- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర ఎవరి పక్షం?
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తరువాత జరుగుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అయితే అభివృద్ధి, సంక్షేమాలలో దేన్ని మరచినా ప్రజలు సహించరని ఇప్పటికే అనేక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కావున కేవలం అభివృద్ధి నినాదంతోనో లేదా సంక్షేమ మంత్రంతోనో అధికారంలోకి వచ్చేద్దామనే తంత్రాన్ని ప్రజలు ఈ మధ్య తిరస్కరిస్తున్నారు.
ఈసారి మహారాష్ట్రలో, జార్ఖండ్‌లో సంక్షేమ మంత్రం పనిచేస్తుందా? బీజేపీ పట్టు బిగిస్తుందా? కాంగ్రెస్ పుంజుకుంటుందా? శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా న్యాయపరంగా శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎన్సీపీ (అజిత్ పవార్)లకు గుర్తింపు లభించినా ప్రజాకోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? వంటి అనేక ప్రశ్నలకు నవంబర్ 20న ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు.
హర్యానా ఎన్నికల్లో..
హర్యానాలో కిసాన్, జవాన్, పహిల్వాన్ ఆందోళనలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు తోడుగా పదేళ్ల బీజేపీ పాలనపై వ్యతిరేకత కార ణంగా అధికారం మార్పు ఖాయమని అందరూ భావించారు. అలాంటి క్లిష్ట సమయంలో బీజేపీ తన అభ్యర్థులను ముందుగానే ప్రకటించి సంఘటితంగా ప్రచారంలో దూసుకుపోయింది. రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని మలచడంలో ఆర్ఎస్ఎస్ బృం దాలు నిర్విరామంగా కృషి చేశాయి. నేరుగా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయమని కాకుండా దేశ ప్రయోజనాలు, హిందుత్వం, సుపరిపాలన, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, అగ్నిపథ్ నియామకాలు, రైతు సమస్యలు వంటి అంశాల గురించి ప్రజలకు విడమరచి చెప్పి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మలచడానికి ఈ బృందాలు చేసిన కృషి సఫలం కావడం వల్ల అననుకూల వాతావరణంలో కూడా బీజేపీ విజయం సాధించింది. కాగా, హర్యానా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు, బలమైన దళిత నేత కుమారి సెల్జా ప్రచారానికి దూరంగా ఉండటం, ఆప్ పార్టీతో పొత్తు కుదుర్చుకోకపోవడం వంటి చర్యల వలన అనుకూల వాతావరణంలో కూడా కాంగ్రెస్ పరాజయం చెందింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో ఖంగు తిన్న బీజేపీకి హర్యానా ఎన్నికల విజయం కొంత సంతృప్తిని మిగిల్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమి ప్రభావంతో విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి బేరమాడే శక్తి తగ్గింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో 70 స్థానాల్లో ఇండియా కూటమి పక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నా, సింహ భాగం జేఎంఎంకే దక్కనుందని సమాచారం.
బీజేపీ వ్యూహాలు..
ఇక అసెంబ్లీ సీట్ల పరంగా ఉత్తరప్రదేశ్ తరువాత రెండవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్‌డీఏ, ఇండియా కూటములకు అత్యంత కీలకం. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యుబిటి) ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్‌తో కూడిన మహావికాస్ అఘాడి (ఎంవీఏ), బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎన్సీపీ (అజిత్ పవార్)ల కూటమి మహాయుతి అలయన్స్ మధ్య తీవ్రమైన ద్విముఖ పోటీ నెలకొంది. సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు వ్యతిరేకించి 2022లో శివసేన పార్టీని చీల్చి ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి బీజేపీతో కలిసి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తరువాత 2023లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని (ఎన్సీపీ) చీల్చి శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ మహాయుతి కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి 17 స్థానాల్లో, ఎంవీఏ 30 స్థానాల్లో విజయం సాధించారు. అయితే శాసనసభ ఎన్నికల్లో అంతక న్నా మంచి ఫలితాలు సాధిస్తామని ఎంవీఏ ఆత్మ విశ్వాసంతో ఉంది. 2019 శాసనసభ ఎన్నికల్లో 147 స్థానాల్లో పోటీ చేసినా హర్యానా ఎన్నికల నుండి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ మహారాష్ట్రలో 85 సీట్లతో సరిపుచ్చుకుని మిత్రపక్షాలతో సయోధ్య నిలుపుకుంది. మహాయుతి కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఇప్పటికే 121 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ హర్యానాలో అనుసరించిన ఫార్ములా ప్రకారం చిన్న చిన్న ప్రజా సమూహాలతో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాల సభ్యులు సమావేశం అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.25 లక్షల బృందాలతో ఇటువంటి భేటీలు జరిగాయని అంటున్నారు.
ఓట్ల సరళి..
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక అనంతరం జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఇండియా కూటమికి 43.71 శాతం, ఎన్డీఏ కూటమికి 43.55 శాతం ఓట్లు వచ్చినా కానీ 178 శాసనసభ స్థానాలున్న కీలకమైన పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మహాయుతి కూటమి కన్నా ఎంవీఏ కూటమి సుమారు 9.73 శాతం ఆధిక్యతలో ఉండటం గమనార్హం. మరాఠ్వాడా ప్రాంతంలో నయితే మహాయుతి కూటమి కేవలం 29 శాతం ఓట్లు తెచ్చుకుని ఎంవీఏ కన్నా 15.7 శాతం వెనుకబడింది. ఈనేపథ్యంలోనే రాజకీయ లబ్ధికోసం మూడేళ్ల క్రితమే సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, తిరస్కరించిన మరాఠా రిజర్వేషన్ అంశాన్ని తిరిగి తెరమీదకు తెచ్చారు. ఇండియా కూటమి పశ్చిమ మహారాష్ట్ర (47.8%), విదర్భ (46%), మరాఠ్వాడా (44.7%) ప్రాంతాల్లో ఆధిక్యత సాధించగా, ఎన్‌డీఏ కూటమి థానే, కొంకణి (47.8%), ముంబై (49.3%) ప్రాంతాల్లో ఆధిక్యత సాధించింది. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం లో ఇరు కూటములు దాదాపు సరి సమానంగా ఉన్నాయి. తొమ్మిది ఎస్సీ, ఎస్టీ లోక్‌సభ స్థానాల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే మహాయుతి కూటమి దక్కించుకోగలిగింది. శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలలో శివసేన (యుబిటి) 16.52 శాతం, ఎన్సీపీ (శరద్ పవార్) 19.27 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా శివసేన (ఏక్ నాథ్ షిండే) 12.95 శాతం, ఎన్సీపీ (అజిత్ పవార్) 3.60 శాతం ఓట్లతో వెనకబడ్డాయి.
ప్రజాకర్షక పథకాలు ప్రారంభించి..
పార్లమెంట్ ఎన్నికల వ్యతిరేకతతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి షిండే సుమారు లక్ష కోట్లు ఖర్చయ్యే ‘లడ్కీ బహెన్’ వంటి ఏడు ప్రజాకర్షక పథకాలను ప్రారంభించారు. రూ.20,151 కోట్లు రెవెన్యూ లోటు, రూ.1,10,355 కోట్ల ఆర్థిక లోటు, దాదాపు రూ.7 లక్షల కోట్లకు మించిన అప్పుల భారంతో సతమతమవుతున్న రాష్ట్రానికి ఈ పథకాలు తలకు మించిన భారంగా పరిణమించాయి. కొత్త పథకాల కోసం నిధుల మళ్లింపు వలన ఇప్పటికే అమలులో ఉన్న, ఉదాహరణకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చే పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆపేశారు. వివిధ ప్రాజెక్ట్ పనులు చేసిన గుత్తేదారులకు దాదాపు రూ.500 కోట్లు బకాయిలు ఉండటం వలన అభివృద్ధి పనులు నెమ్మదించాయి. కావున కేవలం అభివృద్ధి నినాదంతోనో లేదా సంక్షేమ మంత్రంతోనో అధికారంలోకి వచ్చేద్దామనే తంత్రాన్ని ప్రజలు ఈ మధ్య తిరస్కరిస్తున్నారు. ఈ సారి మహారాష్ట్రలో, జార్ఖండ్‌లో సంక్షేమ మంత్రం పనిచేస్తుందా? బీజేపీ పట్టు బిగిస్తుందా? కాంగ్రెస్ పుంజుకుంటుందా? శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా న్యాయపరంగా శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎన్సీపీ (అజిత్ పవార్)లకు గుర్తింపు లభించినా ప్రజాకోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? వంటి అనేక ప్రశ్నలకు నవంబర్ 20న ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు.
- లింగమనేని శివరామ ప్రసాద్
7981320543