- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్లకు ప్రమోషన్లు కల్పించేదెన్నడో!?
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది, రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టు టీచర్లు లేక స్కూళ్ళు ఇబ్బంది పడుతున్నాయి. వేలాది మంది అర్హతలు కల్గిన ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎనిమిదేళ్లుగా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అయినా, టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వరు, పోస్టులు భర్తీ చేయరు. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వాటిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దుస్థితి. రాష్ట్రంలో మొత్తం 33 డిపార్టుమెంట్లలో గత ఎనిమిదేళ్లుగా ప్రమోషన్లు ఇవ్వని ఏకైక డిపార్టుమెంట్ విద్యాశాఖే! అదీ కేవలం టీచర్లకు మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వరు. అదే శాఖలో బోధనేతర సిబ్బందికి నెలనెలా ఠంచన్ గా ప్రమోషన్లు ఇస్తున్నారు.
వాస్తవానికి టీచర్లకు ప్రమోషన్లు కల్పించడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేవు. కేవలం టీచర్ల బదిలీలపై మాత్రమే రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ఉన్నతాధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం, పాలకుల పట్టింపులేమితో టీచర్లకు ప్రమోషన్లు దక్కడం లేదు. ఏళ్ళ తరబడి పదోన్నతులు కల్పించకపోవడంతో ఉపాధ్యాయులకు తీవ్ర ఆవేదన కలుగుతోంది. నియామకమైన పోస్టులోనే సర్వీస్ కాలమంతా పనిచేసి, చివరికి ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే రిటైరయ్యే పరిస్థితి దాపురిస్తుందేమోనని టీచర్లు బాధపడుతున్నారు. అర్హతలు ఉండి, ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ పదోన్నతికి నోచుకోకుండానే వందలాదిమంది టీచర్లు ఇప్పటికే సర్వీస్ నుంచి రిటైరయ్యారు.
విద్యాప్రమాణాలు ఎలా వస్తాయి?
ఎలాంటి ప్రమోషన్ లేకుండా నియామకమైన పోస్టులోనే ఏళ్ళ తరబడి కొనసాగే టీచర్లు తమ విధి నిర్వహణలో ఉత్సాహం చూపగలరా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే అంశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, విద్యారంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారానికి అంత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి కదా? ముఖ్యంగా ఉపాధ్యాయ, పర్యవేక్షణాధికారుల పోస్టులను ఏళ్ళ తరబడి భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టడం పాఠశాల విద్యారంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం కలగజేస్తోంది. తొమ్మిదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేవలం ఒకే ఒకసారి 2015లో మాత్రమే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత ప్రమోషన్ల ఊసే లేదు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉద్యోగులకు నెలనెలా ప్రమోషన్లు కల్పిస్తూ, ఉపాధ్యాయులను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారు. పాఠశాలల పర్యవేక్షణ పోస్టులైన మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టుల భర్తీ పరిస్థితి మరీ ఘోరం. 2005లో చివరిసారిగా ఎంఈవో పోస్టులను పదోన్నతులతో భర్తీ చేశారు. అంతే! ఆ తర్వాత ఈ పద్దెనిమిది ఏళ్లలో ఒక్క ఎంఈవో పోస్టును కూడా నింపలేదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 528 ఎంఈవో పోస్టుల్లో, కేవలం 21 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు పనిచేస్తున్నారు. మిగతా 507 పోస్టులు ఖాళీయే.
ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టుల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర వ్యాప్తంగా 4421 ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టుల్లో 1982 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంఈవో, హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. నూటికి నూరు శాతం పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సిందే. సంవత్సరాల తరబడి హెడ్మాస్టర్లు లేని ఉన్నత పాఠశాలలు, ఎంఈవోలు లేకుండా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు సక్రమంగా నడుస్తాయా? విద్యాప్రమాణాలను ఆశించగలమా? ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో మొత్తం లెక్చరర్ పోస్టులు 286 కాగా, కేవలం 21 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే డిప్యూటీ ఈవో పోస్టుల దుస్థితీ అంతే. మొత్తం పోస్టులు 66 కాగా, కేవలం ఆరుగురు అధికారులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. మిగతా అరవై పోస్టులను పుష్కరకాలంగా నింపడంలేదు.
అంతా ఇంచార్జీలే!
జిల్లా విద్యాశాఖలో అత్యంత కీలకమైన డీఈవో పోస్టుల్లో సైతం ఇంచార్జీలే. ఇంకా విషాదం ఏంటంటే, కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాలకు డీఈవో పోస్టులే మంజూరు చేయలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటైన వెంటనే అన్ని శాఖలకు జిల్లా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్టులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖను విస్మరించింది. ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, డైట్ లెక్చరర్లు, డీఈవో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈవో అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంది. దీంతో పాఠశాలల పర్యవేక్షణ గాడి తప్పింది. రాష్ట్రంలో 45 శాతం హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు, 96 శాతం ఎంఈవో, 93 శాతం డైట్ లెక్చరర్ పోస్టులు, 91 శాతం డిప్యూటీ ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు ప్రమోషన్లతో భర్తీ కావాల్సిన వేలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతినెలా కౌన్సిలింగ్ నిర్వహించి టీచర్లకు పదోన్నతులు కల్పించి ఖాళీ పోస్టులను భర్తీ చేసేవారు. స్వరాష్ట్రంలో ప్రతినెల కాకపోయినా, కనీసం ఏడాదికి ఒకసారైనా టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే బాగుండేది.
ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు గతేడాది రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. దాంతో ప్రమోషన్లపై ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2023 వేసవి సెలవుల్లోనే టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి సైతం గత ఆరు నెలలుగా ఉపాధ్యాయ సంఘాలకు పదేపదే హామీ ఇవ్వడంతో తమ కల సాకారమవుతుందని ఉపాధ్యాయులు ఆశించారు. కానీ వేసవి సెలవులు మొదలై ఇప్పటికే నెల రోజులు గడిచిపోయాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయినా ప్రమోషన్ల ఊసే ఎత్తడం లేదు. టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే విద్యారంగానికి మేలు జరుగుతుందనీ, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయనే విషయాలను విస్మరించి, కేవలం ఉపాధ్యాయులకు ప్రయోజనం కల్పించే అంశంగా మాత్రమే ఉన్నతాధికారులు చూడడమే అసలు విషాదం. ప్రమోషన్లతో పాఠశాలల్లోని ఖాళీ పోస్టులు భర్తీ అయి, సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుంది. పర్యవేక్షణ పెరిగి పాఠశాలలు పకడ్బందీగా నడిచేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్లతో ఉపాధ్యాయులకు ఒకట్రెండు ఇంక్రిమెంట్ల వేతనం మాత్రమే పెరుగుతుంది. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారమూ స్వల్పమే.
కల్సికట్టుగా కృషి చేయాలి!
విద్యాశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఉపాధ్యాయుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు మేల్కోవాలి. భేషజాలను వదిలివేయాలి. తమ మధ్య ఉన్న విభేదాలను తాత్కాలికంగానైనా పక్కనబెట్టి కల్సికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. బదిలీలు, పదోన్నతులు, ఇతర సమస్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి అన్ని సంఘాలు ఇచ్చిన లేఖలను లెక్కిస్తే ఏటా వందల్లోనే ఉంటాయి. సంఘాలు మంత్రికి లెటర్లు సమర్పించడం, ఫోటోలు దిగి పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఓ తంతుగా, ప్రహసనంగా తయారైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన, సానుభూతి ఉంది. అయినా ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే, సీఎం స్థాయిలో రివ్యూ చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో, కల్సికట్టుగా ముందుకు వెళ్ళాలి. సీఎంను కలవాలి. సీఎం అధ్యక్షతన సమీక్ష నిర్వహించేలా ఒత్తిడి తేవాలి. స్కూల్ అసిస్టెంట్, హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులతో పాటు ఎంఈవో, డైట్ లెక్చరర్, డిప్యూటీ ఈవో, డీఈవో పోస్టులకు సైతం పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించాలి. అప్‌గ్రేడెడ్ భాషాపండిట్, పీఈటీ పోస్టులకూ ప్రమోషన్లు ఇవ్వాలి. శాసనసభలో సీఎం ప్రకటించిన పదివేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను వెంటనే మంజూరు చేసి, పదోన్నతులు కల్పించాలి. జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ల కోసం వేలాది మంది ఉపాధ్యాయులు రెండు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు. జెఎల్ ప్రమోషన్లకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అవసరమైతే, చట్టం తేవాలి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి.
-మానేటి ప్రతాపరెడ్డి
TRTF గౌరవాధ్యక్షుడు,
98484 81028