- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు!
ఈ దేశంలో కింది కులస్థులకు రిజర్వేషన్లు గనుక అంబేద్కర్ ఇవ్వకపోయింటే కింది జాతుల వారు ఇంకా మూతికి ముంత ముడ్డికి చీపురుతో కనీసం మౌలిక వసతులు కూడా కానరాక ఊరికి దూరంగా నాగరికతకు అవతల అడవిలో కందమూలాలను తింటూ కనీసం బట్టలేకుండా బరిబత్తల బతికేవారు. రాజ్యాంగమిచ్చిన రిజర్వేషన్లు సామాజికమైనవే తప్ప ఆర్థికపరంగా కాదనీ తెలిసినా, అవకాశం కల్పించుకొని ఆర్థికపరంగా కూడా ఇవ్వవచ్చునని రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాదని అగ్రకులస్తులకు 2019, 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. రిజర్వేషన్లు 50% మించరాదనే సుప్రీంకోర్టు నియమాన్ని పక్కకుపెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10శాతం ఆమోదించింది కేంద్రం. తద్వారా 60% రిజర్వేషన్ పెరిగింది. అలాంటప్పుడు ఓబీసీలకు కూడా ఇదే విధానం తీసుకొని మరొక 25% పెంచి 85% పెంచడానికి ఏ కోర్టు తీర్పులు, ఏ నిబంధనలు అడ్డం వస్తాయి?
3% జనాభాకి 10% రిజర్వేషన్లా?
నిన్న ప్రకటించిన తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లోనూ ఇదే నిరూపితమైంది. దీన్నిబట్టి మనకు ఈ కోటా ద్వారా మన బహుజన ఉత్పత్తి కులాలు ఎంత తీవ్రంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో 2011 సెన్సెస్ ప్రకారం ఆరు కోట్ల మంది అగ్రకులాల జనాభా ఉంది. అంటే దేశ జనాభాలో 15% అయితే వీరిలో పేదలు లేకపోలేదు. ఈనాటికీ కూడా కనీసం మౌలిక సదుపాయాలు సమకూర్చుకోలేని వారున్నారు. కానీ వారు 3% లోపే ఉన్నారు. అలాంటప్పుడు 10% రిజర్వేషన్లు కల్పించడం ఏ శాస్త్రీయ కోణంలో ధర్మాసనం నిర్ణయం తీసుకున్నదో అర్థం కాలేదు. పైగా ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయించింది. దీనిని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టింది. ఒక బీసీ, ఒక ఓసీ మధ్య ఆర్థికపరంగా హెచ్చుతగ్గులున్నా, సామాజికంగా ఓసీలే ముందుంటారు. ఎంత ఆర్థిక మూలాలున్నప్పటికీ వీరిద్దరి మధ్య చాలా తేడాలుంటాయి. ఈ అంతర్గత విశ్లేషణను పక్కకుదోసి అగ్రకులాలకు కట్టబెట్టడం ఓబీసీలను నిండా ముంచడమే అవుతుంది.
రాజ్యాంగంలోని 15(4),16(4) ఆర్టికల్స్ ప్రకారం రిజర్వేషన్లు సామాజికంగా కల్పించాలని ఉంది. కానీ ఆర్థికపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఎక్కడా లేదు. రిజర్వేషన్లను సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించడం కోసం డా.అంబేడ్కర్ సూచించలేదు. ఇవి ఖచ్చితంగా సామాజిక విలువను, గౌరవ స్థాయిలను పెంచడానికే ఉపయోగపడాలని ఆయన సూచించారు. ఐనప్పటికీ మొదటిసారిగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలను తెరమీదికి తెచ్చింది కేంద్రం. అగ్రవర్ణాలకు రాని గరిష్ట పరిమితి నియమం ఓబీసీల రిజర్వేషన్లు పెంచమన్నప్పుడు ఎందుకు వస్తుందనేది మేధావుల వాదన! రాజ్యాంగ మౌలిక స్వరూపం అగ్రకులాలకు ఒక విధంగా బీసీ కులాలకు మరొక రకంగా ఉండటం న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయినట్లే అవుతుంది.
ఇప్పటికీ నాగరికత చూడని కులాలున్నాయి!
భారత రాజ్యాంగం దృఢ, అదృఢమైనది అంటే తప్పనిసరి ఐతేనే మార్చడానికి కొన్ని వెసులుబాటులు మనకు మనమే కల్పించుకున్నాము. దీనిని అడ్డం పెట్టుకొని కేంద్రం రాజ్యాంగ మార్పులను తమకు అనుకూలంగా మార్చుకొని బీసీ జాతులకు తీవ్ర నష్టం కల్గించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలో అల్ప సంఖ్యాపరంగా కేవలం 15% ఉన్న అగ్రకులస్తుల చేతిలో దేశంలోని 70-80% ఆస్తులలో వాటా ఉంది. సారవంతమైన భూములు, విలువైన ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఉద్యోగులుగా, పెద్ద రాజకీయ పదవులలో ఇంకా ప్రైవేటు రంగంలో కూడా వీరి పేర్లపక్కన జోడించే కులం తోకల ఆధారంగా వీరికి సమాజంలో గౌరవం, అత్యున్నత పదవులు వారి పాదాల చెంతకు వస్తున్నాయి. కింది కులాల వెలివేత ఇప్పుడు అదే స్థాయిలో ఉంది. కానీ రూపం మార్చుకుంది. ఒక సివిల్ సర్వెంట్ ఉద్యోగికి కూడా ఈ బాధలు తప్పడం లేదు. ఇప్పటికీ కింది జాతులు కొన్ని నాగరికత వాసన చూడలేదు! అక్షరం ముక్కరాక ఇంకా వేలిముద్రలతో తన ఉనికిని కాపాడుకునే దశలో ఉన్నారు. ఇప్పటికీ చెప్పులు చేతబట్టుకొని అగ్రకులాల వెంట బానిసలా బతుకుతున్నారు. తనకుతాను తక్కువస్థాయిలో ఊహించుకుంటూ మనమెంత మన జీవితమెంత అంటూ ఆత్మనూన్యతలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ కులమే ప్రధానం! అందుకే దీనిని ఓ కవి ఈ దేశంలో భూకంపం వచ్చి గోడలన్నీ కూలిపోయినా, కులం గోడలు చెక్కుచెదరకుండా ఉంటాయని రాసుకొచ్చాడు.
ఈ దేశంలో బహుజనుల చైతన్యం లేకనే రిజర్వేషన్ల మీద అవగాహన కొరవడి కనీసం చడిచప్పుడు లేకుండా పడివున్నారు. మనమీద కూసున్న అగ్రకులాలు మాత్రం రాత్రికి రాత్రే చట్టాలు శాసనాలు మారుస్తూ అజమాయిషీ చేస్తుంటే మనం ఇంకా మూఢనమ్మకాలు, వెలివేతలు, నిరక్షరాస్యులుగా, ఓట్లు అమ్ముకునేవారిగా, బానిసలుగా, కూలీలుగా, తాగుబోతులుగా ఉంటూ కాలం గడుపుతున్నాము. మనకు రాజ్యాధికారం వచ్చే అవకాశమున్నప్పటికీ, మనలో వందల యేండ్ల నుండి దాగివున్న కొన్ని విరుద్ధ భావాలు ముందుకు కదలనియడం లేదు. మన జాతులకు అందే ఫలాలను అగ్రకులాలు ఇలా ధర్మాసనాల ద్వారా అన్యాయంగా తీసుకపోతుంటే మనం చేతులు కట్టుకొని చూస్తుంటే మన రేపటి భవిష్యత్తు చీకటి యుగమే అవుతుంది.
-అవనిశ్రీ
కవి, రచయిత
99854 19424