా క్షేత్రంలోనూ బలహీనుడవుతున్నారు.

పొత్తు కుదిరి ఉంటే..

లోక్ సభ ఎన్నికలయ్యాక, శశికళ ఏఐఎడీఎమ్‌కె పార్టీ శ్రేణులతో సమావేశమవడం, తదుపరి కార్యాచరణకు సిద్ధమవడం తమిళనాడులో చర్చోపచర్చలు మూలం, మూలకం అవుతోంది. తమిళనాడులో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతాన్ని పెంచుకోగలిగినా ఏ ఒక్క స్థానాన్ని సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఏఐఎడీఎమ్‌కె పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై సుముఖంగా లేనందువల్ల పొత్తు కుదరలేదు. అందుకు కారణం పళనిస్వామి, మరి కొందరు పార్టీ పెద్దల ప్రవర్తన అని బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీ, ఏఐఎడీఎమ్‌కే మధ్య పొత్తు కుదిరి ఉంటే ఇరు పార్టీలకూ ఎన్నికల్లో ఇప్పటికన్నా మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవన్నది నిర్వివాదం.

రాజకీయ పునరాగమనం తథ్యమేనా?

ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వం పార్టీకి పనికిరానిదిగా మారిందన్నది కొందరి ఆలోచన. అంతేకాకుండా భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఏర్పడాలంటే ప్రస్తుత ఏఐఎడీఎమ్‌కె కార్యనిర్వాహక వర్గం అందుకు ఆటంకం కానుంది. బీజేపీ, ఏఐఎడీఎమ్‌కేల పొత్తు ఇరు పార్టీలకూ అవసరమే. ఇరు పార్టీ శ్రేణులకూ ఈ విషయం తెలుసు. బీజేపీ కేంద్ర నాయకత్వం మద్దతు శశికళకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని లేదా ఇప్పటికే శశికళ విషయంగా బీజేపీ కేంద్ర నాయకత్వం సుముఖత చూపే పరిస్థితి ఏర్పడి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అమిత్ షా ప్రోత్సాహం, ప్రోద్బలం, అండ శశికళకు ఉంటుందని లేదా ఈపాటికే అవి అంది ఉండచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. పొత్తుతో ఇరు పార్టీలూ లాభపడాలంటే పళనిస్వామి నాయకత్వం పనికిరాదన్న పరిస్థితిలో శశికళ రాజకీయ పునరాగమనం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

రోచిష్మాన్

94440 12279

Advertisement

Next Story

Most Viewed